
నా భర్తను కావాలనే ఇరికించారు: సుజన
విశాఖపట్నం: ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్, సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్త అయిన ఇంటూరి రవికిరణ్ పై సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుందని ఆయన భార్య సుజన ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విశాఖ పోలీసులు రవికిరణ్ ను రెండు రోజుల కిందట అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖ సెంట్రల్ జైలుకు గురువారం వెళ్లిన సుజన తన భర్త రవికిరణ్ ను కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కావాలనే తన భర్త రవికిరణ్ ను లేనిపోని కేసుల్లో ఇరికించారని ఆవేదన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా తన భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇటీవల హైదరాబాద్ లో అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని బలవంతంగా ఏపీకి తరలించి రవికిరణ్ ను బెదిరింపులకు గురిచేసినా ప్రయోజనం లేకపోయిందని భావించి ఏకంగా అరెస్ట్ చేయించారు. ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ–1 మోహనరావు ఏప్రిల్ 26న రవికిరణ్‌కు నోటీసులు పంపారు. మే 4న విచారణకు రావాలని ఆదేశించారు. మే9న వచ్చేందుకు అనుమతి తీసుకుని మంగళవారం విశాఖకు వచ్చిన రవికిరణ్‌ను దాదాపు నాలుగు గంటలపాటు పోలీసులు విచారించి, ఆపై అరెస్ట్ చేశారు. రవికిరణ్‌కు కోర్టు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.