
సత్తెనపల్లి/సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం కెమిస్ట్రీ ప్రశ్న పత్రం లీకైందనే వార్త గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం కలకలం రేపింది. పరీక్ష ప్రారంభానికి గంట ముందే ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం ఇంటర్మీడియెట్ అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే విచారణ చేపట్టారు. గుంటూరు ఆర్‌ఐవో జెడ్‌ఎస్ రామచంద్రరావు, డీఈసీ మెంబర్ సి.హెచ్.వెంకటరమణ హుటాహుటిన సత్తెనపల్లి చేరుకున్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ప్రశ్నపత్రాలు తీసే సమయంలో సీసీ పుటేజీలు, సెంట్రీ రికార్డులు, పరీక్ష కేంద్రాల్లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కస్టోడియన్‌లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులను విచారించారు.
అనంతరం ఆర్‌ఐవో విలేకరులతో మాట్లాడుతూ.. సత్తెనపల్లిలో ఇంటర్ కెమిస్ట్రీ ప్రశ్న పత్రం లీక్ అయినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ప్రశ్నపత్రాలన్నింటిని పోలీసు స్టేషన్‌లో డిపాజిట్ చేశామని, ఉదయం 8.30 గంటలకు మెసేజ్ ప్రకారం ఎంపికచేసిన సెట్ ప్రశ్నపత్రాన్ని కస్టోడియన్ల సమక్షంలో సీఎస్‌లు, డీవోలు విత్‌డ్రా చేసుకుని తీసుకెళ్లారన్నారు. సత్తెనపల్లిలోని ఏడు పరీక్షా కేంద్రాల్లో ఉదయం 8.45 గంటల తరువాతే ప్రశ్నపత్రాల కవర్లు తెరిచారని చెప్పారు. ముందుగా లీక్ కావడానికి ఆస్కారం లేదని, అంతా తప్పుడు ప్రచారమేనని తేల్చిచెప్పారు.
లీక్ కాలేదు: ఇంటర్ బోర్డు
మంగళవారం నాటి కెమిస్ట్రీ ప్రశ్నపత్రం లీక్ అయ్యిందన్న వార్తలు విద్యార్థులను ఆందోళనకు గురిచేసిన నేపథ్యంలో దీనిపై ఇంటర్మీడియెట్ బోర్డు వివరణ ఇచ్చింది. అన్ని అంశాలను పరిశీలించాక లీక్ కాలేదని తేలిందని బోర్డు ప్రకటన విడుదల చేసింది. అయితే గుంటూరు ఆర్‌ఐవోకు ప్రశ్నపత్రం 11.15 గంటలకు వాట్సప్‌లో వచ్చిందని, ఎక్కడినుంచి వచ్చిందో తేల్చడానికి పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేయించామని పేర్కొంది.