బిడ్డను చంపేశారయ్యా... | Inter second year of suicide | Sakshi
Sakshi News home page

బిడ్డను చంపేశారయ్యా...

Published Sat, Apr 9 2016 12:53 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

Inter second year of suicide

గుంటూరు రూరల్ / ముప్పాళ్ల: ‘‘ఉన్నత విద్య చదివి ప్రయోజకుడై ఉద్దరిస్తాడనుకున్న బిడ్డను ఇలా చంపేశారయ్యా...అన్నింట్లో ముందే వాడు చివరకు చావులోను ముందుంటాడనుకో లేదయ్యా... చదువుల పేరుతో తన బిడ్డను తమకు కాకుండా చేశారంటూ  విద్యార్థి సుదర్శన్‌రెడ్డి తల్లి పద్మావతి హృదయ విదారకంగా విలపించింది. పండుగ పూట కూడా ఇంటిదగ్గర ఉండనీయకుండా చేసి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారయ్యా అంటూ ఆమె రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.

 
మండల కేంద్రం ముప్పాళ్లకు చెందిన లోకసాని గోవిందరెడ్డి, పద్మావతిల చిన్న కుమారుడు సుదర్శన్‌రెడ్డి(18) గుంటూరు రూరల్ మండలం తురకపాలెం రోడ్డులోని  శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదువుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశాడు. అనంతరం కళాశాలలోనే ఉంటూ ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండు రోజుల కిందట జేఈఈ మెయిన్స్ పరీక్షలు అనంతరం ఇంటికి వెళ్లి వచ్చాడు. శుక్రవారం కళాశాల 4వ ఫ్లోర్‌లోని 429 రూంలో ఫ్యానుకు పక్కనే ఉన్న ఇనుప కొక్కానికి నవ్వారును తాడులాగా పేనుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కళాశాల సిబ్బంది చెప్పారు. సమాచారం తెలుసుకుని వచ్చిన తల్లిదండ్రులు కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

 
కబురు చేయకపోవడం వెనుక కారణమేంటి..?

ఎంసెట్ విద్యార్థులకు ఒక్క రోజు ఔటింగ్ ఇవ్వడంతో శుక్రవారం విద్యార్థులంతా ఇళ్లకు వెళ్ళారు. దూరప్రాంతాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు మాత్రం ఇళ్లకు వెళ్ళకుండా ఉండిపోయారు. మధ్యాహ్నం కళాశాలలో ఉన్న ఏడుగురు విద్యార్థులు భోజనం చేసి వారికి కేటాయించిన గదుల్లో విశ్రమించారని, సుదర్శన్ రెడ్డి మాత్రం 4వ ఫ్లోర్‌లోని 429 రూంలో ఫ్యానుకు పక్కనే ఉన్న ఇనుప కొక్కానికి నవ్వారును తాడులాగా పేనుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కళాశాల సిబ్బంది చెప్పారు.  తమ కుమారుడు మృతి చెందిన సంఘటన మధ్యాహ్నం 3 గంటలకు కళాశాల నుంచి ఎవరో ఫోన్ చేసి చెబితే కానీ తమకు తెలియలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కనీసం కళాశాల యాజమాన్యం కబురు చేయకపోవటం అనుమానంగా ఉందని తెలిపారు.

 
బంధువుల అనుమానాలు..
.
తమ కుమారుడు ఎవ్వరికీ హాని చేసేవాడు కాదని కేవలం కళాశాల యాజమాన్యం అశ్రద్ధ, తోటి విద్యార్థుల వల్లే తమ బిడ్డ మృతి చెందాడని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు వాపోయారు. సంఘటనా స్థలిలో పరిశీలిస్తే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. తమ కుమారుడు ఉండే రూంలో కాకుండా వేరే గదిలోకి వెళ్లి ఉరి వేసుకోవటం, ఉరి వేసుకున్న చోట కాకుండా మరో చోట పడి ఉండడం, తల్లిదండ్రులు వచ్చి చూసే లోగా కళాశాల యాజమాన్యం మృతదేహాన్ని పక్కన పడుకోబెట్టటం వంటివి చూస్తుంటే తమకు అనుమానాలు వ్యక్త మవుతున్నాయని బంధువులు ఆరోపించారు.

 
గ్రామంలోను విషాదఛాయలు...

సుదర్శనరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చదువుల్లో చురుగ్గా ఉండే సుదర్శనరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలియగానే మిత్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. రెండు వారాల క్రితం గ్రామానికి చెందిన ఎంసీఎ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement