- పంట రుణమాఫీ తప్పుకునేందుకు కొత్త ఆఫర్లు
- అప్పు చెల్లిస్తే వడ్డీ రిబేటు ఇస్తామంటూ బేరం
- పంట బీమా వర్తించదంటూ నోటీసులు
- లబోదిబోమంటున్న రైతులు
ఓ మారు అతివృష్టి, మరోమారు అనావృష్టి, ఇంకోమారు ప్రభుత్వ అనాలోచిత విధానాలతో తీవ్ర నష్టాలపాలవుతున్న రైతుల పాలిట బ్యాంకర్ల నోటీసులు గోరుచుట్టుపై రోకటిపోటులా వెంటాడుతున్నాయి. అసలే రుణమాఫీ విషయంలో తీవ్ర అయోమయానికి నిత్య గందరగోళానికి గురౌతున్న రైతన్నను ప్రభుత్వం, బ్యాంకర్లు ప్రకటిస్తున్న కొత్త ఆఫర్లు మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
గుడ్లవల్లేరు :కొత్త ప్రభుత్వం హాయాంలో రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రుణమాఫీతో సహా సరికొత్త పథకాలు వర్తింపజేస్తారనుకుంటే రైతుల్ని ముంచేసే అర్ధంకాని ఆఫర్లు ఇస్తూ రుణమాఫీనుంచి తప్పించుకునేందుకు చూడడం చంద్రబాబు నైజాన్ని మరోమారు చాటిందని రైతులు విమర్శిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే ఈ నెల 30వ తేదీ లోగా పంట రుణాల్ని చెల్లించేసిన రైతులకు వడ్డీ రిబేటు ఇస్తామన్న కొత్త ఆఫర్‌తోపాటు 2013 ఆగస్టు ఒకటవ తేదీ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులకు పంట బీమా వర్తించదని వివరిస్తూ కౌతవరం ఆంధ్రాబ్యాంకు నోటీసు బోర్డులో ప్రకటించారు.అలాగే స్థానిక పీఏసీఎస్ నుంచి కూడా రుణమాఫీ హామీని తప్పించుకునే విధంగా కొన్ని కరపత్రాల్ని రైతుల ఇంటింటికీ పంచిపట్టారు.దీనికి సమ్మతిస్తేనే, పంట రుణాలకు ముందుకు రావాలంటూ ఆ నోటీసులో ప్రకటించడం రైతుల్ని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. చంద్రబాబు విధానం చూస్తుంటే 2003 నాటి పాలన గుర్తుకు వస్తుందని బాధిత రైతులంటున్నారు.
వ్యవసాయం దండగ అన్న ఆయన ఆ జ్ఞాపకాలకు తిలోదకాలివ్వలేకే తొలి సంతకంలోనే నైజాన్ని చాటుకున్నారని విమర్శిస్తున్నారు. కళ్ల ముందు ఖరీఫ్ సాగు కనబడుతుందని, ఇంకా ఎన్ని రోజుల తర్వాత రుణమాఫీ ప్రకటిస్తారని అడుగుతున్నారు. కాగా గుడ్లవల్లేరు మండలంలోని ఒక్క కౌతవరం ఆంధ్రాబ్యాంకు పరిధిలోనే 30మంది రైతులకు పంట రుణాలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. దాదాపు రూ.12లక్షల మేరకు బంగారు నగల మీద సాగుకు రుణాలు తీసుకున్నారు.
ఈ రుణాల్ని వెంటనే చెల్లించకపోతే 28వ తేదీన రుణగ్రస్తుల బంగారు నగల్ని వేలం వేస్తున్నట్లు నోటీసులు జారీచేశారు. బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి నోటీసులు ఇవ్వాల్సిందిగా తమకు ఆదేశాలు వచ్చినందునే నోటీసులు ఇచ్చామని కౌతవరం ఆంధ్రాబ్యాంకు మేనేజరు ప్రసాద్ చెబుతున్నారు. పొలాల పాసు పుస్తకాల నకలు పెట్టి రుణాలు తీసుకోని బంగారు నగల రుణగ్రస్తుల్ని వ్యాపారులుగా గుర్తించి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు.
రెండెకరాలు చేస్తున్నా...
వ్యవసాయానికే రుణం తీసుకన్నా. రూ.79వేలు సాగుకు ఖర్చయ్యింది. ఇపుడు మేనేజరు పొలం కాగితాలు పెట్టలేదు కాబట్టి అప్పు కట్టాల్సిందేనని అంటున్నారు. మాకు రుణమాఫీ చేయకుండా బడారైతులకే ఆ పథకం వర్తింపజేచేలా చేసేలా ఉన్నారు.
- షేక్ అల్లాబక్షు, కౌతవరం రైతు
రోజుల్లో చెల్లించమంటే ఎలా?
నాలుగు రోజుల్లో పంట రుణం చెల్లించమని నోటీసులిస్తే, ఎలా చెల్లించగలం. మూడెకరాల పొలాన్ని సాగు చేస్తున్నా. నగలు తీసుకెళ్లకపోతే ఈ నెల 28వ తేదీన బహిరంగ వేలం వేసేస్తానని బ్యాంకువారు అంటున్నారు. రుణమాఫీ చేసేంతవరకూ రుణాలు చెల్లించనే చెల్లించం.
- ఈడె చలపతిరావు, కౌతవరం రైతు
మహిళా రైతులెంతమంది....
ఐదెకరాల పొలాన్ని సాగు చేస్తున్నా నన్ను రైతును కాదంటే ఎలా? రైతును కాదంటూ బంగారం అప్పు కట్టమని నోటీసులివ్వడం దారుణం. మహిళా రైతులంటున్నారు. నూటికి అలాంటి రైతులు ఎంతమంది ఉంటారు. రుణమాఫీ హామీ తప్పుకునేందుకే ఇలాంటి చేతకాని సాకులు వెతుక్కుంటున్నారు.
- బోట్ల జగన్మోహనరావు, కౌతవరం రైతు