టీడీపీలో గురు శిష్యుల మధ్య అగాథం
► జగదీషే లక్ష్యంగా పావులు కదుపుతున్న శత్రుచర్ల
► ఫిర్యాదు చేసేందుకు విజయవాడ వెళ్లిన ఆయన వర్గం
► నేటి ఉదయం 10గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన సీఎం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాజకీయాల్లో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ గురు శిష్యులగా చెప్పుకుంటారు. వారి మధ్య సుదీర్ఘకాలంగా అవగాహనతో కూడిన రాజకీయాలు నడిచాయి. ఇప్పుడా గురుశిష్యుల మధ్య అగాధం ఏర్పడింది. తన వద్దే కుప్పిగంతులేయడమేంటని శిష్యుడిపై గురువు మండి పడుతున్న పరిస్థితి నెలకుంది. శిష్యున్ని లక్ష్యంగా చేసుకుని గురువు పావులు కదుపుతున్నారు. జిల్లా అధ్యక్షునిగా ఉన్న ద్వారపురెడ్డి జగదీష్‌పై ఫిర్యాదు చేసే పనిలో మాజీ మంత్రి శత్రుచర్ల వర్గీయులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే టీడీపీ యువనేత లోక్‌ష్‌ను కలిసి మొర పెట్టుకున్నారు. గురువారం ఉదయం 10గంటలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలవనున్నారు.
ఈమేరకు అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుని హోదాలో కురుపాం నియోజకవర్గంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, తానే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా చెప్పుకుని దందా చేస్తున్నారని, తమనేమాత్రం గుర్తించడం లేదని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎమ్మెల్యే వి.టి.జనార్థన్‌థాట్రాజ్ గత కొన్నాళ్లుగా ఆవేదనతో మండిపోతున్నారు. పార్టీలో తమకెంటు ప్రాతినిధ్యం ఉండటం లేదని, మాట చెల్లుబాటు కావడం లేదని, నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తున్నారని జగదీష్‌పై అంతెత్తున మండి పడుతున్నారు. అందుకు జగదీష్ బలహీనతల్ని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావును కలిసి జరుగుతున్నదంతా మొర పెట్టుకున్నారు. ఇప్పుడేకంగా అధినేత చంద్రబాబును కలిసి చెప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అందులో భాగంగా సుమారుగా పది కార్లపై 50మంది నాయకులు విజయవాడ వెళ్లారు. బుధవారం విజయవాడలో ఉన్న లోకేష్‌ను కలిసి జగదీష్ నిర్వాకాన్ని వివరించారు. గురువారం ఉదయం 10గంటలకు చంద్రబాబును కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. కురుపాం నియోజకవర్గంలో ఎన్నికలప్పుడు పార్టీ బి-ఫారాలను అమ్ముకున్నారని, పార్టీ పదవులు, నీటి సంఘాల పదవులు, నామినేటేడ్ పదవులు, అంగన్‌వాడీ పోస్టులిప్పించేందుకు చేతివాటం ప్రదర్శించారని, ఇన్‌చార్జ్‌గా నియమించకపోయినప్పటికీ చంద్రబాబు, లోకేష్ తనను చూసుకోమన్నారని చెప్పి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో ఫిర్యాదు చేసేందుకు శత్రుచర్ల వర్గీయులు సిద్ధమయ్యారు. తక్షణమే జగదీష్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, కురుపాం నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ని నియమించాలని కోరనున్నారు. మరి, అధినేత చంద్రబాబు నాయుడు ఏమేరకు స్పందిస్తారో చూడాలి.