తెలుగు దేశం పార్టీ అటు జిల్లాలోను, ఇటు నగరంలోనూ ఇబ్బందులు పడుతోంది. ఓ వైపు వలసల రాకతో ... మరో వైపు అంతర్గతంగా క్యాడర్‌ను సమర్థించుకోలేక ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆది నుంచి పార్టీని నమ్ముకున్న వారిని పక్కనపెట్టే ప్రయత్నం చేస్తుండడంతో సీనియర్లలో అసంతృప్తి పెల్లుబుకుతోంది.
జిల్లాలో తెలుగుదేశం పార్టీ డీలాపడుతోంది. సమీకరణలు కలిసిరాకపోగా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. వలస నేతలపై ఆశలు పెట్టుకుంటే.. ఇప్పటివరకు పార్టీకోసం పనిచేసిన తెలుగు తమ్ముళ్లు అడ్డం తిరిగే పరిస్థితి వచ్చింది. పోనీ వలస నేతలను వదిలేద్దామనుకుంటే సొంత బలం సరిపోని దుస్థితి. రోజుకో కొత్త పరిణామంతో పార్టీ శ్రేణులు కంగుతింటున్నాయి. అటు వలసలను స్వాగతించలేక.. ఇటు క్యాడర్‌కు సర్దిచెప్పుకోలేక పార్టీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారుతోంది.రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు తన తప్పేమీలేదని, అంతా కాంగ్రెస్సే చేసిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా జనం నమ్మే స్థితిలో లేరు. కాంగ్రెస్ నుంచి వచ్చే నేతలను టీడీపీలోకి తీసుకుని పార్టీ బలోపేతమైనట్టు బిల్డప్ ఇద్దామనుకుంటే అదీ కుదరడం లేదు.
జిల్లా కాంగ్రెస్‌లోని కీలక నేతలను పార్టీలోకి తీసుకుని పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించడంపై ఆ పార్టీలో పెద్ద పంచాయితీనే జరిగినట్టు సమాచారం. కొత్త వలసలతో టీడీపీ కాంగ్రెస్‌కు నకలుగా మారిపోతుందని తమ్ముళ్లు గగ్గోలు పెట్టారు. దీంతో కాంగ్రెస్ నుంచి వలసలకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఇదే క్రమంలో చంద్రబాబు అంతరంగాన్ని పసిగట్టిన పలువురు నేతలు తాము పోటీలో ఉన్నామని ప్రకటించి వలసలను నిలువరించే ప్రయత్నం చేశారు. బందరు మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, తాజా మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు బూరగడ్డ వేదవ్యాస్, యలమంచిలి రవి తదతర కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మినహా ఎవరూ టీడీపీలో చేరలేదు. బుద్ధప్రసాద్ రెండు రోజుల కిందట చంద్రబాబును కలవడంతో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైనట్టు చెబుతున్నారు. అదే జరిగితే అవనిగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు తిరుగుబాటు జెండా ఎగురవేసే ప్రమాదం లేకపోలేదు. అదే సమయంలో ఇప్పటి వరకు అనేక ఆటుపోట్లను తట్టుకుని బుద్ధప్రసాద్‌ను అనుసరించిన కాంగ్రెస్ క్యాడర్ సైతం ఆయనకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలను పార్టీలోకి తీసుకుంటే టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, బందరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొల్లు రవీంద్ర తదితర నేతల రాజకీయ మనుగడకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఉనికి కోసం టీడీపీలో నేతలు సైతం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.
టీడీపీ లక్ష్యంగా బాడిగ వ్యూహం..
ఇప్పటివరకు గుంభనంగా తన ప్రయత్నాలు చేసుకుంటున్న మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ బుధవారం ప్రత్యక్షమై బందరులో హడావుడిగా విలేకరుల సమావేశం నిర్వహించడం వెనుక రాజకీయ ఎత్తుగడ దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బాడిగ టీడీపీలో చేరుతున్నట్టు ఇటీవల పెద్ద ప్రచారమే జరిగింది. బైపాస్ సర్జరీ చేయించుకుని బందరు వచ్చిన ఎంపీ కొనకళ్ల బందరు టీడీపీ ఎంపీ అభ్యర్థిని తానేనని ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాడిగ రంగంలోకి దిగి తాను రేసులో ఉన్నట్టు ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్‌కు తాను చేసిన రాజీనామా ఆమోదించలేదని, కిరణ్ పార్టీ పెట్టారని, పవన్ పార్టీ వస్తుందని, తనకు ఎక్కడో ఒకచోట అవకాశం ఉండకపోదని నర్మగర్భంగా చెప్పారు.
ఇదే సమయంలో తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నదీ స్పష్టంగా చెప్పలేదు. ఎంపీగా పోటీకి దిగితే తెలుగుదేశం పార్టీకే నష్టమనే సంకేతాలు ఇవ్వడం ద్వారా ఆ పార్టీ టికెట్‌పై చంద్రబాబు వద్ద హామీ పొందడమే బాడిగ అంతరంగమై ఉండొచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి మారుతున్న సమీకరణలు తెలుగుదేశం పార్టీని మరింత ఇరుకున పెట్టేలా ఉన్నాయి.