
రక్షణ ఛత్రంలో సాగర తీరం
► 15 వేల మందితో బందోబస్తు
► 3,4 తేదీల్లో పూర్తిస్థాయి రిహార్సల్స్
► 7న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ
► 1.50 లక్షల మంది సందర్శకులకు పాస్‌లు
అల్లిపురం: అంతర్జాతీయ నౌకా ప్రదర్శన (ఐఎఫ్‌ఆర్) పటిష్ట భద్రతను నగర పోలీస్‌లు కల్పించారు. బుధవారం నుండి రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. అయితే పోలీసులు చెప్పిన దానికి బీచ్‌రోడ్డులో భిన్నమైన వాతావరణ కనిపిస్తుంది. నేవీ అధికారులు బీచ్‌రోడ్డును పూర్తిగా వారి స్వాధీనంలోకి తీసుకున్నారు. దీంతో మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7గంటల వరకు బీచ్‌రోడ్లోకి వాహనాలు రాకపోకలు పూర్తిగా నిషేధించారు.
15వేల మందితో భద్రత..
అంతర్జాతీయ నౌకా ప్రదర్శనకు భద్రతను మూడు ఫేజ్‌లలో ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌లో 3500 మందితోను. రెండవ ఫేజ్‌లో 7వేల మందితోను మూడవఫేజ్‌లో 15వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ట్రాఫిక్ నియంత్రణలకు అదనపు బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఇప్పటికే 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అదనంగా మరికొన్న చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. అదే విధంగా స్నిఫర్ డాగ్స్ టీమ్స్, అర్మిడ్ సెక్యూరిటీ ఫోర్సు, బాంబ్ డిస్పోసబుల్ స్క్వాడ్స్‌తో నిరంతర తనిఖీలు ఉంటాయని తెలిపారు. అదే విధంగా 300 సీసీ కెమారాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటంతటికీ కంట్రోల్ అండ్ కమాండ్ రూంను వుడా చిల్డ్రన్ థియేటర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
లక్షా 50వేల మందికి మీసేవ ద్వారా పాస్‌లు..
నౌకా ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు లక్షా 50వేల పాస్‌లు మీ సేవా కేంద్రాల ద్వారా జిల్లా యంత్రాంగం అందజేసింది. సందర్శకులు పాస్‌లతో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకుని రావాలని సూచించారు. వీలైనంత వరకు నగర ప్రజలు 3,4 తేదీలలో జరిగే ఫుల్ డ్రస్ రిహారల్స్‌ను వినియోగించుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సూచించారు. 7వ తేదీన జరిగే అంత ర్జాతీయ నౌకా ప్రదర్శనకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అవకాశం కల్పించాలని కోరారు. పోలీసులు సూచించిన విధంగా నగర ప్రజలు, సందర్శకులు మసలుకొని విశాఖ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటాలని కోరారు. అదే విధంగా పోలీసులతో సహకరించాలని కోరారు.
నగరంలో 95 సెంటర్లలో భారీ స్క్రీన్లు..
బీచ్‌రోడ్లో జరిగే నౌకా విన్యాసాలను నగర ప్రజలు వీక్షించేందుకు నగరంలో సుమారు 95 సెంటర్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. అదే విధంగా ఆ రోజు సినిమా థియేటర్లలోను లైవ్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కీలకం కానున్న సమాచార వ్యవస్థ..
అంతర్జాతీయ స్థాయి వేడుకలకు నగరం వేదిక కావడంతో భద్రత పరంగా ప్రాధాన్యం చోటుచేసుకుంది. అం దుకు తగిన విధంగా నగర పోలీస్ కమిషనరేట్‌లో ఇన్ఫర్‌మేషన్ విభాగం డీఎస్‌పీ ఎస్.జ్యోతిర్మయి పర్యవేక్షణలో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విభాగం ఈ ఈవెంట్‌లో కీలకం కానుంది. ఈ మేరకు వెయ్యి అధునాతన వాకీ టాకీలు (వాయిస్ రెస్పాన్స్ సిస్టంలు) వినియోగిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం క్యూనికేషన్ ఏడీజీపీ అంజనా సిన్హా కనుసన్నలలో నడవడం విశేషం. ఇందుకుగాను 14 మంది సిబ్బంది నిరంతరం సీసీ కెమారా ఫుటేజీలను పరిశీలించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత బీట్ కానిస్టేబుల్స్‌కు అందజేయటం జరుగుతుంది.
ట్రాఫిక్ ఏర్పాట్లు..
అంతర్జాతీయ నౌకా ప్రదర్శనకు వచ్చే విఐపీలు, వీవీఐపీల రాక పోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. సైలర్స్ చావులమదుం జంక్షన్ నుంచి పోర్టు రోడ్లులో, కోస్టల్‌బ్యాటరీ వద్దకు చేరుకుని అక్కడ వారికి నిర్దేశించి స్థలంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు బీచ్‌రోడ్డు పోలీస్ మెస్ నుండి కాళీమాత గుడి, ఎన్‌టీఆర్ కూడలి వరకు నేవీ వారి స్వాధీనంలో ఉంటుందన్నారు. సందర్శకులు కేవలం పార్క్ హోటల్ నుంచి బీచ్‌లోకి ప్రవేశించి పోలీస్ మెస్ వరకు మాత్రమే అనుమతిస్తారని తెలిపారు. అదే విధంగా కోస్టల్ బ్యాటరీ నుంచి ఎన్‌టీఆర్ విగ్రహం వరకు అనుమతిస్తారని తెలిపారు. నేవీ సిబ్బందికి ఏపీఐఐసీ గ్రౌండ్సులో పార్కింగ్ ఏర్పాటు చేశారు. పోలీసుల మెస్ వెన క గల ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సైలర్స్‌కు హైవే నుంచి మద్దిలపాలెం నుంచి ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుండి షటిల్ బస్‌లు ద్వారా పోలీస్ మెస్ వరకు వచ్చి వారికి కేటాయించిన స్థలానికి చేరుకోవాలి. జనరల్ పబ్లిక్ పార్క్ హోటల్ వరకు చేరుకుని అక్కడ నుండి బీచ్‌లోకి ఎంటర్ కావాలి. ఆర్టీసీ బస్‌లు లాసన్స్‌బే కాలనీ కామత్ హోటల్ వరకు అనుమతిస్తారు.
ఆర్‌టీసీ షటిల్ బస్సు రూటు
1. ఏఎస్ రాజా నుంచి కామత్ హోటల్ వరకు
2. ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి మానసిక ఆస్పత్రి
3. ఆర్‌టీసీ కాంప్లెక్స్ నుంచి న్యూ కేర్ ఆస్పత్రి
4. ఆర్‌టీసీ కాంప్లెక్స్ నుంచి ఓల్డ్ పోస్టాఫీస్
2/4 వీలర్ వాహనాలు
1. ఈస్ట్‌పాయింట్ కాలనీ రోడ్
2. ఏయూ కేంపస్ ప్రవేశం
3. ఆంధ్ర మెడికల్ కాలేజ్ హాస్టల్ మైదానం ప్రవేశం