కడలితీరం కదనరంగంగా మారింది.. దాన్ని అనుకొని ఉన్న బీచ్‌రోడ్డు అంతర్జాతీయ దళాల కదన కుతూహలాన్ని చాటే కవాతుకు వేదికగా.. కళాక్షేత్రంగా భాసిల్లింది. సుమారు రెండు గంటలపాటు సుమారు 2 లక్షల మందిని ప్రత్యక్షంగా.. మరికొన్ని వేలమందిని పరోక్షంగా తమ అద్భుత విన్యాసాలు, ప్రదర్శనలతో నావికాదళం కట్టిపడేసింది.
సరిగ్గా సాయంత్రం 4.35 గంటలు..
అలల హోరు.. సందర్శకుల కేరింతలతో సందడిగా ఉండే సాగర తీరంలో ఒక్కసారిగా అలజడి.. ఆకాశంలో విమానాలు, హెలికాప్టర్ల చక్కర్లు.. వాటిలోంచి సర్రున నీటిపై వాలిన పారాట్రూపర్లు.. కమెండోలు.. అంతలోనే తుపాకుల మోతలు.. బాంబుల వర్షం.. మరోపక్క ఆయిల్ రిగ్ పేల్చివేత.. ఇలా వరుస విన్యాసాలతో యుద్ధంలో కనిపించే దృశ్యాలను కళ్లుదుట ఆవిష్కరిస్తూ.. లక్షలాది ప్రజలను గగుర్పాటుకు గురి చేశారు.
ఇక చీకట్లు ముసురుకుంటున్న వేళ..
సుమారు 24 దేశాల నావికాదళాల కవాతు కనువిందు చేసింది. ఒక్కో దేశానికి చెందిన దళం ముఖ్యఅతిథి ప్రధానమంత్రి సెల్యూట్ చేస్తూ ముందుకు సాగుతుంటే.. ఆ దేశానికే చెందిన కళాకారులు తమ సంప్రదాయ వేషధారణతో అనుసరించారు. వాటితోపాటు పలు ప్రభుత్వ శాఖల శకటాలుతో కూడిన కార్నివాల్ వేడుకను శోభాయమానం చేసింది. అంతకుముందు ప్రధాన వేదిక వద్ద భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే భారతీయం నృత్యప్రదర్శన అదరహో అనిపించింది. తీరంలో కొలువుదీరిన యుద్ధనౌకల నుంచి ఆకాశంలోకి సంధించిన బాణసంచా వెలుగులు.. వాటికి పోటీగా లేజర్ కిరణాల జిలుగులు కార్యక్రమానికి అద్భుతమైన ముగింపునిచ్చాయి. మొత్తంగా అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో కీలకమైన సిటీ పరేడ్, విన్యాసాల ఘట్టం.. ‘విశ్వ’రూపం సంతరించుకొంది.. విశాఖ ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది.
-విశాఖ సిటీడెస్క్
‘విశ్వ’రూప విశాఖ
Published Sun, Feb 7 2016 11:25 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM
Advertisement