ఆధార్ కార్డులు మార్చాలన్నా, పుట్టిన తేదీ, డెత్ సర్టిఫికెట్లు, వీలునామాలు, భూ వివాదాలు, ఎన్నికల్లో పోటీ, స్వీయ ధ్రువీకరణలు ఇలా అన్నిరకాల పనులకు అధికారిక ధ్రువీకరణ కలిగిన న్యాయవాది చేత నోటరీ చేయించుకోవాలి. నోటరీ చేస్తేనే దానికనుగుణంగా పనులు జరుగుతాయి. దీనిని ఆసరాగా చేసుకుని అర్హతలేని కొందరు వారి వద్ద తయారు చేసి ఉంచిన స్టాంపులు, సంతకాలు పెట్టి అర్జీదారుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. అర్హత ఉన్న న్యాయవాదుల పేరుతో కొందరు ఏజెంట్లు, కంప్యూటర్ దుకాణదారులు, సిబ్బంది డమ్మీ స్టాంపులు రూపొందించి వాటిపై ఫోర్జరీ సంతకాలతో నోటరీలు జారీ చేస్తున్నారు. త్వరగా పనులు జరుగుతుండటంతో ప్రజలు వాటిపై పెద్దగా ఆలోచన చేయకుండా అడిగినంత సమర్పించుకుంటున్నారు.
సాక్షి, అమరావతి : విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని ప్రధాన పట్టణాలైన మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, అవనిగడ్డ, నూజివీడు, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో ఈ విధమైన అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం. సబ్ రిజిస్ట్రార్, కోర్టు ప్రాంగణాలలోని కొన్ని కంప్యూటర్ దుకాణాల నిర్వాహకులే లాయర్ల పేరుతో స్టాంపులు తయారు చేసుకున్నారు. వినియోగదారులు వచ్చినప్పడు లాయర్ గారు అందుబాటులో లేరని, తమకు అదనపు సొమ్ము అందజేస్తే ఇప్పటికిప్పుడే సంతకాలు చేసి సీల్ వేసిన నోటరీ పేపర్లు ఇస్తామని బేరాలకు దిగుతున్నారు. నోటరీ ద్వారా చేయించే పనులు దాదాపుగా అత్యవసరం కావడంతో ఓ రెండు వందలు అధిక మొత్తం చెల్లించైనా నోటరీ సంపాదిస్తున్నారు.
ఇలా సదరు నకిలీ నోటరీల ద్వారా నిత్యం వేలాది రూపాయల్లో అక్రమమార్గంలో సంపాదిస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ అర్జీదారుడు పూర్తి సమ్మతితో రూపొందించిన ప్రమాణపత్రాన్ని ఆధారాలను పరిశీలించి నోటరీ లైసెన్స్ ఉన్న న్యాయవాది స్టాంపు వేసి సంతకం ధ్రువీకరిస్తారు. అర్హత ఉన్న న్యాయవాదులు, లైసెన్స్ పొందని న్యాయవాదుల పేరుతో అక్రమార్కులు డమ్మీ స్టాంపులను తయారు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక్కో నోటరీకి రూ. 300 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం సాధారణ నోటరీకి రూ.50, రూ.100 మాత్రమే వసూలు చేయాలి. ప్రభుత్వ పథకాల్లో నోటరీల అవశ్యకత ఉండటంతో వీటి ప్రభావం పథకాల్లో అవకతవకలు జరిగే ప్రమాదముంది.
అర్హతలు ఇవీ...
భారత ప్రభుత్వం రూపొందించిన నోటరీ యాక్ట్–1952 నోటరీకి ఉండవల్సిన అర్హతలు, నియమాలు, విధివిధానాలను సూచిస్తోంది. నోటరీ చేయడానికి న్యాయవాది పట్టా పొంది పది సంవత్సరాలు కోర్టులో ప్రాక్టీసు చేసి అనంతరం నోటరీ చేయడానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఏడేళ్లకే నోటరీకి అర్హత లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భారతీయ లీగల్ సర్వీసెస్‌లో సభ్యులై ఉండి ప్రత్యేక అనుమతులను పొంది ఉండాలి. ఇలా పొందిన లైసెన్సులను ప్రతి మూడేళ్లకోసారి రెన్యువల్ చేయించుకోవాలి. జిల్లాలో కొందరికి నోటరీ అర్హత ఉన్నప్పటికి లైసెన్స్ రెన్యూవల్ చేయించకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారు ఇప్పటికీ సంతకాలు పెట్టి నోటరీలు జారీచేస్తున్నారు.
అడ్డుకోకపోతే ప్రమాదమే...
అక్రమమార్గంలో నోటరీలు జారీచేస్తుండటంతో చాలా ప్రమాదాలు జరిగే అవకాశముంది. అర్హతలు లేకపోయినప్పటికీ ప్రభుత్వ పథకాలు పొంది, వాటికి అన్ని అర్హతలు ఉన్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. మరోవైపు ఆస్తి సంబంధిత విషయాల్లోను సంఘర్షణలు తలెత్తుతాయి. సంఘ విద్రోహులు సులువుగా ప్రభుత్వ గుర్తింపుకార్డులు పొందే అవకాశముంది. బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లో చొరబడిన పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ విధంగా నకిలీ పత్రాలతో పశ్చిమ బెంగాల్ పౌరసత్వం పొందిన ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. పైకి చిన్నగా కనిపించినప్పటికీ దాని వల్ల జరిగే పరిణామాలు గుర్తించి అధికారులు స్పందించి నకిలీ నోటరీల ఆటకట్టించాలి. మరోవైపు వీటితో ఏమాత్రం సంబంధంలేని న్యాయవాదులకు కూడా మకిలి అంటే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment