
విమానాశ్రయం (గన్నవరం): పొగమంచు కారణంగా విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం పలు విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో విమానాలు అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. తెల్లవారుజాము నుంచి గన్నవరం విమానాశ్రయంలో రన్‌వేని పూర్తిగా పొగ మంచు కప్పేయడంతో ఉదయం 8.00 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన ట్రూజెట్ విమానం ల్యాండింగ్‌కు ఇబ్బంది ఏర్పడింది.
అదే సమయంలో బెంగళూరు నుంచి వచ్చిన స్పైస్‌జెట్ విమానం, వైజాగ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాలకు కూడా ల్యాండింగ్ సమస్య ఎదురవడంతో అరగంటకుపైగా గాలిలోనే చక్కర్లు కొట్టాయి. తర్వాత మంచు తీవ్రత తగ్గడంతో విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ రావాల్సిన స్పైస్‌జెట్ విమానం సుమారు గంటన్నర ఆలస్యంగా 10.30 గంటలకు చేరుకుంది. గత మూడ్రోజులుగా పొగమంచు వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.