ప్రేక్షకులు మెచ్చిందే మంచి సంగీతం
పేక్షకులు మెచ్చిందే మంచి సంగీతం, ఆమోదించిందే ఉత్తమ సాహిత్యమని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు తనయుడు కోటేశ్వరరావు (కోటి) అన్నారు. ఆర్‌డీ బర్మన్ పురస్కారం అందుకోవడానికి ఆదివారం నగరానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ప్రతి పదేళ్లకు ప్రేక్షకుల్లో మార్పు వస్తోంది. నాటి సినిమాల్లో నిర్మాతలు సాహిత్యానికి పెద్ద పీట వేసేవారని, నేడు వాయిద్యాల హోరు పాటను మింగేస్తుందనడం సరికాదన్నారు. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వల్ల ఈ పరిణామం అనివార్యమైందని ఆయన వివరించారు. ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో’ పాట నాటి ప్రేక్షకులను అలరిస్తే, ఇప్పటి ప్రేక్షకులను ‘రింగా రింగా’ ఆకట్టుకుందని కోటి అన్నారు. వివిధ అంశాలపై ఆయన స్పందన ఆయన మాటల్లోనే...
నాన్నగారి ప్రభావం...
మెలోడిలో నాన్న గారి ప్రభావం, రిథమ్‌లో సినీసంగీత దర్శకుడు చక్రవర్తి ప్రభావం నాపై ఉంది. నాన్నగారిది చాలా సున్నితమైన మనస్తత్వం. ఆయన ఒప్పుకున్న సినిమాలు కన్నా, వదిలేసినవే ఎక్కువ.
తొలి సినిమా...
రాజ్-కోటి సంయుక్త సంగీత దర్శకత్వంలో 1983లో భలే బుల్లోడు సినిమాకు పనిచేశాను. రాజ్‌తో కలసి 200 సినిమాలు చేశాను. ఒక్కడినే సుమారు 275 సినిమాల వరకు చేశాను. వీటిలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ ఉన్నాయి. అరుంధతి నా అనుభవానికి తగ్గ సినిమా. హలో బ్రదర్, గోవిందా గోవిందా, మల్లీశ్వరి, నువ్వే కావాలి, పెదరాయుడు నాకు పేరు తెచ్చిన సినిమాలు. అన్నీ వ్యాపారపరంగా విజయం సాధించినవే...
అవార్డులు-రివార్డులు
నేను అవార్డులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయడం లేదు. వ్యాపారాత్మక సంగీతాన్ని అందించడమే నా పని...హలో బ్రదర్‌కు నంది అవార్డు వచ్చింది. నువ్వే కావాలి సినిమాకు కూడా కొన్ని అవార్డులు వచ్చాయి.
నేటి తరానికి సలహా..
ఇప్పుడు సంగీతం చాలా తేలికైపోయింది. 1974లో గిటారిస్టుగా నా కెరీర్ ప్రారంభమైంది. పెండ్యాల, సుసర్ల దక్షిణామూర్తి, రమేష్ నాయుడు, రాజన్-నాగేంద్ర, జి.కె.వెంకటేష్, ఇళయరాజా, చక్రవర్తి, నాన్నగారు ఇలా ఎందరో ప్రముఖుల వద్ద గిటార్ మెళకువలు నేర్చుకున్నాను. 1975-83 మధ్య కాలంలో చక్రవర్తి వద్ద గిటారిస్ట్‌గా పని చేశాను. నేటి తరం సంగీత దర్శకులు ఏ వాయిద్యంతో ఏ స్వరం పలికించవచ్చునో ముందుగా తెలుసుకోవాలి.
కష్టపడిన పాట, అభిమాన గేయ రచయిత
ముఠామేస్త్రిలో ‘ఈ పేటకు నేనే మేస్త్రి’ కంపోజింగ్‌కు ప్రసవ వేదన పడ్డాను. లంకేశ్వరుడు సినిమాలో కూడా కొన్ని పాటలకు చాలా కష్టపడవలసి వచ్చింది. వేటూరి సుందర రామ్మూర్తి నా అభిమాన గేయ రచయిత. క్లాస్, మాస్ రెంటినీ ఒప్పించగల సమర్థుడు ఆయన.
గోదావరి తీరమంటే అభిమానం...
బంగారు బుల్లోడు సినిమాకు పాటలన్నీ మహాలక్ష్మి హోటల్లో కంపోజ్ చేశాం. గోదావరీ తీరమంటే నాకు అభిమానం. ఆర్‌డీ బర్మన్ పేరిట అవార్డు అందుకోవడం నా పూర్వజన్మ సుకృతం.. మహాన్ అనే సినిమాకు ఆయనతో కలసి 40 రోజులు పనిచేశాను.
భవిష్యత్ ప్రణాళికలు
నాన్నగారి పేరిట ఓ ట్రస్టును స్థాపించి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తా.