‘నీరు – చెట్టు’ అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ | Investigation with Vigilance and Enforcement on Corruption under the Water-Tree Code Scheme | Sakshi

‘నీరు – చెట్టు’ అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ

Published Fri, Jul 26 2019 3:18 AM | Last Updated on Fri, Jul 26 2019 3:19 AM

Investigation with Vigilance and Enforcement on Corruption under the Water-Tree Code Scheme - Sakshi

సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో ‘నీరు – చెట్టు’ పథకం పేరుతో జరిగిన అవినీతిపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో దర్యాప్తు జరిపించి దోషులపై రెవెన్యూ రికవరీ(ఆర్‌.ఆర్‌.) చట్టాన్ని ప్రయోగిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. టీడీపీ పాలనలో నీరు–చెట్టు, ఉపాధి హామీ పథకాల్లో భారీ అవకతవకలు జరిగాయని, పనులు చేయకుండానే బిల్లులు కాజేశారని వైఎస్సార్‌సీపీ సభ్యులు మేరుగ నాగార్జున, కాటసాని రాంభూపాల్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. ‘ఉపాధి హామీ, నీరు – చెట్టు నిధులను చంద్రబాబు సర్కారు పక్కదోవ పట్టించింది. రూ. 22,472 కోట్లకుపైగా విలువైన పనులను చేసినట్లు చూపించి జన్మభూమి కమిటీల ద్వారా దోచుకున్నారు.

డ్వామాను తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థగా మార్చారు. నీరు – చెట్టు టీడీపీ నేతలకు ఉపాధి హామీ పథకంలా మారింది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఉపాధి హామీ కింద చేసిన పనులనే నీరు – చెట్టు కింద కూడా చూపించి బిల్లులు పొందారు. వేసిన కట్టకే మట్టి వేసినట్లు, తవ్విని గుంతనే తవ్వినట్లు రెండుసార్లు బిల్లులు కాజేశారు. పనులు చేయకుండా తప్పుడు రికార్డులు సృష్టించారు’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌తో దర్యాప్తు జరిపిస్తామని, హౌస్‌ కమిటీ అవసరం లేదని చెప్పారు. తన సొంత జిల్లా చిత్తూరులో నీరు–చెట్టులో అవినీతిని స్వయంగా చూశానని వెల్లడించారు.

రూ.10 బుష్‌ కట్టర్‌ రూ.100కు కొన్నట్లుంది..
గ్రామ పంచాయతీల్లో పొడి, తడి చెత్తలను సేకరించడానికి వినియోగించే ప్లాస్టిక్‌ బకెట్ల (బిన్ల) కొనుగోలులో చోటు చేసుకున్న భారీ అవినీతిపై విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ సభ్యుడు సాయిప్రసాద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రూ. 20 – 30కి లభించే చెత్త డబ్బాలను రూ. 55 – 60 చొప్పున కొనుగోలు చేసి సగం డబ్బులు తినేశారని చెప్పారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం ఇస్తూ.. ‘గత ప్రభుత్వ హయాంలో ఒక్కో జిల్లాలో ఒక్కో రేటుకు ప్లాస్టిక్‌ చెత్త డబ్బాలను కొనుగోలు చేశారు. అవి రూ. 25 లోపే దొరుకుతాయని అందరికీ తెలుసు. గ్రామ పంచాయతీల కోసం కొనుగోలు చేసిన వాటిల్లో కూడా నాణ్యత లేదు. ఇందులో భారీ దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. మేమూ వ్యవసాయం చేశాం. ఈ విషయం మాజీ సీఎం చంద్రబాబుకు కూడా తెలుసు. రూ.10కి దొరికే బుష్‌ కట్టర్‌ రూ.వందకు కొన్నట్లుగా ఉంది. స్ప్రేయర్లు కూడా భారీ రేటుకు కొనుగోలు చేశారు. మొత్తం రూ. 67 కోట్లకుపైగా ఖర్చు చేశారు (ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ బిన్లను ఎక్కడెక్కడ ఎంత ధరకు కొన్నారో గణాంకాలను పెద్దిరెడ్డి వివరించారు). ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌తో విచారణ జరిపిస్తాం’ అని మంత్రి తెలిపారు. తమ శాఖలో టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఇలాంటి అక్రమాలు భారీగా బయటకు వచ్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement