జిల్లాకు కొత్త పోలీస్‌ బాస్‌లు | IPS Officers Transfer To The In Chittoor District | Sakshi
Sakshi News home page

జిల్లాకు కొత్త ఐపీఎస్‌ అధికారులు

Published Sat, Sep 28 2019 9:30 AM | Last Updated on Sat, Sep 28 2019 9:33 AM

IPS Officers Transfer To The In Chittoor District - Sakshi

గజరావు భూపాల్, సెంథిల్‌కుమార్‌

సాక్షి, చిత్తూరు అర్బన్‌ : జిల్లాలో ఐపీఎస్‌ అధికారులను బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 12 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీచేయగా.. జిల్లాకు చెందిన తిరుపతి, చిత్తూరు ఎస్పీలకు స్థానచలనం కలిగింది. మంగళగిరిలోని 6వ బెటాలియన్‌ ఏపీఎస్పీ కమాండెంట్‌గా ఉన్న డాక్టర్‌ గజరావు భూపాల్‌ తిరుపతి ఎస్పీగా నియమితులయ్యారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న ఎస్‌.సెంథిల్‌కుమార్‌కు చిత్తూరు ఎస్పీగా పోస్టింగ్‌ లభించింది. కాగా చిత్తూరులో ఎస్పీగా పనిచేస్తున్న చింతం వెంకట అప్పలనాయుడును రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగానికి, తిరుపతి ఎస్పీగా ఉన్న కె.ఎన్‌.అన్బురాజన్‌ను వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. 

సెంథిల్‌కుమార్‌ నేపథ్యం
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన సెంథిల్‌కుమార్‌ 2008 ఆంధ్రా క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. ఆయన వరంగల్‌ జిల్లా ములుగు ఏఎస్పీగా పోలీసుశాఖలోకి ప్రవేశించారు. అనంతరం శ్రీకాకుళం ఏఎస్పీ, శంషాబాద్‌ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు.  

విద్యాభాస్యం
సెంథిల్‌ కుమార్‌ పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలో విద్యనభ్యసించారు. ఇంటర్‌ ప్రైవేటు కళాశాలలో చదివారు. టీచింగ్‌ డిప్లమో చేశారు. ఆ తర్వాత బీఎస్సీ గణితం, తమిళం లిటరేచర్‌లో పట్టభద్రులు. ఆయన 2005 నుంచి 2008 వరకు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు.

అప్పలనాయుడు ముద్ర
చిత్తూరు ఎస్పీగా కొన్నాళ్లే పనిచేసినా పాలనలో వెంకట అప్పలనాయుడు తనదైన శైలిలో ముద్రవేశారు. ఈ ఏడాది జూన్‌ 12న చిత్తూరులో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన సొంత శాఖను ప్రక్షాళన చేయడంలో సఫలీకృతులయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించిన స్పెషల్‌ బ్రాంచ్‌కే మచ్చ తెచ్చిపెట్టిన కొందరు అధికారులు, సిబ్బంది మూలాలను కదిలించారు. ఎస్‌బీని పూర్తిగా మార్చేశారు. కుప్పంలో పెద్ద ఎత్తున నకిలీ నోట్ల గుట్టును రట్టుచేశారు. పోలీసు సిబ్బందితో నేరుగా మాట్లాడడంతో అందరికీ చేరువయ్యారు. రౌడీషీటర్లు, సామాన్యులను ఇబ్బంది కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించారు. తన వద్ద పనిచేసే డ్రైవర్‌ నుంచి సీసీ, గన్‌మెన్లు అందర్నీ ఇతర ప్రాంతాలకు బదిలీచేసి.. కొత్తవారిని నియమించుకున్నారు.

పోలీసు బదిలీల్లో పారదర్శకంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. బదిలీపై ‘సాక్షి’తో వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ ‘‘ఇక్కడ పనిచేసింది కొన్నాళ్లనే ఫీలింగ్‌ లేదు. చిత్తూరులో రెండేళ్లపాటు ఉన్నట్లు అనుభూతి కలిగింది. జిల్లాలోని ఒకటి రెండు స్టేషన్లు తప్ప.. అన్ని చోట్లకు వెళ్లి సిబ్బందితో మాట్లాడగలిగాను. ప్రధానంగా పోలీసు శాఖలో కిందిస్థాయి సిబ్బంది నుంచి జిల్లాలోని ప్రజాప్రతినిధుల వరకు పాలనాపరంగా మంచి సహకారం అందించారు. ఇప్పుడు సీఎం గారి పేషీలోని ఇంటెలిజెన్స్‌ విభాగానికి వెళ్లడం ఆనందంగానే ఉంది.’’ అని పేర్కొన్నారు. 

సీఎం జిల్లాకు అన్బురాజన్‌
గత ఏడాది నవంబరు 2వ తేదీన తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అన్బురాజన్‌ వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. నిత్యం ప్రముఖులతో సందడిగా ఉండే తిరుపతిలో శాంతి భద్రతల పర్యవేక్షణ కత్తిమీద సాములాంటిది. అలాంటిది అన్బురాజన్‌ ఇక్కడ పరిస్థితులను పూర్తిగా పర్యవేక్షిస్తూ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. శ్రీవారి ఆలయ భద్రత పర్యవేక్షణ, శాంతిభద్రతల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పాలన కొనసాగించారు. ఈయన పనితీరును చూసే సీఎం సొంత జిల్లా అయిన వైఎస్సార్‌ కడపకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

గజరావు కుటుంబమంతా వైద్యులే
తూర్పుగోదావరి జిల్లా గొళ్లప్రోలు మండలం చేబ్రోలుకు డాక్టర్‌ గజరావు భూపాల్‌ 2008 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఈయన తల్లిదండ్రులు అనురాధ, సీతారామయ్యస్వామి ఇద్దరూ వైద్యులే. గజరావు భూపాల్‌ సైతం ఎంబీబీఎస్‌ పూర్తిచేసి.. సివిల్స్‌వైపు వచ్చారు. కాకినాడలోని ఆదిత్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. ఈయన తమ్ముడు హేమంత్‌ కూడా ఎంబీబీఎస్‌ మానసిక వైద్య శాస్త్రంలో ఎండీ చేశారు. డాక్టర్‌ గజరావు భూపాల్‌ భద్రచాలం, మెదక్‌ జిల్లాలో ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం పదోన్నతిపై  ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీగా పనిచేశారు. తెలంగాణ, ఆంధ్రరాష్ట్రం విభజన నేపథ్యంలో ఏపీ క్యాడర్‌కు ఆయన వచ్చారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు. విధి నిర్వహణలో రాజీలేని వ్యక్తిగా పేరుగాంచారు. ప్రస్తుతం మంగళరిగి 6వ బెటాలియన్‌ కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ తిరుపతి ఎస్పీగా వస్తున్నారు.

వచ్చే నెల బాధ్యతలు..
జిల్లాకు వస్తున్న ఇద్దరు ఎస్పీలు సైతం వచ్చేనెల బాధ్యతలు స్వీకరించనున్నారు. అక్టోబర్‌ మొదటి వారంలో చిత్తూరు, తిరుపతి ఎస్పీలు ఇక్కడ బాధ్యతలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

అన్బురాజన్, వెంకట అప్పలనాయుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement