అమాత్యుల అండ ఉంటే ఐఏ‘ఎస్’! | IPS, OSDs in conferred IAS status list | Sakshi
Sakshi News home page

అమాత్యుల అండ ఉంటే ఐఏ‘ఎస్’!

Published Thu, Dec 26 2013 1:11 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

అమాత్యుల అండ ఉంటే ఐఏ‘ఎస్’! - Sakshi

అమాత్యుల అండ ఉంటే ఐఏ‘ఎస్’!

* కన్‌ఫర్డ్ ఐఏఎస్ జాబితాలో పీఎస్‌లు, ఓఎస్‌డీలు
* ‘బంధువు’ కోసం నిబంధనల సడలింపుతో పెరిగిన అర్హులు
* పైరవీకారులు, అమాత్యుల వద్ద పనిచేసేవారిదే పైచేయి
* ఎంపిక తీరుపై క్యాట్ కూడా అసంతృప్తి
 
హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐఏఎస్... దేశంలో ఈ హోదాకు ఉండే ప్రతిష్ట చెప్పనక్కర్లేదు! ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలి? యూపీఎస్సీ నిర్వహించే ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ పరీక్షల్లో ప్రతిభ నిరూపించుకోవడం ఒక మార్గం. ఒకవేళ రాష్ట్ర స్థాయి సర్వీస్‌లో ఉంటే మంచి పనితీరు కనబరిచి కొంతకాలం తరువాత కన్‌ఫర్డ్ ఐఏఎస్ కావడానికీ మరో మార్గం ఉంది. మంచి పనితీరు అంటే... వివాదరహితంగా, నీతిమంతంగా, ప్రతిభావంతంగా, సమాజానికి ఉపయోగపడేలా పనిచేయడం..! కానీ ఈసారి మంచి పనితీరుకు నిర్వచనాలు మారిపోయాయి. మంత్రుల దగ్గర పనిచేసే ఓఎస్‌డీలు, పీఎస్‌లు, ఉన్నతాధికారుల విశ్వాసపాత్రులు, ఉన్నత స్థాయిలో రాజ కీయ పైరవీలు చేతనైనవాళ్లు కన్‌ఫర్డ్ ఐఏఎస్ ప్రాబబుల్స్ జాబితాలో చేరిపోయారు. ఇది చేతకానివాళ్లు ఆ జాబితాలో చేరలేక నిరాశకు లోనవుతున్నారు.
 
జాబితాలో సగం మంది పీఎస్‌లు, ఓఎస్‌డీలే!
ఈసారి రెవెన్యూయేతర సర్వీసుల నుంచి కన్‌ఫర్డ్ ఐఏఎస్ కావటానికి ఆరు పోస్టులున్నాయి. ఇందుకు 30 మందిని ఎంపిక చేస్తే అందులో 12-13 మంది వరకూ మంత్రుల వద్ద పనిచేసే పీఎస్‌లు, ఓఎస్‌డీలు, ముఖ్యనేత కుమారుడి స్నేహితులు, పీసీసీ నేత బంధువులుండటం గమనార్హం. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులతో పోలిస్తే వీరికి అనేక అంశాలు కలిసి వస్తున్నాయి. ఏళ్లుగా సచివాలయంలో తిష్టవేసి, మంత్రులకు విశ్వాసపాత్రులుగా పనిచేస్తూ ఆ మంత్రులతోనే ఏటా వార్షిక నివేదిక (ఏసీఆర్)ల్లో ‘అసాధారణ పని తీరు’ (ఔట్ స్టాండింగ్ పర్‌ఫార్మెన్స్) కితాబు తీసుకోవడం వీరికి కలసివస్తోంది.

జాబితాలో చేరటానికి ఆ మంత్రులతోనే పైరవీలు చేయించుకోగలుగుతున్నా రు. కానీ, క్షేత్ర స్థాయిలో పనిచేసేవాళ్లు ఏసీఆర్‌ల విషయంలో బాసులనుంచి సతాయింపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. పైగా ఏవేవో ఆరోపణలు, వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. వాటి నుంచి క్లీన్‌చిట్ అంత త్వరగా రాదు. సచివాలయం స్థాయిలో మంత్రుల ప్రాపకంలో ఉండేవాళ్లకు పెద్దగా ఈ ఆరోపణలు, వివాదాలు అంటవు. ఒకవేళ చిన్నాచితకా ఉన్నా మంత్రుల ద్వారానే వాటి ని ఎత్తివేయించుకోవడమూ సులువే. స్క్రీనింగ్ నుంచి ఇంటర్వ్యూ దశ వరకు ఉన్నతాధికారుల కమిటీలను మంత్రుల ద్వారా ప్రభావితం చేయించడంలో పీఎస్‌లు, ఓఎస్‌డీలు ముందుంటారు.
 
వడ్డించేవాడు మనవాడైతే...!
వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఆఖరున్నా ఒకటే అన్నట్లుగా 2011లో ఒక పీసీసీ ముఖ్యనేతకు దగ్గరి బంధువైన రాష్ట్ర సర్వీసు అధికారి కన్‌ఫర్డ్ ఐఏఎస్ అవడానికి నిబంధనలే మారిపోయాయి. పీసీసీ నేతకు స్వయానా బావ అయినా ఆ అధికారికి నిబంధనల మేరకు డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఎనిమిదేళ్ల కనీస సర్వీస్ లేదు. దాంతో ఒక కమిటీ వేసి ఆర్‌డీవో స్థాయి మూలవేతనంతో 8 ఏళ్లు పనిచేసి ఉంటే చాలునంటూ నిబంధనను మార్చేశారు. ఫలితంగా గ్రూపు-1లో దిగువ స్థారుు పోస్టుల అధికారులకూ భలే ఛాన్స్ దొరికింది. దీంతో ఆ నేత బావగారితోపాటు మరో ఇద్దరు దగ్గరి బంధువులకూ అర్హత వచ్చిపడింది. అయితే 2011లో ఆ నేతను మించిన బడా నేతలు తమవారి కోసం అడ్డుపడడంతో వారి పప్పులు ఉడకలేదు. ఆ బావగారు ఈసారీ జాబితాలో ఉన్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement