కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో ఆ శాఖ అధికారులకే తెలియని పరిస్థితి. జిల్లాలో అనధికార పవర్‌కట్‌లతో నెలన్నర రోజులుగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా గురువారం రాత్రి విజయవాడలోని థర్మల్ పవర్‌ప్లాంట్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఈ కారణంగా లోటు తీవ్రరూపం దాల్చి ట్రాన్స్‌కో అధికారులు కోతలకు తెరతీశారు.
ఇందుకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళ ఐదారు గంటల పాటు సరఫరా నిలిపేస్తున్నారు. ప్రతి మండలంలో 8 నుంచి 10 గంటల పాటు.. జిల్లా కేంద్రంలో 4 గంటలు.. గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. వీటీపీపీలో ఏర్పడిన సమస్య కారణంగా గురువారం రాత్రి కర్నూలు, ఆదోని, నంద్యాల డివిజన్లలో భారీగా కోతలు అమలయ్యాయి. ఎమర్జెన్సీ కారణంగా లోడ్ రిలీఫ్ కోసం హైదరాబాద్‌లోని ట్రాన్స్‌కో లోడ్ మానిటరింగ్, డిశ్పాచ్ సెంటర్ నుంచే ఈ వాతలు పెడుతున్నట్లు విద్యుత్ శాఖ జిల్లా అధికారులు వెల్లడిస్తున్నారు.
అంధకారం ఇలా...
గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం సబ్ డివిజన్లలోని అన్ని పల్లెల్లో గంట పాటు సరఫరా నిలిచిపోయింది. కర్నూలు, నంద్యాల డివిజన్లలో రాత్రి 9.30 గంటల నుంచి 11.40 గంటల వరకు కోత విధించడంతో కర్నూలు రూరల్, గూడూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, బేతంచెర్ల, బనగానపల్లె, డోన్ సబ్ డివిజన్లలోని గ్రామాల్లో అంధాకారం అలుముకుంది.
అర్ధరాత్రి దాటాక 3.10 నుంచి ఉదయం 6.20 వరకు బేతంచెర్ల సబ్‌డివిజన్‌లో, నంద్యాల డివిజన్‌లోని నంద్యాల, పాణ్యం, గోస్పాడు, మహానంది, దొర్నిపాటు తదితర మండలాల్లో అర్ధరాత్రి 3.45 నుంచి 6.52గంటల వరకు, బనగానపల్లె సబ్‌డివిజన్‌లోని గ్రామాల్లోనూ ఇదే సమయంలో కోతలు అమలయ్యాయి. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్లలోని పల్లెల్లో 3.12 నుంచి 6.33 గంటల వరకు.. డోన్ డివిజన్‌లో అర్ధరాత్రి 12.10 నుంచి 3.17గంటల వరకు కోత విధించడం గమనార్హం. శుక్రవారం ఉదయం కూడా జిల్లాలో ఇష్టారాజ్యంగా కోతలు విధించడంతో ప్రజలు అధికారుల తీరుపై పెదవివిరుస్తున్నారు.
షెడ్యూల్ ఖరారు కాలేదు:
వీటీపీపీలో 30వ తేదీన ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా 500 మెగావాట్ల విద్యుత్‌ను కోల్పోయాం. ఫలితంగా రెండు రోజుల నుంచి సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. కోతల షెడ్యూల్ వివరాలను తెలపాలని ఉన్నతాధికారులను కోరినా ఫలితం లేకపోతోంది. రాత్రి వేళల్లోనూ ఎమర్జెన్సీ పేరిట ట్రాన్స్‌కో అధికారులు కోతలు విధిస్తున్నారు. వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌లోనూ గంటన్నర కోత పడుతోంది.
టి.బసయ్య, ఎస్‌ఈ
‘కట్’కటే
Published Sat, Feb 1 2014 3:40 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement