సాక్షి, కర్నూలు : భారీ భద్రత, కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ కర్నూలు నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను ఎలాంటి విఘ్నాలు ఎదురవకుండా చూడాలని అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ అంశంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
గురువారమే నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకారులు ఎవరూ నగరంలోకి ప్రవేశించకుండా అన్నీ మార్గాలను దాదాపు సభ జరిగే సమయం వరకూ మూసివేశారు. పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో ర్యాంక్‌పవర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీ నిర్మిస్తున్న పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టే అవకాశం ఉందన్న నేపథ్యంలో శుక్రవారం ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆ గ్రామస్తులందరినీ ఊరు దాటకుండా దిగ్బంధించారు.
ఇంతవరకు అంతా వారు అనుకున్నట్లే జరిగింది. సీఎం సామాజిక, సాధికారిత పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆ పథకం ఉద్దేశాన్ని ప్రజలకు వివరిస్తుండగా.. ఇంతలో ఒక్కసారిగా సభలో కలకలం రేగింది. ఒక్కసారిగా అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఏమీ జరుగుతోందనే ఆతృత అందరిలోనూ నెలకొంది. అధికారుల ఆదేశాల మేరకు సీఎం సభను విజయవంతం చేయడానికి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలందరూ ఒక్కసారి లేచి సభలో ఆందోళన మొదలుపెట్టారు. పనివేళలకు తగ్గ వేతనాలు ఇవ్వడం లేదని నినాదాలు చేశారు.
కనీస వేతనాలు ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేశారు. తాము దుర్భర జీవితం గడుపుతున్నామని, మమ్మల్ని ఆదుకోవాలని చంద్రబాబును డిమాండ్ చేస్తుండగానే పోలీసులు రంగప్రవేశం చేశారు. స్వయంగా జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ రంగంలోకి దిగి అంగన్‌వాడీ కార్యకర్తలను శాంతింపజేసే యత్నాలు చేశారు. అయినా వారు ఆందోళన విరమించకపోవడంతో మీ సమస్యల్ని చెప్పుకునేందుకు సీఎం వద్దకు తీసుకెళ్తానని నచ్చజెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందిని పోలీసులు బలవంతంగా అక్కడ్నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
నేనేమీ బయపడను..
ఒకవైపు సామాజిక, సాధికారిత పథకం గురించి వివరిస్తుండగా సభలో అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు బుడగజంగాల వర్గానికి చెందిన ప్రజలు కొందరు ఆందోళన చేపట్టడంతో ‘ఒకరిద్దరు స్వార్థ ప్రయోజనాల కోసం గొడవ చేస్తే నేనేమీ బయపడను’ అంటూ సీఎం చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. డ్వాక్రా సంఘాల పనితీరు, భవిష్యత్తులో వారంతా మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇవ్వడంతో.. అప్పటి వరకు సభలో మౌనంగా కూర్చున్న అంగన్‌వాడీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని, తాము కష్టపడుతున్నామంటూ విమర్శించడం సభలో కనిపించింది. అయితే డ్వాక్రా మహిళల పట్ల ఎనలేని అభిమానాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించినప్పటికీ డ్వాక్రా మహిళల నుంచి ఎలాంటి స్పందన కన్పించలేదు. ఏదో మొక్కుబడిగా కార్యక్రమానికి వచ్చామన్న భావన వారిలో స్పష్టంగా కనిపించింది.
ప్రజాప్రతినిధులకు సీట్లు కరువు..
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలకు పెద్దపీట వేశారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. సీఎం చంద్రబాబుకు ఇరువైపులా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు రావెల కిషోర్‌బాబు, కామినేని శ్రీనివాస్‌లు కూర్చోగా వారిని అనుసరించి.. ఇరువైపులా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, టీడీపీ నేతలు శిల్పా మోహన్‌రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కేఈ ప్రభాకర్, టీజీ వెంకటేష్, బీటీ నాయుడు, ఎన్‌ఎండీ ఫరూక్ తదితరులు వేదికపై ఉన్న సీట్లలో కూర్చున్నారు. ఇంతలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మణిగాంధీలు వేదికపైకి వచ్చి సీట్ల కోసం చూస్తుండగా.. కేఈ ప్రభాకర్ కలుగచేసుకుని ఎమ్మెల్యేలకు ముందువరుసలో సీట్లు ఇవ్వాలంటూ వేదికపై ఉన్న తెలుగుదేశం నేతలకు చెప్పడంతో వారు వెనుక వరుసలో ఉన్న సీట్లలో వెళ్లి కూర్చున్నారు.
మొత్తం మీద జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులందరూ వేదికపై కనిపించడంతో ప్రభుత్వ కార్యక్రమం కాస్త తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండో మిషన్ కార్యక్రమానికి జనసమీకరణ బాధ్యత అధికారులకు అప్పగించడంతో డ్వాక్రా, అంగన్‌వాడీ కార్యకర్తలు సభలో అధిక సంఖ్యలో కనిపించారు. కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం పెద్దగా హాజరుకాకపోవడం సభలో చర్చనీయాంశమైంది.
సీఎం సభలో అంగన్‌వాడీల ఆందోళన
Published Sat, Feb 28 2015 2:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement