సాక్షి ప్రతినిధి, కర్నూలు: బీసీలకు పెద్దపీట వేస్తామన్న టీడీపీ వారి మధ్యే చిచ్చు పెడుతోంది. కర్నూలు పార్లమెంట్.. పత్తికొండ, ఆలూరు అసెంబ్లీ టిక్కెట్ల విషయంలో బేరం పెట్టి వేడుక చూస్తోంది. డబ్బు కోసం పార్టీ అధినేత ఎంతకైనా దిగజారుతారంటూ భంగపడిన ఆశావహులు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్రంలో బీసీలకు వంద సీట్లు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు తీరా ఎన్నికల సమయంలో దాగుడుమూతలు ఆడటాన్ని ఆ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో సోమవారం రాత్రి జిల్లాలోని నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. కర్నూలు పార్లమెంట్ టిక్కెట్‌ను ఆశిస్తున్న బి.టి.నాయుడు, ఆలూరు అసెంబ్లీ టిక్కెట్‌ను ఆశిస్తున్న కప్పట్రాళ్ల బొజ్జమ్మ, వైకుంఠం ప్రసాద్‌ల ఆశలపై ఈ సమావేశం నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. ఆలూరు టిక్కెట్‌ను ముద్దుబసవన్న గౌడ్ కుటుంబానికి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదేవిధంగా కోడుమూరు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న లాయర్ ప్రభాకర్‌ను కాదని వేరొకరి పట్ల బాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మంత్రాలయం టిక్కెట్‌ను ఉలిగయ్యకు కాకుండా మాధవరం రామిరెడ్డికి ఇచ్చే ప్రయత్నాలను ఆయన వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఇక దివంగత నేత బి.వి.మోహన్‌రెడ్డి తన జీవితాంతం టీడీపీకి ఎనలేని సేవ చేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు బి.వి.నాగేశ్వరరెడ్డి తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మిగనూరు నుంచి పోటీకి సిద్ధమవుతుండగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన వై.రుద్రగౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించి టిక్కెట్ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది.
అంతా వారి కనుసన్నల్లోనే...
కర్నూలు పార్లమెంట్ పరిధిలో గెలుపోటములను బీసీ ఓటర్లు శాసిస్తున్నారు. టీడీపీలోని ఓ కుటుంబం కర్నూలు పార్లమెంట్ రాజకీయాలను శాసిస్తోంది. బీసీలు ఎదిగితే తమ ఉనికి ప్రశ్నార్థం అవుతుందనే భావనతో అభ్యర్థులను వీరే ఓడిస్తున్నట్లు పార్టీ శ్రేణులే పేర్కొంటున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడుకు పత్తికొండ నియోజకవర్గ పరిధిలో కాస్త పట్టుంది. ఈయనపైనా అదే పార్టీ నాయకుడు చేయి చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఒక 2009లో టీడీపీ నుంచి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ తరఫున బోయ సామాజిక వర్గానికి చెందిన బి.టి.నాయుడు పోటీ చేశారు. వాస్తవానికి ఈ నియోజకవర్గ పరిధిలో బోయ వర్గీయులే అధికంగా ఉండటంతో గెలుపు తథ్యమనే ప్రచారం జరిగింది. అయితే ఆ పార్టీ ముఖ్య నేతలనే ఈయన ఎదుగుదలను అడ్డుకునేం దుకు ఓటమిపాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా గుడిసె క్రిష్ణమ్మ 2004లో ఆదోని అసెంబ్లీ నుంచి పోటీ చేయగా.. ఈమెనూ ఆ కుటుంబ సభ్యులే ఓడించినట్లు సమాచారం. టిక్కెట్ల కేటాయింపు కూడా ఆ కుటుంబం కనుసన్నల్లోనే జరుగుతుం డటంతో బీసీలు ఎదగలేకపోతున్నట్లు పార్టీ వర్గీయులు వాపోతున్నారు.
తొక్కేశారు
Published Wed, Feb 26 2014 4:06 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement