సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో డిప్యుటేషన్ల హవా కొనసాగుతోంది. అస్మదీయులకు కోరుకున్న పోస్టింగ్ లభిస్తుంది. సదరు కార్యాల యం, పీహెచ్‌సీలో సిబ్బంది అవసరం లేకపోయినా కొందరు డిప్యుటేషన్లపై వెళ్తున్నారు. అ వసరమైన సెక్షన్, లేకపోతే ఆఫీస్ వేళల్లో సొంత పనులు చక్కబెట్టుకునేందుకు వీలుగా ఉండే పొజిషన్‌ను దక్కించుకుంటున్నారు. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన సురేశ్‌కుమార్ డిప్యుటేషన్లు రద్దు చేసి రెగ్యులర్ పద్ధతిన ఉద్యోగులను నియమించారు. అనంతరం వైద్య శిబిరాలు, ఇతర కుంటిసాకులతో 30 శాతం ఉద్యోగులు డిప్యుటేషన్లపై వచ్చిన వారే పనిచేస్తున్నట్టు సమాచారం.
సొంత శాఖలోనే అసంతృప్తి..
చాలా పీహెచ్‌సీల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అస్సలు డాక్టర్లు లేని, అవసరమైన సిబ్బందిలేని పీహెచ్‌సీలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలకు సిబ్బందిని సమకూర్చాల్సి ఉంది. కొందరు వ్యక్తులు మాత్రం డిప్యూటేషన్లను దుర్వినియోగపరుస్తుండడంతో ఆ శాఖలోనే వీరిపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. పనిభారం, అవసరమున్న చోట డిప్యూటేషన్లు వేయకుండా అనవసరమైన చోట సొంత అవసరాలకు ఉపయోగపడేలా డిప్యూటేషన్లపై వెళ్లి కాలయాపన చేస్తున్నట్టు సమాచారం. డిప్యూటేషన్లపై వచ్చిన వారు కడుపులో చల్ల కదలకుండా కాలం గడిపేస్తున్నారు. ఇలా పనిచేస్తున్న వారెందరో వీరి పనితీరు మరీ విచిత్రంగా ఉంటుంది. కొందరు పనిచేసే వారైతే.. మరికొందరు సంతకం చేసి బయటకు వెళ్లివస్తున్నట్టు సమాచారం.
ఈ సమయంలో తమ సొంత పనులు చక్కబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాలు బిగించినా వారి తీరులో మార్పు లేకపోవడం గమనార్హం. పెద్దల ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్న ఆత్మవిశ్వాసంతో వారు ఇలా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి వారిని తిరిగి యథాస్థానాలకు పంపించాలంటే రాజకీయ వత్తిడి, ఇతరత్రా కారణాలు పై అధికారులకు కొరకరాని కొయ్యగా మారినట్టు సమాచారం. వీరికితోడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బదిలీ చేసిన చోటు నుంచి కదలకుండా ఉంచడంలో ఆంతర్యమేమిటో బోధపడడం లేదు. చివరకు కలెక్టర్ సీరియస్ కావడంతో వారిని బదిలీ చేసిన చోటుకు పంపారు. అయినప్పటికీ సదరు ఉద్యోగులు నిత్యం జిల్లా కార్యాలయంలోనే దర్శనమిస్తున్నారు.
ఇదే విషయమై డీఎంహెచ్‌ఓ కార్యాలయ పరిపాలనాధికారి మురహరిని వివరణ కోరగా ఒక వాచ్‌మన్ తప్ప మరెవరూ ఈ శాఖలో డిప్యూటేషన్‌పై ఇక్కడ పనిచేయడం లేదన్నారు. నాల్గో తరగతి ఉద్యోగుల వివరాలు అడగ్గా తనకేమీ తెలియదని, సంబంధిత సూపరింటెండెంట్లను కలవాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఆ శాఖలో ఎంతో మంది దర్జాగా తమ విధులు నిర్వహిస్తున్నారని చెప్పకనే చెప్పినట్లయింది.
అక్రమ డిప్యుటేషన్ల హవా!
Published Mon, Mar 3 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM
Advertisement
Advertisement