
అవినీతి ధార!
గజ్వేల్, న్యూస్‌లైన్: మంచినీటి పథకాల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. ప్రజల దాహార్తి అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. ప్రధానంగా పంపుసెట్ల బిగింపు, రీప్లేస్‌మెంట్లలో నిబంధనలకు పాతరేస్తూ నాణ్యతలేని పరికరాలతో లక్షలు దండుకుంటున్నారు. 18 నెలల (గ్యారంటీ)లోపు చెడిపోతే వాటి స్థానంలో కొత్త పంపుసెట్లు బిగించడం లేదా మరమ్మతులు చేయించాల్సి వుండగా పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఫలితంగా ఈ భారం ‘పంచాయతీ’లపైనే పడుతోంది. మరోవైపు అనుమతిలేని కంపెనీల పంపుసెట్లను పంపిణీ చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.. ఏళ్ల తరబడి ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోకుండా అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలున్నాయి.
గజ్వేల్ నియోజకవర్గంలో మంచినీటి పథకాల అమలు గందరగోళంగా మారింది. గ్రామాల్లో దాహార్తి నివారణకు ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారానే కాకుండా గ్రామపంచాయతీలు, వివిధ పథకాల ద్వారా ప్రతియేటా కోట్లల్లో నిధులు వెచ్చిస్తున్నారు. ఈ పథకాలన్నీ అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ప్రధానంగా పంపుసెట్ల బిగింపు, రీప్లేస్‌మెంట్లలో భారీఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్లోవెల్, వర్ష, సీఆర్‌ఐ, క్రామ్టన్, ఎలెన్ కంపెనీలకు చెందిన పంపుసెట్లను మాత్రమే బిగించాల్సి ఉంటుంది. సాధారణంగా హెచ్‌పీ మోటార్, స్టార్టర్, ప్యానల్‌బాక్స్, సర్వీసువైరు, బోర్‌క్యాప్, ఎంఎస్‌స్టాండ్, నిప్పల్ తదితర పరికరాలకు రూ.24 వేల వరకు ఖర్చవుతుంది. 1.5 హెచ్‌పీకి మరో రూ.1500, 2హెచ్‌పీకి మరో రెండున్నరవేలు అదనంగా ఖర్చవుతాయి. 5హెచ్‌పీ మోటార్‌కు జీఐపైప్ వాడటం వల్ల అన్నీ కలుపుకొని రూ.50 వేల వరకు ఖర్చవుతుంది.
జరుగుతున్నదేమిటీ..
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఐదు కంపెనీల మోటార్‌లే కాకుండా చాలాచోట్ల స్థానికంగా తయారుచేసిన మోటార్లను బిగిస్తున్నారు. ఒరిజినల్ కంపెనీల మోటార్లతో పోలిస్తే వీటికి సగానికిపైగా ఖర్చు తగ్గుతుంది.
కానీ ఒరిజినల్ కంపెనీల మాదిరిగానే నిధులు డ్రా చేస్తున్నారు. మరో పక్క ఈ మోటార్లకు 18 నెలల గ్యారెంటీ వ్యవధి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఏడాదికి మించి గ్యారెంటీ ఇవ్వడం లేదు.
ఏడాది తర్వాత కొత్త మోటార్లు బిగించి నిధులు అప్పనంగా స్వాహా చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ తంతు యథేచ్ఛగా కొనసాగుతోంది. మరో దారుణమైన విషయేమిటంటే కొన్నిచోట్ల ముందుగా ఒరిజినల్ కంపెనీ మోటార్‌ను ఫిట్ చేసి అది రిపేర్‌కు వచ్చిన తర్వాత మార్చడానికి తీసుకువెళ్తే రెండోసారి అసెంబుల్డ్ ఫిట్టింగ్ మోటార్‌ను ఇస్తున్నట్లు పలు గ్రామాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమైతే చాలు అక్రమాల సంగతి మాకెందుకని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పట్టింపులేని ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఇదీ ఉదాహరణ..
గజ్వేల్ మండలం అక్కారం పెద్దచెరువులో గ్రామ మంచినీటి అవసరాల కోసం బోరుబావిని వేశారు. ఈ బోరుబావిలో బిగించిన మోటార్ ఏడాదిన్నర క్రితం చెడిపోయింది. గ్యారెంటీ వ్యవధి ఉండగానే ఇది చెడిపోవడంతో దీని స్థానంలో కొత్త మోటార్ ఇస్తానని సదరు ఏజెన్సీ నిర్వాహకులు చెప్పారు. కానీ ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు మోటార్ ఇవ్వలేదు. ఫలితంగా గ్రామంలో మంచినీటి ఎద్దడి తప్పడంలేదు. ఇదే గ్రామంలో గడిచిన నెలల కాలంలో మూడు బోరుబావులు చెడిపోగా గ్యారెంటీ వ్యవధి ఉన్నా.. కరెంట్ సరఫరాలో లోపాల కారణంగా కాలిపోయాయి కాబట్టి ఇవ్వలేమని చేతులెత్తేయడంతో పంచాయతీ నిధులు నుంచి మరమ్మతులు చేయించారు. దీనివల్ల పంచాయతీపై రూ.30 వేలకుపైగా భారం పడింది. అక్కారంలోనే కాదు నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.