
పెంచుకొని.. పంచుకునేందుకే!
ఎస్సారెస్పీ కాల్వ రీమోడలింగ్‌లో గోల్‌మాల్
రూ.108 కోట్లకు కాంగ్రెస్-టీడీపీ నేతల టెండర్!
రంగంలో కేంద్రమంత్రి, ఎమ్మెల్యేలు
పంచుకునేందుకు అంచనాల పెంపు
పోటీ కాంట్రాక్టర్లకు బెదిరింపులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: అడ్డగోలు పనులు.. అక్రమ చెల్లింపులకు కేంద్రంగా మారిన ఎస్సారెస్పీ కాల్వలకు కాంగ్రెస్, టీడీపీ నాయకులు కలసికట్టుగా టెండర్ పెట్టారు. ఓ కేంద్ర మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు ముఖ్య నేతలు ఒక్కటై తమకు అనుయాయుడైన కాంట్రాక్టర్‌కు టెండర్ కట్టబెట్టి.. వచ్చిన లాభాలు పంచుకునేలా పథకం పన్నడం విస్మయపరుస్తోంది. ఎస్సారెస్పీ మొదటి దశలో భాగమైన కాకతీయ కెనాల్ పరిధిలోని డీబీఎం-48 మేజర్ కాల్వ పరిధిలోని మైనర్లు, సబ్ మైనర్ కాల్వలన్నింటికీ మరమ్మతులతో పాటు ఒక క్యూమెక్ నీటి సరఫరాకు వీలుగా సీసీ లైనింగ్‌తో రీ మోడలింగ్ చేసేం దుకు రూ.108 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ పిలిచారు. వరంగల్ జిల్లాలో సంగెం మండలం తీగరాజుపల్లి నుంచి డోర్నకల్ మండలం వెన్నారం వరకు ఉన్న డీబీఎం-48లో కిలోమీటర్ 4 నుంచి కిలోమీటరు 50 వరకు ఈ పనులు చేపట్టాల్సి ఉంది. వీటికి రూ.107 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపిస్తే... ప్రభుత్వం రూ.108 కోట్లకు పరిపాలనా అనుమతి ఎందుకు మంజూరు చేసిందో అంతుచిక్కని తిరకాసు. నిజానికి ఈ కాల్వలకు మరమ్మతులు తప్ప రీ మోడలింగ్ అవసరమేమీ లేదు. కానీ పర్సంటేజీల దురాశతో టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే ఈ పని సృష్టించారు.
ఇంజనీర్లపై ఒత్తిడి పెంచి రూ.70 కోట్ల విలువ చేసే పనులను అమాం తం రూ.108 కోట్లకు పెంచారు. దీనికి తోడు తాము సూచిం చిన కాంట్రాక్టరుకు పని దక్కేలా టెండరు నిబంధనలు మార్చాలని ఇంజనీర్లపై ఒత్తిడి పెంచారు. గతంలో ఇక్కడ పని చేసిన ఎస్‌ఈ అం దుకు నిరాకరించగా, ఆమెను బదిలీ చేయించి.. తమకు అనుకూలంగా ఉండే అధికారిని తెచ్చుకున్నారు. కొత్త ఎస్‌ఈ వచ్చీ రాగానే.. టెండర్ ఫైలు వేగంగా కదిలింది. ఆగస్టు 14న ఈపీసీ విధానంలో ఈ పనులకు టెండర్లు పిలిచారు. ఈనెల 4న టెం డర్ల దాఖలు గడువు ముగిసింది. మొత్తం 9 కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. ఐవీఆర్‌సీఎల్, కేఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్, రాఘవ కన్‌స్ట్రక్షన్స్, ఎస్‌వీఈసీ కన్‌స్ట్రక్షన్స్, శ్రీసాయి లక్ష్మి, జీవీరెడ్డి, జీవీపీఆర్, హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రా, శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. టెక్నికల్ అర్హతలకు అనుగుణంగా కంపెనీలను షార్ట్ లిస్ట్ చేసి.. గురువారం ఫైనాన్షియల్ బిడ్ తెరవాల్సి ఉంది. అరుుతే ఇంకా పరిశీలన పూర్తి కాలేదని.. ఈనెల 18వ తేదీకి వాయిదా వేసినట్లు ఎస్‌ఈ తెలిపారు. నేతలు కోరిన కాంట్రాక్టర్‌కు టెండర్ కట్టబెట్టేందుకే టెక్నికల్ అర్హతలను మార్చేసినట్లు ఆరోపణలున్నాయి.
గతంలో ఎస్సారెస్పీ పరిధిలో రూ.40 కోట్ల పనులకు సైతం జాయింట్ వెం చర్ కాంట్రాక్టుకు అనుమతించారు. కానీ, ఈ టెండర్‌లో నిరాకరించారు. ముందు జాగ్రత్తగా జాయింట్ వెంచర్ ఇవ్వొద్దంటూ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో సీఎంకు, ఉన్నతాధికారులకు లేఖ రాయించారు. మొత్తం రూ.108 కోట్ల పనుల్లో కేవలం రూ.2 కోట్ల అంచనా వ్యయమయ్యే షట్టర్లు బిగించే పనులున్నాయి. వీటిని సాకుగా చూపించి కాంట్రాక్టర్లకు షట్టర్ల పనులు చేసిన అనుభవం తప్పనిసరనే నిబంధనను పొందుపరిచారు. మరోవైపు ఈ పనులకు పోటీకి రావద్దంటూ స్వయానా కేంద్రమంత్రి కొందరు కాంట్రాక్టర్లకు హుకుం జారీ చేశారు. ‘మా ఏరియాలో పనులెలా చేస్తారో చూస్తాం.. విత్ డ్రా చేసుకోండి’ అంటూ టెండర్ వేసిన కాంట్రాక్టర్లను స్వయంగా కలిసి హెచ్చరించినట్లు సమాచారం. కాగా, నిబంధనలు, అర్హతల మేరకే టెండర్ల ప్రక్రియ జరుగుతోందని ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.