చంద్రన్నా... ఇదేందన్నా..
క్రిస్మస్ కానుక పంపిణీలో అవకతవకలు
కార్డుదారులను మోసగిస్తున్న రేషన్ డీలర్లు
ఆరు సరుకులకుగాను నాలుగే పంపిణీ
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
నరసరావుపేట టౌన్ : చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుక పంపిణీలో అధికారుల పర్యవేక్షణ లోపం, డీలర్ల ఇష్టారాజ్యం కారణంగా కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగలను దృష్టిలో ఉంచుకుని కార్డుదారులకు ఉచితంగా ప్రభుత్వం చంద్రన్న కానుకను పంపిణీ చేస్తోంది. రూ.275 విలువ చేసే అరలీటరు పామాయిల్, అరకేజీ చొప్పున శనగలు, కందిపప్పు, బెల్లం, కేజీ గోధుమపిండి, 100 గ్రాముల నెయ్యి లబ్దిదారులకు ఉచితంగా అందిస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి డీలర్లు ఈ ప్రక్రియను ప్రారంభించారు. కాగా కానుక సరుకుల కోసం గురువారం ఉదయం చౌకదుకాణం వద్దకు వెళలగా డీలర్లు అందుబాటులో లేరు. గంటల కొద్ది వేచివున్న తరువాత డీలర్లు వచ్చి అధికారుల నుంచి ఆదేశాలు అందలేదని కొందరు, ఈపోస్ మిషన్ పనిచేయడం లేదని మరికొందరు చెప్పటంతో అప్పటివరకు వేచి ఉన్న కార్డుదారులు అసహనానికి గురయ్యారు.
30వ నంబరు షాపు పరిధిలో ఎక్కువ మంది దళిత వర్గానికి చెందిన కార్డుదారులు ఉన్నారు. ప్రతి నెలా డీలరు వ్యవహరిస్తున్న తీరుపై ఇబ్బందులకు గురౌతున్న వారు చంద్రన్న క్రిస్మస్ కానుక పంపిణీలో కూడా డీలర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో కార్డుదారులు వాగ్వివాదానికి దిగారు. విషయాన్ని తహశీల్దార్ లీలా సంజీవకుమారికి ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆమె వీఆర్‌వో బ్రహ్మేశ్వరరావును అక్కడకు పంపి అతడి పర్యవేక్షణలో పంపిణీ చేపట్టారు. కాగా 6 సరుకులకు గాను శనగలు, బెల్లం మినహాయించి మిగిలిన నాలుగు రకాల వస్తువులనే కొందరు డీలర్లు పంపిణీ చేశారు. అధికారులు పూర్తిస్థాయిలో నిత్యావసరాలను డీలర్లకు అందజేశామని చెబుతుండగా డీలర్లు మాత్రం తమకు అందలేదని చెప్పుకొస్తున్నారు. దాదాపుగా అఇన్న రేషన్ షాపుల వద్ద అరకొర సరుగులు పంపిణీ, అక్రమ వసూళలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. డీలర్లంతా అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు వారిని ప్రశ్నించడానికి భయపడుతున్న పరిస్థితి.
ఉచిత సరుకుల పంపిణీకి రూ.50 వసూలు
చంద్రన్న క్రిస్మస్ కానుకను కార్డుదారులకు ఉచితంగా అందించాల్సి ంది. అయితే కొందరు డీలర్లు రూ.20 నుంచి రూ.50 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని కార్డుదారులు వాపోతున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని కార్డుదారులు ఆవేదన చెందుతునానరు. ఇదిలా ఉండగా నూతనంగా కార్డులు మంజూరైన వారికి సైతం కానుక వస్తువులు కేటాయించారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా జాబితా ప్రకారం వారికి పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే రేషన్ కార్డులు లేని కారణంగా పంపిణీ చేయమంటూ డీలర్లు చెబుతుండటంతో పేదలు ఆవేదన చెందుతున్నారు.
డీలర్ దురుసుగా ప్రవర్తిస్తున్నారు
డీలరు సమయపాలన పాటించడంలేదు. ఈ విషయంపై అడిగితే దురుసుగా ప్రవర్తిస్తూ నీ ఇష్టం వచ్చిన వాళ్లకి చెప్పుకోమంటున్నాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు.
- రోజమ్మ, షాలెంనగర్
ఐదు నెలలుగా సరుకులు ఇవ్వలేదు
వేలిముద్ర పడటం లేదంటూ 5 నెలలు గా సరుకులు ఇవ్వడం లేదు. ఇప్పుడు వీఆర్వో సమక్షంలో ఈపోస్ మెషీన్ అంగీకరించడంతో సరుకులు ఇచ్చారు. అంటే ఐదు నెలలుగా డీలర్ నా సరుకులు ఇతరులకు అమ్మేశారు. - వజ్రమ్మ, షాలెంనగర్
పాత కార్డును సైతం తొలగించారు
ఎప్పటి నుంచో ఉన్న రేషన్ కార్డును 4 నెలల క్రితం తొలగించారు. వృద్ధురాలినన్న కనికరం కూడా లేదు. నూతన కార్డు కోసం అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నిత్యం తిరగ లేక ఇబ్బందిపడుతున్నాను. - గండ్రకోట శారదాంబ