ఇంతింతై.. అవినీతి కొండంతై | Irregularities In Neeru-Chettu Programme In YSR Kadapa | Sakshi
Sakshi News home page

ఇంతింతై.. అవినీతి కొండంతై

Published Tue, Mar 26 2019 9:46 AM | Last Updated on Tue, Mar 26 2019 9:46 AM

Irregularities In Neeru-Chettu Programme In YSR Kadapa - Sakshi

సాక్షి, కడప: నీరు–చెట్టు పనులు తెలుగుదేశం పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపించాయి. గత ఏడాది మే నెలవరకు జిల్లావ్యాప్తంగా ఈ పథకం కింద 9,405 పనులు చేపట్టగా.. ఇందుకోసం రూ.626.56 కోట్లు వ్యయం చేశారు. ఇందులో చాలాచోట్ల గతంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులనే మళ్లీ చేపట్టినట్లు రికార్డుల్లో చూపి రూ.లక్షలు తమ జేబుల్లో నింపుకొన్నారు. కొందరు టీడీపీ నేతలు తూతూమంత్రంగా పనులు కానిచ్చేశారు. మరికొందరు నాసిరకంగా పనులు చేసి బిల్లులు దండుకున్నారు. కొన్నిచోట్ల నాసిరకంగా చేసిన చెక్‌డ్యాంలకు పగుళ్లు రావడంతో వాటికి పైపైన సిమెంటు పూతలు పూసి మమా అనిపించారు. 

  • ఇక పూడికతీత పనుల్లో చెరువులు, కుంటలు, కాలువల్లో తీసిన మట్టిని టీడీపీ నేతలు వదల్లేదు. ఆ మట్టిని రైతులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ డిమాండ్‌ను బట్టి ట్రాక్టర్‌ రూ. 800 నుంచి రూ.2వేల వరకు అమ్ముకున్నారు. మొత్తం రూ. 447.80 కోట్ల విలువైన పనులు చేపట్టగా..  మట్టిని విక్రయించి టీడీపీ నేతలు లక్షలు గడించడం గమనార్హం. ఇక చెక్‌డ్యాం పనుల్లోనూ కోట్లాది రూపాయలు ఇలాగే వెనకేసుకున్నారు. నాసిరకంగా పనులు చేయడమే కాకుండా.. కొన్ని చోట్ల అవసరం లేకున్నా చెక్‌డ్యాంలు నిర్మించి సొమ్ము చేసుకున్నారు. 
  • జిల్లావ్యాప్తంగా రూ. 178.76 కోట్లు చెక్‌డ్యామ్‌లకు ఖర్చు పెట్టారు. చాలా చోట్ల చెక్‌డ్యాంలను పడగొట్టి మళ్లీ కట్టి సొమ్ము చేసుకున్నారు. మరికొన్ని చోట్ల ఉపాధి పనుల్లో భాగంగా చేసిన పూడికతీత పనులనే మళ్లీ చేసినట్లు చూపి బిల్లులు పక్కదారి మళ్లించారు. ఇలా టీడీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా రూ. 250 కోట్లపైనే నిధులను దారి మళ్లించినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

నీరు–చెట్టు పనుల కోసం పోటాపోటీ..  

  • నీరు–చెట్టు పనుల కోసం టీడీపీ నేతలు బహిరంగంగా రచ్చకు దిగడం జిల్లాలో కనిపించింది. బద్వేలు నియోజకవర్గంలో నీరు–చెట్టు పనులు నాయకుల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. స్వయంగా ఎమ్మెల్యే జయరాములు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి రూ. 90 కోట్లు నీరు–చెట్టు పథకం కింద నిధులు మంజూరు కాగా.. అందులో మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు రూ.85 కోట్లు, తనకు రూ. 3 కోట్లు, మరో టీడీపీ నేత విజయజ్యోతికి రూ. 2 కోట్ల పనులు ఇచ్చారని మండిపడ్డారు. విజయమ్మ వర్గం పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని ఆయన బహిర్గతం చేసుకున్నారు.  ఈ పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే జయరాములు విజిలెన్స్‌ అధికారులకు లేఖ రాశారు. ఈ పనులన్నీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గానికి చెందిన వ్యక్తులే చేయడం గమనార్హం. దాదాపు రూ.2 కోట్ల విలువైన 22 చెక్‌డ్యామ్‌లను ఈ నియోజకవర్గంలో నిర్మించారు. అవన్నీ నాసిరకంగా చేశారన్న విమర్శలు ఉన్నాయి. విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టి కాంక్రీట్‌ నమూనాలను విజయవాడ ల్యాబ్‌కు పంపించారు. 
  • పనులన్నీ టీడీపీ నేతలకే..
  • జిల్లాలో నీరు–చెట్టు కింద చేపట్టిన పనుల్లో 99 శాతం పనులు టీడీపీ నేతలే దక్కించుకున్నారు. ఆ పనులను బినామీలతో చేయించారు. ఎక్కడా నిబంధనలు పాటించకుండా పనులను మమ అనిపించి కోట్లు దండుకున్నారు. జమ్మలమడుగులో అధికారపార్టీ నేతతోపాటు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డిలు నీకు సగం.. నాకు సగం అంటూ పనులు పంచుకున్నారు. ఈ నియోజకవర్గంలో  రూ. 96 కోట్ల విలువైన పనులు జరిగాయి. నియోజకవర్గంలోని కొండాపురంలో ఏకంగా పనుల విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. పంచాయతీ పోలీసు స్టేషన్‌కు చేరింది. అక్కడ పోలీసుల సమక్షంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 
  • కడప బుగ్గవంకలో...
  • కడప బుగ్గవంక పరిధిలో పూడికతీత పనులకు సంబంధించి తొలుత రూ. 66 లక్షలకు అధికారులు నివేదికలు తయారు చేశారు. అయితే ఈ పనులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి బినామీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేశారనే ఫిర్యాదులపై అధికారులు స్పందించక తప్పలేదు. దీంతో పనులను నిలిపివేశారు. కేవలం రూ. 12 లక్షలు బిల్లులు చెల్లించారు. విజిలెన్స్‌ విభాగం పరిశీలన జరపడంతో అంతటితో ఈ పనులు ఆగిపోయాయి. వారిపై ఎలాంటి చర్యలు లేవు. 
  • కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి అంతా తానై రూ. 49.15 కోట్ల నీరు–చెట్టు పనులు చేయడం గమనార్హం. పులివెందుల నియోజకవర్గంలో రూ. 71.90 కోట్ల విలువైన నీరు–చెట్టు పనులు చేపట్టగా.. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎక్కువ శాతం పనులు దక్కించుకున్నారు. ఈ పనులన్నీ తన అనుయాయులకు పంచిపెట్టారు. 

మట్టి కొట్టుకుపోయింది
వల్లూరు మండలంలో పైడికాలువ, పెద్దపుత్త గ్రామాల మధ్యన గల వంకపై పైడికాలువ గ్రామ పంచాయతీ పరిధిలోని జంగంపల్లె వద్ద జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నీరు చెట్టు కింద నిర్మించిన మోడల్‌ చెక్‌డ్యాం.  30 లక్షల రూపాయల వ్యయంతో  నిర్మించిన ఈ చెక్‌ డ్యాం జిల్లాలో అతి తక్కువ ఖర్చుతో నిర్మించిన చెక్‌డ్యాంగా అధికారులు పేర్కొంటున్నారు. ఇంత ఎక్కువ మొత్తాన్ని ఒకే పని కింద చూపితే టెండర్‌లు పిలవాల్సివస్తుందనే కారణంగా మూడు పనులుగా విభజించారు. వంకకు ఇరువైపులా నిర్మించిన రెండు మట్టి కట్టలను రెండు పనులుగా ,  కాంక్రీట్‌ నిర్మాణాన్ని మరో పనిగా విభజించారు.

దీంతో ఒక్కో పనికి రూ. 10 లక్షల చొప్పున మూడు పనులకు కలిపి రూ. 30 లక్షలను కేటాయించారు. స్థానిక ఎంపీటీసీ తనయుడు గ్రామానికి చెందిన టీడీపీ నేత వాసు పర్యవేక్షణలో నిర్మాణాన్ని చేపట్టారు. చెక్‌డ్యాంకు ఇరువైపులా ఉన్న మట్టి కట్టలను వంకలో ఉన్న మట్టితోనే నాసిరకంగా ని ర్మించారు.  నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత దాదాపు 40 రోజుల్లో కురిసిన వర్షాలకు చెక్‌డ్యాంకు నీరు చేరింది. కాంక్రీటు నిర్మాణానికి ఆనుకుని ఇరువైపులా ఏర్పాటు చేసిన మట్టి కట్టలో ఒకవైపున గల మట్టి  కట్ట  నీటి ప్రవాహానికి కొట్టుకుని పోయింది. దీంతో  చుక్క నీరు కూడా నిలువకుండా దిగువకు తరలి పోయింది.

సీఎం తనయుడు సందర్శించిన మోడల్‌ చెక్‌డ్యాం ఇదే..

జిల్లాలోనే మోడల్‌ చెక్‌డ్యాంగా రూపొందించిన ఈ చెక్‌డ్యాంను  2017 వ సంవత్సరం జులై నెల 12 వ తేదీన జిల్లా పర్యటనకు వచ్చిన  సీఎం తనయుడు, రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రి నారా లోకేష్‌ సందర్శించారు. ఆయన సందర్శించిన 40 రోజుల్లోనే నాసిరకంగా నిర్మించిన  ఈ చెక్‌డ్యాం వర్షపు నీటికి తెగిపోవడం నీరు చెట్టు పథకంలో జరిగిన అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.


దొరికినంత దోచుకోవడమే..

గాలివీడు :  పనులన్నీ రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి్జ ఆర్‌.రమేష్‌రెడ్డి , వారి అనుచరులు చేపట్టారు. నూలివీడు గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు పార్వతమ్మ కుటుంబీకులు చేసిన పనులకు మెరుగులు దిద్ది దాదాపు రూ. 80లక్షలు పైగా బిల్లులు చేసుకొని నిధులను దిగమింగారు. దాదాపు రూ.1.50కోటి పైగా ఆర్‌.రమేష్‌రెడ్డి బినామీ టీడీపీ నాయకుడు, గాలివీడు ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యుడు రామమోహన్‌నాయుడు తూముకుంటలో వివిధ రకాల పనులు చేపట్టారు. కొర్లకుంట గ్రామంలో ఎంపీటీసీ ఈశ్వరమ్మ కుమారుడు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి రైతులకు ఎలాంటి ఉపయోగం లేని చోట పనులు చేసి రూ.70లక్షలు బిల్లులు చేసుకున్నారు. గోరాన్‌చెరువులో రమేష్‌రెడ్డి సమీప బంధువు మాజీ ఎంపీటీసీ సభ్యుడు దాసరి రెడ్డిప్రసాద్‌రెడ్డి దాదాపు రూ. 50లక్షలు పైగా విలువైన పనులు చేపట్టారు. ఎగువ గొట్టివీడుకు చెందిన మండల టీడీపీ ఉపాధ్యక్షుడు శివప్పనాయుడు ఉపాధి పనులు చేసిన పనులకే నీరు –చెట్టు పనులు చేసి దాదాపు రూ.30లక్షలుపైగా స్వాహా చేశాడు.   

చెరువు మట్టి.. విక్రయాలు చేపట్టి..
కడప అర్బన్‌ పరిధిలో 2016–17 లో పూడికతీత పనులకు సంబంధించి రూ.2 కోట్లు, 113 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.95 లక్షలు, 2017–18 లో పూడికతీత రెండు పనులకు గాను రూ.19 లక్షలు, 10 చెక్‌డ్యాంల నిర్మాణాలకు రూ.90 లక్షలు, మొత్తం రూ.4.04 కోట్లు నీరు చెట్టు కింద ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2015–16 లో కడప అర్బన్‌ పరిధిలో నీరు చెట్టు కింద ఎలాంటి పనులు చేపట్టలేదని అధికారులు వెల్లడించారు.

పుట్లంపల్లె చెరువులో నీరు–చెట్టు కింద పూడిక తీసి మట్టిని అమ్మేందుకు ట్రాక్టర్లలో వేస్తున్న దృశ్యం 

పుట్లంపల్లె చెరువును చెరబట్టారు...
కడప అర్బన్‌ పరిధిలో పుట్లంపల్లె చెరువులో పూడికతీత పనులకు, జంగిల్‌ క్లియరెన్స్‌కు రూ.9.30 లక్షలు ఖర్చు చేశారు. ఈ చెరువులో మట్టిని టీడీపీ నాయకుడు రెడ్డెయ్య అమ్ముకుని ఆదాయవనరుగా మార్చుకున్నాడు. ఓ ట్రిప్పు ట్రాక్టర్‌ మట్టిని రూ.300 నుంచి రూ. 400 వరకు విక్రయిస్తూ యథేచ్ఛగా వ్యాపారం కొనసాగించాడు. ఈ నాయకునికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి అండదండలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. చెరువులో తీసిన పూడిక మట్టిని కట్టకు గాని రైతులకు ఉచితంగా గాని, ప్రభుత్వ పనులకు ఉచితంగా  తరలించాల్సి ఉంటుంది. అదీ కూడా నిబంధనలకు లోబడి పూడికతీత పనులు చేపట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా పూడికతీసిన మట్టిని పొక్లెయిన్‌తో ట్రాక్టర్లకు నింపి వ్యాపారం చేసుకున్నారు. దీనిపై ప్రజలు ఫిర్యాదులు చేసినా అధికారులు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు.
 
నిబంధనలకు విరుద్ధంగా..
కడప బుగ్గవంకలో పూడికతీత పనుల కోసం రూ.66 లక్షలతో అధికారులు నివేదికలు తయారు చేశారు. కాని టీడీపీ నేతలు పనులు నిబంధనలకు విరుద్ధంగా చేయడంతో కేవలం రూ.12 లక్షలు మాత్రమే అధికారులు బిల్లులు చేశారు. తర్వాత విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేశారు. చర్యలు మాత్రం లేవు. ఆ తర్వాత పనులను ఆపేశారు. అధికారులపై అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తెచ్చారు. ఈ పనులు కూడా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి అనుచరులు, బినామీలే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

బుడ్డాయపల్లె చెరువులోనూ..
బుడ్డాయపల్లె చెరువులో కూడా అధికార పార్టీ నాయకులు మట్టిని అమ్ముకున్నారు. యథేచ్ఛగా మట్టిని అమ్ముకుని వ్యాపారం చేస్తున్నా అధికారుల తనిఖీలు మాత్రం శూన్యం. అలాగే దేవుని కడప చెరువులో కూడా మట్టిని అమ్ముకుంటూ అక్రమార్జనకు టీడీపీ నాయకులు తెరలేపారు.   

ఈ వింత చూడండి.. తొండూరు–గంగాదేవిపల్లె మధ్యలో గుట్టకు వాగులు సృష్టించి అధికారపార్టీ నాయకులు భారీగా అవినీతికి పాల్పడ్డారు. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలంలో వాగులు, వంకలు, చెరువులు లేకపోయినా వాటిని పొక్లెయిన్ల సహాయంతో సృష్టించారు. మండలంలో నీరు–చెట్టు కింద 21 పనులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.  

 

సబ్సిడీతో ట్రాక్టర్లు ఇచ్చి మట్టి, ఇసుక దోచేశారు
టీడీపీ నాయకులకు ప్రభుత్వం సబ్సిడీ కింద రైతు రథం ట్రాక్టర్లు ఇచ్చింది. ఆ ట్రాక్టర్లతో వారు మట్టి, ఇసుకను ఇష్టం వచ్చినట్లు తోలి కోట్లాది రూపాయలు సంపాదించారు. ఆ ప్రాంతంలో రెండు ట్రాక్టర్లు ఉన్న ఓ టీడీపీ కార్యకర్త మూడు నెలల్లోనే ఇసుక అక్రమ రవాణా ద్వారా కోటి రూపాయలు సంపాదించాడంటే, ఐదేళ్లపాటు ఒక్కొక్కరు ఎంత సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. నీరు చెట్టు పేరు చెప్పి బిల్లులు చేసుకున్నారు. ఆ మట్టిని పొలాలకు తోలకుండా అమ్ముకుని రెండు వి«ధాలుగా సంపాదించారు.

 – మెడతాటి రవి, మోడమీద పల్లె, కడప


తాగునీటికి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి నెలకొంది
అధికార పార్టీ నాయకులు ఒక్కొక్కరు రెండేసి ట్రాక్టర్లు కొని ఇసుకను, మట్టిని అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. కడప, ఆలంఖాన్‌పల్లెకు చెందిన నాయకుల పేర్లు చెప్పి సహజ వనరులను కొల్లగొట్టారు. టీడీపీ నాయకుల అరాచకాల వల్ల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కడపలో తాగునీటి సమస్య తలెత్తడానికి వీరే ప్రధాన కారకులు. ప్రభుత్వం వీరికి దోచిపెట్టేందుకే ఉన్నట్లు పనిచేసింది. వీటికి అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యాడు. 

   – భాస్కర్‌రెడ్డి, మోడమీదపల్లె, కడప


ఇసుకతో చెక్‌డ్యాంలను నిర్మించారు
నీరు–చెట్టు పథకం కింద చేపట్టిన చెక్‌ డ్యాంలను ఇసుక, కంకర, సిమెంటుతో కాకుండా ఇసుకతోనే అధికార పార్టీ నాయకులు నిర్మించారు. లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల పరిధిలో చేపట్టిన చెక్‌డ్యాంలను ఒక్కసారి పరిశీలిస్తే వాటి నాణ్యత తెలిసిపోతుంది. ఒక నిర్మాణం జరుగుతుండగానే మరోవైపు దుమ్ము లేచిపోతున్నా అధికారులు మాత్రం ఒక్కో చెక్‌డ్యాంకు రూ.5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు బిల్లులు చేసి ఇచ్చేశారు. పనులు నామినేషన్‌ మీదనే కేటాయించడంతో పాటు అధికార పార్టీ నాయకులే చేశారు. ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకపోగా నిర్మించిన చెక్‌డ్యాంల వలన చుక్క నీరు నిలిచే పరిస్థితులు లేవు. ఈ రెండు మండలాల పరిధిలోనే చెక్‌డ్యాంల పేరుతో 10 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. కేటాయించిన నిధుల నుంచి 20 శాతం కూడా ఖర్చు చేయకపోవడం దారుణం. పిచ్చిమొక్కలను తొలగించుకుంటూ జేసీబీలతో గీతలు పెట్టి డబ్బులు దోచుకున్నారు.

– సూరం వెంకటసుబ్బారెడ్డి, నల్లగుట్టపల్లె, రామాపురం మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement