సాక్షి, అమరావతి: మూడు మీటర్ల లోతు, 85.5 మీటర్ల వెడల్పుతో తవ్విన కాలువలో 2.5 మీటర్ల ఎత్తున పూడిక పేరుకుపోయిందంటే నమ్ముతారా? ఇది వినడానికే హాస్యాస్పదంగా ఉంది కదా? కానీ.. ఇది వాస్తవమని పోలవరం కాంట్రాక్టర్ చెప్పారు. పూడిక తీయడానికి రూ.1.49 కోట్లను ఖర్చు చేశామని చూపారు. కాంట్రాక్టర్ అడిగిందే తడవుగా అధికారులు బిల్లులు చెల్లించేశారు. ఈ అక్రమాలకు పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ వేదికైంది. అప్పటి ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడికి.. లేని పూడికను ఉన్నట్లు చూపి, దాన్ని తీశారనే సాకు చూపి ప్రజాధనాన్ని దోచిపెట్టడంపై అధికారవర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం ఎడమ కాలువలో నవంబర్ 30, 2016 నాటికి రూ.110.11 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. కానీ ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.142.88 కోట్లకు పెంచేసి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌కు నామినేషన్ పద్ధతిలో టీడీపీ సర్కార్ అప్పగించింది.
ఈ పనులు చేయడానికి రంగంలోకి దిగిన సుధాకర్ నవంబర్ 30, 2016 నాటికి తవ్విన కాలువలో పూడిక పేరుకుపోయిందని.. అందులో పూడిక తీయడానికి వీలుగా వర్షపు నీటిని తోడామని, పూడిక తీశామని.. వాటికి రూ.1.49 కోట్లు ఖర్చయిందని, ఆ బిల్లులు చెల్లించాలని అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌సీ)కి సర్కార్ పంపింది. మూడు మీటర్ల లోతున్న కాలువలో 2.5 మీటర్ల ఎత్తున పూడిక పేరుకుపోయిందని చూపడంపై విస్మయం వ్యక్తం చేసిన ఎస్‌ఎల్‌ఎస్‌సీ బిల్లులు చెల్లించడానికి తిరస్కరించింది.
కానీ ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు పుట్టా సుధాకర్ సంస్థకు రూ.1.49 కోట్లను చెల్లించేశారు. అంతటితో ఆగని టీడీపీ ప్రభుత్వం పనుల అంచనా వ్యయాన్ని భారీ ఎత్తున పెంచాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చింది. ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు అంచనా వ్యయాన్ని రూ.669.40 కోట్లకు పెంచేస్తూ జనవరి 10న సర్కార్‌కు ప్రతిపాదనలు పంపారు. అంటే.. పుట్టా సుధాకర్ యాదవ్‌కు ఖజానా నుంచి రూ.559.29 కోట్లను దోచిపెట్టడానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు వెల్లడవుతోంది.
పూడిక పేరుతో దోపిడీ
Published Mon, Jul 1 2019 3:53 AM | Last Updated on Mon, Jul 1 2019 3:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment