టీడీపీలో ‘గల్లా’ ముసలం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు భారీ ప్యాకేజీలతో కొత్తవారిని పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహానికి సొంత పార్టీ సీనియర్లే చెక్ పెడుతున్నారు. ఇన్నేళ్లుగా సేవ చేస్తున్న తమనొదిలి ఆర్థికంగా బలంగా ఉన్నారన్న కారణంతో కొత్తవారికి ఎన్నికల్లో అవకాశం కల్పించడాన్ని వారు జీర్ణించుకోలేపోతున్నారు. ఆ విషయంలో అధినేతకు ఎదురు చెప్పేందుకు వారు వెనకాడటం లేదు. మాజీ మంత్రి, చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు గల్లా అరుణకుమారితో పాటు ఆమె కుమారుడు జయదేవ్, ఆయన బంధువులను పార్టీలో చేర్చుకునే ఉద్దేశంతో.. జయదేవ్‌కు గుంటూరు లోక్‌సభ, గల్లా అరుణకు చంద్రగిరి అసెంబ్లీ, జయదేవ్ మామ ఆది శేషగిరిరావుకు తెనాలి అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారన్న సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
తెనాలి నుంచి ఆది శేషగిరిరావుకు టికెట్ ఇవ్వాలన్న నిర్ణయం అయిపోయినందున, గుంటూరు (పశ్చిమ) లేదా మంగళగిరి నుంచి పోటీ చేయాలని గతంలో తెనాలి నుంచి పోటీచేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఒప్పించే ప్రయత్నం జరిగింది. ఈ మేరకు జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ గరికపాటి మోహన్‌రావు ఆలపాటితో చర్చలు జరిపారు. తాజా పరిణామంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆలపాటి.. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ఇప్పటికే 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తే తనదారి తాను చూసుకుంటానని స్పష్టంగా చెప్పడంతో గరికపాటి వెనుదిరిగినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.
జయదేవ్‌కు పోటీగా చంద్రశేఖర్
అలాగే, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి జిల్లాకు కొత్తవాడైన జయదేవ్‌ను నిలపాలనుకోవడంతో ఆయనకు పోటీగా ఆర్థికంగా బలమైన, తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు పెమ్మసాని చంద్రశేఖర్ పేరును జిల్లాకు చెందిన కోడెల శివప్రసాద్, ఆలపాటి రాజాలతో పాటు మరికొందరు నేతలు తెరపైకి తెచ్చారు. చంద్రశేఖర్ పార్టీకి రూ. 50 లక్షల విరాళం కూడా ఇచ్చారని, చంద్రశేఖర్‌కు గుంటూరు వీలుకాని పక్షంలో నర్సరావుపేట లోక్‌సభ టికెట్ ఇవ్వాలని వారు చంద్రబాబును కోరారు. ఈ ప్రతిపాదనపై సూటిగా చెప్పకుండా చంద్రబాబు చూద్దాం అని మాత్రమే చెప్పి పంపినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. జయదేవ్ పార్టీలోకి రావడాన్ని కోడెల వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, జిల్లాలోని ఆయన వ్యతిరేక వర్గం ఆహ్వానిస్తోంది. కాగా, తెనాలి, బుర్రిపాలెం మధ్య ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఒక భవనాన్ని కూడా జయదేవ్ నిర్మిస్తుండటం గమనార్హం.