
ఇదేనా రాజకీయం
ఎన్నికల నిర్వహణలో తెలుగుదేశం పార్టీది అందెవేసిన చేయి. పార్టీ ఆవిర్భావం నుంచి నోట్లతో ఓట్లు కొనుగోలు చేయడం...
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను ప్రలోభపరిచే యత్నంలో డబ్బుతో సహా ఏసీబీకి దొరికిపోవడం సంచలనం కలిగించింది. ఓటుకు నోటు చందంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ విధానాలపై విపక్షాలుతీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఈ కేసులోని సూత్రధారి చంద్రబాబునూ అరెస్టు చేయాలని, సీఎం పదవికి బాబు రాజీనామా చేయాలని విపక్షాల నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యగా ఖండిస్తున్నారు. ఇదేనా రాజకీయమని ప్రశ్నిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎన్నికల నిర్వహణలో తెలుగుదేశం పార్టీది అందెవేసిన చేయి. పార్టీ ఆవిర్భావం నుంచి నోట్లతో ఓట్లు కొనుగోలు చేయడం అలవాటుగా చేసుకున్న ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే పంథాను అనుసరిస్తోంది. ఇటీవల జరిగిన కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో ఉపాధ్యాయుడికి రూ.5వేలు, ఉపాధ్యాయ సంఘాల నేతలకు బహుమతులు అందజేసి ఓటమి గండం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ కోసం పనిచేసిన నేతలను కాదని, కోట్లు ఖర్చు చేయగల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది.
నోటుతో ఏదైనా సాధ్యం అనే రీతిలో ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అక్కడి ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను ప్రలోభపరిచేయత్నంలో ఆదివా రం డబ్బుతో సహా ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన విషయం అందరికి తెలిసిందే. ‘మా ఎమ్మెల్యేలను పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని ఆక్రోశం వెళ్లగక్కినచంద్రబాబు అదే విధానాన్ని అమలు చేస్తూ తన నైజాన్ని బయటపెట్టుకున్నారు.
బాబు దిగజారుడుతనానికి ఇంతకంటే మరో ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదని రాజకీయ పక్షాలు పేర్కొంటున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ డబ్బుతోనే అభ్యర్థులను గెలిపించుకుంది. ఓట్ల కొనుగోలుకు అవసరమైన డబ్బును విజయవాడలోని సిద్ధార్థ అకాడమీలో నిల్వచేసి సీమాంధ్రలోని అన్ని నియోజకవర్గాలకు టీడీపీ సరఫరా చేసింది. పోలీసుల దాడిలో రూ.3 కోట్ల వరకు దొరికింది. ఈ సంఘటన తరువాత జరిగిన కృష్ణా,గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికను కూడా డబ్బుతోనే నడిపింది. పార్టీతో సంబంధం లేని వ్యక్తిని ఎన్నికల బరిలోకి దింపి ఒక్కో ఓటును రూ.5 వేలకు కొనుగోలు చేశారు.
ఒక దశలో అభ్యర్థి గెలిచే అవకాశాలు కనపడకపోవడంతో టీడీపీ నేతలు అభ్యర్థి ఆస్తుల్ని కుదువ పెట్టుకుని అప్పు ఇచ్చారు. ఆ మొత్తంతో పెద్ద సంఖ్యలో ఓట్లు కొనుగోలు చేసి ఓటమి గండం నుంచి బయటపడింది. రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలోనూ డబ్బున్న అభ్యర్థినే ఎంపిక చేసే పనిలో పార్టీ ఉంది. మిగిలిన జిల్లాల్లో స్థానిక అభ్యర్థులను ఎంపిక చేసిన అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లాలో అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ కూడా రూ.5 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టగలిగిన నేతను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
డబ్బుతోనే అన్ని పనులు చేయవచ్చనే ఆలోచనలో ఉన్న టీడీపీ అధినేత తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు అక్కడ బలం లేకపోయినా, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను రూ.5 కోట్లకు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఈ విధానాలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఈ కేసులోని సూత్రధారి చంద్రబాబును, పాత్రధారి రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయాలని విపక్షాల నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్
నరసరావుపేట వెస్ట్: తెలంగాణ లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను రూ.50లక్షలు ఇచ్చి కొనబోతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి చిక్కిన కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా అనర్హత వేటువేసి, తెలుగుదేశంపార్టీ ఇందుకు పూర్తి బాధ్యత వహించాలని కోరారు.
దీనిపై చంద్రబాబును దోషిగా నిర్థారిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. మహానాడులో తాను రాజకీయాల్లో పునీతుడినని చెప్పుకున్న చంద్రబాబు నాలుగైదు రోజుల వ్యవధిలోనే ఒక ఎమ్మెల్యేను డబ్బుతో కొనబోతూ ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుబడడం ఆ పార్టీ నిజస్వరూపాన్ని గుర్తుచేస్తోందన్నారు.
చంద్రబాబు రాజీనామా చేయాలి
రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి కళంకం. అతడిని శాసనసభ్యుని పదవికి అనర్హుడుగా ప్రకటించాలి. సొంతపార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డే స్వయంగా బాస్ చంద్రబాబునాయుడు దగ్గరకి తీసుకెళ్తానని చెప్పిన విషయం అందరికీ తెల్సిందే. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేసి విచారణకు సిద్ధం కావాలి.
- షేక్ మస్తాన్‌వలి, కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు
ఎవరికైనా చట్టం ఒకటే
అవినీతికి పా ల్పడితే చట్టం ఎవరికైనా ఒకటే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పూర్తి రికార్డు పరంగా అవినీతికి పాల్పడినట్లు స్పష్టం అవుతోంది. రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయటం సరైన చర్యే. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని చూసే వారిపై కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది.
- పాశం రామారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి