ఇదేం మోడల్ స్కూల్ భవనం | is this model school bhavan | Sakshi
Sakshi News home page

ఇదేం మోడల్ స్కూల్ భవనం

Published Wed, Oct 2 2013 2:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

is this model school bhavan

 సదాశివనగర్,న్యూస్‌లైన్ :
 మండల కేంద్రంతో పాటు, మర్కల్ మల్లన్నగుట్ట వద్ద గల తాగునీటి పథకం పనులు, రామారెడ్డి గ్రామంలో గల మోడల్ కాలనీ పనుల తీరును మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పరిశీలించారు. మం డల కేంద్రంలో గల మోడల్ స్కూల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రతి తరగతి గదిని తనిఖీ చేశారు. నాణ్యత లేని ఇసుక, ఇటుకలను వాడుతుండడంతో కాంట్రాక్టర్ వెంకట్రాంరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడల్‌గా ఉండాల్సిన భవనాన్ని ఇలా నిర్మిస్తే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లు ఇప్పుడే దుర్గంధంగా మారితే భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందన్నారు. అక్టోబర్ ఒకటి వరకు పూర్తి చేయాల్సిన పనులు ఇంకా నత్తనడకనే సాగిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
  నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ హౌస్‌ను పరిశీలించారు. నత్తనడకన పనులు సాగుతుండడంతో కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సబ్సిడీకి సంబంధించిన అనుమతి పత్రాలను అందివ్వడంలేదని సదాశివనగర్ రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం మండలంలోని మర్కల్ మల్లన్నగుట్ట వద్ద గల తాగునీటి పథకాన్ని పరిశీలించారు.  రామారెడ్డిలో గల మోడల్ కాలనీలో నిర్మిస్తున్న గృహాలను పరిశీలించారు. గృహాలు నిర్మించుకోని వారికి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
 
 నెలాఖరులోగా కస్తూర్బా పనులు పూర్తిచేయాలి
 కామారెడ్డి రూరల్ : ఈనెలాఖారులోగా కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డి మండలం టేక్రియాల్ గ్రామంలో నిర్మిస్తున్న కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.  నాణ్యత లోపించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కోటి రూపాయల పనులు దాటిన కాంట్రాక్టర్ తప్పనిసరిగా క్వాలిటీ కంట్రోల్‌కు సంబంధించి ల్యాబ్ ఏర్పాటు చేసుకుని మెటీరియల్ నాణ్యతగా ఉన్నాయా లేదా నిర్ధారించుకున్న తర్వాతే పనులు చేపట్టాలని సూచించారు.
 
  అక్టోబర్ నెలఖారులోగా మొదటి అంతస్తు పూర్తి చేయాలని క్వాలిటీ కాంట్రోల్ డిప్యూటీ డీఈ సంగమేశ్వర్‌ను ఆదేశించారు. పై అంతస్తు కూడా నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. అనంతరం భవన నిర్మాణ పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు కాంట్రాక్లర్లకు కొమ్ముకాస్తున్నారా అంటూ ప్రశ్నించారు. పనులు త్వరగా చేపట్టేలా చూడాలన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు జరగడంతో పరీక్షా పత్రాన్ని పరిశీలించారు. విద్యార్థులను పరీక్ష పేపర్ ఎలా ఉందని అడిగితే వారు ఈజీగా ఉందన్నారు. అనంతరం పరీక్షలు విద్యార్థుల స్థాయికి తగ్గట్లుగా నిర్వహించాలని డీఈఓ శ్రీనివాసాచారికి సూచించారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement