సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తిని తీర్చే కీలకతాగునీటి పథకాలు, మురుగు మాస్టర్ ప్లాన్ పనులకు నిధుల లేమి శాపంగా పరిణమిస్తోంది. శామీర్‌పేట్ సమీపంలోని కేశవాపూర్ భారీ స్టోరేజీ రిజర్వాయర్‌ను హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపడుతున్నప్పటికీ.. భూసేకరణ, రావాటర్ పైప్‌లైన్ల ఏర్పాటు, నీటిశుద్ధి కేంద్రాల నిర్మాణానికి అవసరమైన రూ.1000 కోట్ల నిధులను మాత్రం విడుదల చేయలేదు. అసలు ఇవి వస్తాయా.. లేదా..? అన్నదానిపై సందేహంగా మారింది. ఇక విశ్వనగరం బాటలో దూసుకుపోతున్న మహానగర దాహార్తిని తీర్చే కీలక తాగునీటిమురుగు అవస్థలు తీర్చే సీవరేజీ మాస్టర్ ప్లాన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తుందన్న ఆశలు క్రమంగా అడియాశలు అవుతున్నాయి. ప్రధానంగా భాగ్య నగరంలో కృష్ణా, గోదావరి జలాలతో రోజూ నీళ్లందించే పథకం మొదలు.. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ జలహారం ఏర్పాటు, పాతనగరంలో తాగునీటి సరఫరా నెట్‌వర్క్ విస్తరణ, రిజర్వాయర్ల నిర్మాణం వంటి పథకాలకు సుమారు రూ.5,800 కోట్ల మేర నిధులు కేటాయించాలని కోరుతూ వాటర్ బోర్డు రాష్ట్ర ఆర్థికశాఖకు ప్రతిపాదనలు సమర్పించి నెలలు గడుస్తున్నా అటునుంచి మాత్రం సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం.
కాగితాల్లో రూ.కోట్ల పథకాలు
రోజూ నీళ్లు: గ్రేటర్ పరిధిలోని మొత్తం 9.85 లక్షల నల్లాలకు నిత్యం 460 మిలియన్ గ్యాలన్ల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. త్వరలో నగర శివార్లలో కేశవాపూర్ తాగునీటి పథకం చేపట్టడంతో పాటు, పాతనగరం, ప్రధాన నగరం, శివార్లలో సరఫరా వ్యవస్థను విస్తరించి, నూతన రిజర్వాయర్లను నిర్మించడం ద్వారా అన్ని నల్లాలకు రోజూ నీళ్లందిచే అవకాశాలుంటాయి. ఇందుకు సుమారు రూ.1000 కోట్ల నిధులు అవసరం.
కేశవాపూర్ రిజర్వాయర్: శామీర్‌పేట్ సమీపంలోని కేశవాపూర్‌లో 10 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో భారీ స్టోరేజీ రిజర్వాయర్‌ను నిర్మించేందుకు రూ.4700 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. ముందుగా బొమ్మరాస్‌పేట్ నీటిశుద్ధి కేంద్రం నిర్మాణానికి అవసరమైన దేవాదాయ భూముల సేకరణకు, కొండపోచమ్మ సాగర్ నుంచి కేశవాపూర్‌కు రావాటర్ పైపులైన్ల ఏర్పాటుకు, బొమ్మరాస్‌పేట్ నుంచి గోదావరి రింగ్‌మెయిన్ వరకు శుద్ధిచేసిన నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన భారీ పైపులైన్ల ఏర్పాటుకు సుమారు రూ.1000 కోట్లు అవసరమవుతాయి.
సీవరేజీ మాస్టర్‌ప్లాన్: ఔటర్ రింగ్‌రోడ్డు పరిధి వరకు నిత్యం గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడుతున్న 1500 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు 55 ప్రాంతాల్లో వికేంద్రీకృత శుద్ధి కేంద్రాలు, మురుగునీటి పారుదల పైప్‌లైన్ల ఏర్పాటుకు సుమారు రూ.2 వేల కోట్లు కేటాయించాల్సి ఉంది.
రుణ వాయిదాల చెల్లింపునకు: కృష్ణా రెండు, మూడు దశలతో పాటు గోదావరి తాగునీటి పథకం, హడ్కో నుంచి గతంలో సేకరించిన రుణ వాయిదాలు, వడ్డీ చెల్లింపునకు రూ.800 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.
ఓఆర్‌ఆర్ చుట్టూ జలహారం: ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ 158 కి.మీ మార్గంలో భారీ రింగ్ మెయిన్ పైపులైన్ల ఏర్పాటు ద్వారా జలహారం ఏర్పాటు చేసే పథకానికి సుమారు రూ.2 వేల కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఈ పథకం పూర్తయితే మహానగర వ్యాప్తంగా ఒక చివరి నుంచి మరో చివరకు కొరత లేకుండా నిరంతరాయంగా కృష్ణా, గోదావరి జలాలను సరఫరా చేయవచ్చు. ఈ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1000 కోట్లు నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment