
నిర్వాసితులపై ఉక్కుపాదం
ఐటీఐ నియామకాలకు డిప్లమో అర్హత
ఉక్కులో తాజా నోటిఫికేషన్ విడుదల
భగ్గుమన్న కార్మిక సంఘాలు
ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో నిర్వాసితుల ఉపాధికి గండి కొడుతూ యాజమాన్యం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఉపాధిలేక ఆందోళన బాటలో ఉన్న నిర్వాసితులకు ఈ పరిణామం పుండు మీద కారం చల్లినట్టయింది. యాజమాన్యం ఏకపక్షంగా జారీ చేసిన నోటిఫికేషన్‌పై ఉక్కు కార్మిక సంఘాలు, నిర్వాసిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్ కోసం నిర్వాసితుల నుంచి సేకరించిన వేలాది ఎకరాల భూమి నిమిత్తం అందరికి ఉపాధి కల్పిస్తామని నాటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో కేవలం ఆరు వేల మందికి ఉపాధి లభించింది. మిగిలిన వారు ఐటీఐ చేసి ఉపాధి కోసం అప్పటి నుంచి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అనంతరం ప్రారంభమైన విస్తరణ పనుల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవ వల్ల నిర్వాసితులకు 50 శాతం ఉపాధి కల్పించేందుకు అంగీకరించారు. ఆ నియామకాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆది అమలు కావడంతో కొంత మందికి ఉపాధి లభించగా మిగిలిన వారు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ పరిస్దితుల్లో యాజమాన్యం ఇచ్చిన నోటిఫికేషన్ పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ అంశంపై సిటు, ఇంటక్, ఎఐటియుసి, వైఎస్సార్‌టియుసి, హెచ్‌ఎంఎస్ కార్మిక సంఘాలు నోటిఫికేషన్‌ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్‌లో ఐటిఐ వారికి అర్హత కల్పించకుండా కేవలం డిప్లొమో వారిని అనుమతించనున్నారు. దీనివల్ల ఐటిఐ చేసిన వందలాది మంది నిర్వాసితులు నష్టపోతారన్నారు. ఉక్కు యాజమాన్యం ఏకపక్షంగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని స్టీల్ ఇంటక్ నాయకులు మంత్రి రాజశేఖర్, నీరుకొండ రామచంద్రరావు డిమాండ్ చేసారు. కార్మిక సంఘాలతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. దీనివల్ల నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందని, అలా చేస్తే ఇంటక్ సహించబోదన్నారు.
నిర్వాసితులు, ఐటిఐ చదివిన వారికి అన్యాయం చేసే విధంగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను యాజమాన్యం వెంటనే ఉపసంహరించాలని స్టీల్ వైఎస్సార్‌టియుసి ప్రధానకార్యదర్శి వై. మస్తానప్ప డిమాండ్ చేసారు. యాజమాన్యం ఏకపక్షంగా నోటిఫికేషన్ జారీ చేసిందని స్టీల్ ఎఐటియుసి ప్రధానకార్యదర్శి డి. ఆదినారాయణ అన్నారు. నిర్వాసితుల్లో వందలాది మంది ఐటిఐ అర్హత కలిగి ఉండగా డిప్లమో అర్హత పెట్టడమేమిటని ప్రశ్నించారు. నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని స్టీల్ హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి జి.గణపతిరెడ్డి హెచ్చరించారు.