శేషాచలం అడవుల్లో ఎర్రకూలీల ఎన్‌కౌంటర్ వ్యవహారం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
- రాయచోటిలో ఎర్రకూలీల పట్టివేత ఘటనపై అనుమానాలు
సాక్షి, ప్రతినిధి తిరుపతి : శేషాచలం అడవుల్లో ఎర్రకూలీల ఎన్‌కౌంటర్ వ్యవహారం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. శేషాచలం ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి *5 లక్షల పరిహారంతో పాటు, కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) శుక్రవారం ఆదేశించడం కలకలం రేపింది. ఈ ఘటనలో వైపల్యాలను కప్పి పుచ్చుకోవడానికి పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి సమీపంలో శుక్రవారం ఏకంగా 72 మంది కూలీలను అరెస్ట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
తమిళనాడు నుంచి ఒక ప్రైవేట్ టూరిస్టు బస్సులో వచ్చిన ఎర్ర కూలీలు అటవీ ప్రాంతానికి వెళుతుండగా చిన్నమండెం వద్ద పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇంతవరకు భాగానే ఉన్నా అక్కడ 77 దుంగలను స్వాధీనం చేసుకోవడం పైనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కేసు బలంగా ఉండాలనే కారణంతో పాతదుంగలను తెచ్చి ఇక్కడ చూపించినట్లు విశ్వసనీయ సమాచారం. అడవుల్లోకి చెట్లను నరకడానికి వెళ్లిన వారు డంప్‌ను గురించి సమాచారం ఇచ్చారనడం ఎంతవరకు వాస్తవమనేది చర్చనీయమైంది. ఈ విషయంపై అక్కడ మీడియా ప్రతినిధులు పోలీసులను ప్రశ్నించగా పట్టుబడిన ఎర్ర కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు దుంగలు స్వాధీనం చేసుకున్నామని చెప్పడం గమనర్హం. దీనినిబట్టే జరిగిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ తప్పుపట్టడంతో...
శేషాచలం ఘటనను ఎన్‌హెచ్‌ఆర్‌సీ తప్పు పట్టడంతో ఎర్రకూలీల రాక ఇంకా పెద్దఎత్తున సాగుతుందని చెప్పే ప్రయత్నమే ఇది అని తెలుస్తోంది. వాస్తవంగా శేషాచలం ఘటన తరువాత అత్యధిక మంది ఎర్రకూలీలు తీవ్రంగా భయపడిపోయి ఈ ఛాయలకు రావడం లేదని సమాచారం. మరోవైపు వైఎస్‌ఆర్ జిల్లాలో స్మగ్లర్ల కోసం ముమ్మరంగా వేట సాగిస్తున్నారు. ఈ తరుణంలో ఇంత పెద్ద ఎత్తున కూలీలు తరలి వెళ్ళారా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వివిధ కేసుల్లో పట్టుబడిన కూలీలనే మళ్లీ తాజాగా ఆరెస్టు చూపినట్టు జోరుగా చర్చసాగుతోంది.