సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శాసనమండలి సభ్యుడు వాకాటి నారాయణరెడ్డి, ఆయన అనుచరుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. నెల్లూరు, సూళ్లూరుపేట, తడ మండలం చేనిగుంటల్లో అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. నెల్లూరులోని దర్గామిట్ట, చేనిగుంటలో ఎమ్మెల్సీ సొంత ఇళ్లతో పాటు సూళ్లూరుపేటలోని ఆయన అనుచరులు కళత్తూరు కిరణ్‌కుమార్‌రెడ్డి, దేవారెడ్డి సుధాకర్‌రెడ్డి ఇళ్లలోనూ సోదాలు చేశారు.
జిల్లా కాంగ్రెస్‌లో ఆనం సోదరుల తర్వాత స్థానాన్ని ఆక్రమించిన వాకాటి నారాయణరెడ్డి నివాసాలపై ఏకకాలంలో జరిగిన ఐటీ దాడులు కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతుండగా ఇటీవలి పరిణామాలతో సీమాంధ్రలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో అంతోఇంతో పలుకుబడి కలిగిన నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు ఈ తరహా ఎత్తుగడలు అమలు చేసి ఉంటుందనే అనుమానాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలోనే దేశవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకుని వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్న వాకాటిపై ఐటీ గురిపెట్టడం వెనక అధికార పార్టీలో రాజకీయ ప్రయోజనాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్సీ వాకాటి ఇళ్లపై ఐటీ దాడులు
Published Thu, Oct 24 2013 12:41 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement