సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోలకు రెండు నెలల వేతనం అడ్వాన్స్‌కు సంబంధించిన ఫైలును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదంకోసం ఆర్థిక శాఖ పంపించింది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఏపీఎన్జీవోలు సీమాంధ్ర జిల్లాల్లో 66 రోజులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. సమ్మె ఉపసంహరణ సందర్భంగా ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో ఎన్ని నెలలు వేతనం అడ్వాన్స్ కావాలనే అంశాన్ని ఏపీఎన్జీవోలు పేర్కొనలేదు. తరువాత ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు విడిగా 2 నెలల వేతనం అడ్వాన్స్‌గా ఇవ్వాలని ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ అధికారులు బుధవారం ఏపీఎన్జీవోలకు వేతనం అడ్వాన్స్‌కు సంబంధించిన ఫైలును ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డికి పంపించారు. సంబంధిత ఫైలులో ఎన్ని నెలలు అడ్వాన్స్ ఇవ్వాలనే విషయాన్ని ప్రతిపాదించకుండా మంత్రికి పంపారు. సమ్మె ఉపసంహరణ ఒప్పందంలో రెండు నెలల వేతనం అడ్వాన్స్ కోరనందున మంత్రి ఆనం సంబంధిత ఫైలును సీఎం నిర్ణయం కోసం పంపించారు. ఇప్పుడు సీఎం తీసుకునే నిర్ణయంపై ఏపీఎన్జీవోలకు రెండు నెలలు అడ్వాన్స్ ఇవ్వాలా లేక నెల అడ్వాన్స్ ఇవ్వాలా అనేది ఆధారపడి ఉంటుందని అధికారులు తెలిపారు. గురువారం సీఎం నిర్ణయం తీసుకుంటే వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు.
మధ్యంతర భృతి ఫైలును పీఆర్సీకి పంపించాం: మంత్రి ఆనం
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతికి సంబంధించిన ఫైలును పదో వేతన సవరణ సంఘానికి పంపించినట్లు ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర జిల్లాల్లోను, సచివాలయంలోను ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో పీఆర్సీ నివేదిక విషయంలో జాప్యం జరిగిందన్నారు. అయితే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మధ్యంతర భృతి కావాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో సంబంధిత ఫైలును పీఆర్సీకి పంపించామని, అక్కడినుంచి వచ్చాక సీఎం స్థాయిలో ఎంత శాతం మధ్యంతర భృతి ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సీఎంకు రెండు నెలల వేతనం అడ్వాన్స్ ఫైలు
Published Thu, Oct 24 2013 1:48 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement