జిల్లాలో ఐటీ పార్కు | IT Park in Eluru District | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఐటీ పార్కు

Published Mon, Sep 29 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

జిల్లాలో ఐటీ పార్కు

జిల్లాలో ఐటీ పార్కు

సాక్షి, ఏలూరు : ప్రతి జిల్లాలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యో చిస్తోందని రాష్ర్ట సమాచార, పౌరసంబంధాలు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. కలెక్టరేట్‌లో జిల్లా ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఐటీ పార్క్ ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను ఆదేశించారు. ప్రతి శాఖకు వీడియో కాన్ఫెరెన్స్ సదుపాయం కల్పిస్తున్నామని, ఉద్యోగులు కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. మీ సేవ ద్వారా ప్రస్తుతం 273 సేవలు అందిస్తున్నామన్నారు. సమాచార శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని తెలిపారు.
 
 మైనార్జీ సంక్షేమ శాఖ పనితీరుపై అసంతృప్తి
 జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు ఆయా వర్గాలకు చేరవేయడంలో ఆ శాఖ అధికారులు అంకిత భావంతో పనిచేయకపోతే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. జిల్లాలో సుమారు 900 ఎకరాల వక్ఫ్ భూములుండగా 665 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు గుర్తించామన్నారు. ఆక్రమణదారులకు నోటీసులు జారీచేసి, తహసీల్దార్లతో విచారణ చేరుుంచి నెలలో నివేదిక అందజేయాలని ఆదేశించారు.
 
 విదేశాల్లో పనిచేసే జిల్లా వాసుల వివరాల సేకరణ
 వివిధ దేశాల్లో పనిచేసేందుకు జిల్లా నుంచి వెళ్లిన కార్మికుల వివరాలను సేకరించాలని మంత్రి ఆదేశించారు. దళారుల చేతుల్లో మోసపోయిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. కొవ్వలిలో మసీదులకు సంబంధించిన భూములకు లభించే కౌలును ఇతరులు అనుభవిస్తున్నట్టు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కమిటీ వేసి నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు.  
 
 ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం
 ప్రజాప్రతినిధులతో మంత్రి స్థానిక జెడ్పీ అతిథి గృహంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో  కొందరు అధికారులు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవటం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించకూడదని, ప్రజాప్రతినిధుల సిఫార్సులు పరిగణనలోకి తీసుకోకపోతే ఎలా అని మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మంత్రి పీతల సుజాత,  జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు,  శాసన మండలి విప్ అంగర రామ్మోహనరావు, ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయడు, కేఎస్ జవహర్, పితాని సత్యనారాయణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 
 పెన్షన్ల భారం రూ.3 వేల కోట్లు
 పింఛను మొత్తాన్ని వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500కు పెంచటం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.3వేల కోట్ల భారం పడనుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఏలూరులో విలేకరులతో మాట్లాడారు. కోటి మంది రైతులకు ఒక్కో రైతుకు రూ.1.50 లక్షల రుణమాఫీని మూడు దశల్లో అమలు చేస్తామన్నారు. డ్వాక్రా గ్రూఫు మహిళల ఆర్థికాభివృద్ధికి రూ.7,800 కోట్లతో రుణమాఫీతో పాటు ఇసుక రీచ్‌ల నిర్వహణను అప్పగిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ సరఫరాను గాడిన  పెట్టామని, వచ్చే ఏడాది నుంచి కోతలు ఉండవని చెప్పారు.
 
 జర్నలిస్టుల సంక్షేమ నిధి మొత్తం పెంచుతాం
 ప్రస్తుతం రూ.1 కోటి ఉన్న జర్నలిస్టుల సంక్షేమ నిధిని పెంచేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రూ.2.50 లక్షల వరకూ ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం ద్వారా వారు వైద్య సేవలు పొందేందుకు హెల్త్ కార్డులు మం జూరు చేస్తామన్నారు. అర్హులైన పా త్రికేయులకు అక్రిడిటేషన్‌లు, ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పీఆర్వో కార్యాల యం ఏర్పాటు చేయాలని, ఏలూరు డీపీఆర్‌వో కార్యాలయానికి మినీ బస్,  జీప్ సమకూర్చాలని పాత్రికేయులు  మంత్రిని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement