
తిరుపతిలోని పేరం హరిబాబు నివాసం
చిత్తూరు,తిరుపతి రూరల్/పిచ్చాటూరు: టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి.. పేరం గ్రూప్స్ అధినేత పేరం హరిబాబుకు చెందిన ఆస్తులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడం జిల్లాలో కలకలం రేపింది. ఆయన ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లపై మంగళవారం ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు నిర్వహించారు. తిరుపతి, పిచ్చాటూరులోని ఇళ్లు,కార్యాలయాల్లో ముమ్మర తనిఖీలు చేశారు. ఆదాయానికి తగినట్టు పన్నులు చెల్లించకపోవటంతో ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా స్పందన లేకలేకపోవటంతో పూర్తి ఆధారాలతో ఈ దాడులు చేసినట్లు ఓ ఐటీ అధికారి తెలిపారు. తిరుపతిలోని విద్యానగర్‌లోని ఇళ్లు, తిరుపతిలోని కార్యాలయం, బంధువుల ఇళ్లు, పిచ్చాటూరు మండలంలోని ఆయన స్వగ్రామం గోవర్దనగిరిలో సైతం ఈ దాడులు జరిగాయి. హరిబాబుపై దాడుల నేపథ్యంలో తిరుపతి, పిచ్చాటూరులో ధనిక వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
ప్రమోటర్ నుంచి కోట్లకు....
గోవర్దనగిరికి చెందిన పేరం హరిబాబు గతంలో జనచైతన్య రియల్ ఎస్టేట్ సంస్థలో ప్రమోటర్‌గా చేరారు. తర్వాత పేరం గ్రూప్ ద్వారా సొంతగా రియల్ ఎస్టేట్‌ను ప్రారంభిం చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అండతో తన వ్యాపారాలను విస్తరించాడు. చంద్రగిరి నియోజకవర్గంలో తెరచాటు రాజకీయాలను చేశాడు. ఓ గ్రూపును నడిపించాడు. రాజకీయ, వ్యాపార ప్రముఖులతో వియ్యం పొంది, తన వ్యాపారాలను విస్తరించి వ్యక్తిగతంగా బలోపేతం అయ్యారు. కోట్లకు పడగలెత్తాడు. తిరుపతి నుంచి బెంగళూరు, హైదరాబాబు, విశాఖపట్నంలో సైతం లేఅవుట్‌లు వేశాడు. ఆదాయానికి తగినట్లు ప్రభుత్వానికి పన్నులు చెల్లించలేదని, నోటీసులు ఇచ్చినా స్పందన లేదని అందుకే దాడులు చేస్తున్న ట్లు ఐటీ అధికారులు పేర్కొంటున్నారు.
చంద్రగిరి టిక్కెట్టు ఆశించి..
పేరం హరిబాబు గతంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవారు. 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ముందు చంద్రబాబు ఉపయోగించిన కాన్వాయ్ కారులో హరిబాబు తండ్రి రామకష్ణమనాయుడు రూ.7 కోట్లను తరలిస్తూ ఐటీ అధికారులకు పట్టుపడ్డారు. లెక్కలు సక్రమంగా లేకపోవడంతో హరిబాబు తండ్రిపై కేసు సైతం నమోదు అయింది. నాడు చంద్రబాబు బినామి హరిబాబు అనే ప్రచారం విస్తతంగా జరిగింది. చంద్రబాబు సన్నిహితంతో టీడీపీ తరుపున 2014లో చంద్రగిరి టిక్కెట్టు ఆశించారు. చివరి నిమిషంలో గల్లా అరుణకుమారికి టిక్కెట్టు దక్కటంతో నిరాశ చెందాడు.
భారీగా ఆస్తులు,డాక్యుమెంట్లు గుర్తింపు..
పేరం హరిబాబు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడుల నేపథ్యంలో ఐటీ అధికారులు భారీగా ఆస్తులు, కోట్ల విలువైన డాక్యుమెంట్లను స్వాధీ నం చేసుకున్నట్లు సమాచారం. కోట్ల విలువైన బం గారం, నగలను సైతం గుర్తించారు. ఆదాయంగా చూపని ఆస్తులను భారీగానే పట్టుపడినట్లు ఓ అధికారి వెల్లడించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ దాడులు జరిగాయి. బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment