ఆంధ్రా అనకొండ | Income Tax Raid Found Only Small Part Of Robbery Of Chandrababu and Team | Sakshi
Sakshi News home page

ఆంధ్రా అనకొండ

Published Sat, Feb 15 2020 2:59 AM | Last Updated on Sat, Feb 15 2020 7:54 AM

Income Tax Raid Found Only Small Part Of Robbery Of Chandrababu and Team - Sakshi

సాక్షి, అమరావతి: రెండు దశాబ్దాలపాటు చంద్రబాబుకు పీఎస్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌.. తనయుడు లోకేశ్‌ బినామీలు కిలారు రాజేష్, నరేన్‌ చౌదరి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‌ నివాసాలు, కార్యాలయాలపై ఐటీ శాఖ ఇటీవల జరిపిన దాడుల్లో రూ.2వేల కోట్ల కమీషన్ల బాగోతం వెలుగుచూడడం పెనుసంచలనం సృష్టించింది. వీరంతా చంద్రబాబు కోటరీకి చెందిన వారే కావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. నిజానికి గతేడాదే ముంబై, ఢిల్లీల్లోని షాపూర్‌జీ పల్లోంజీ కాంట్రాక్టు సంస్థ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో లభ్యమైన ఒక కీలక ఆధారంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తీగలాగారు. దీంతో మాజీ సీఎం చంద్రబాబు రూ.రెండు వేల కోట్లకు పైగా కమీషన్ల డొంక కదిలింది.

ఇది ఆంధ్ర అనకొండ చంద్రబాబు అవినీతి దందాలో స్వల్ప భాగమేనని.. రాష్ట్రంలో జూన్‌ 8, 2014 నుంచి మే 29, 2019 మధ్య కాలంలో భారీఎత్తున పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థల కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తే.. కమీషన్ల వసూళ్లలో చంద్రబాబు విశ్వరూపం ఆవిష్కృతమవుతుందనే అభిప్రాయం ఇప్పుడు బలంగా వ్యక్తమవుతోంది. గత ఐదేళ్లలో రూ.1.95 లక్షల కోట్లు అప్పుచేసి.. ఆ మేరకు ఆస్తులు కల్పించకుండా.. కాంట్రాక్టర్లకు దోచిపెట్టి.. వారి నుంచి కమీషన్ల రూపంలో వసూలుచేసిన నల్లధనాన్ని సింగపూర్‌కు.. అక్కడి నుంచి విదేశీ పెట్టుబడుల రూపంలో సన్నిహితుల సంస్థలకు రప్పించి.. బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థల ద్వారా వాటిని మింగేసిన చంద్రబాబు అక్రమాల గుట్టంతా రట్టవుతుందని ట్యాక్సేషన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు చంద్రబాబు అక్రమాలను ఎండగట్టడం.. అదే సమయంలో టీడీపీ సర్కార్‌ దోపిడీ దందాపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలు అక్షరసత్యమన్నది తాజా ఐటీ దాడులతో తేటతెల్లమైంది. 

ఏపీ ముఖ్యనేతకు రూ.150 కోట్లు
2019లో దేశంలో ఆదాయపు పన్ను ఎగ్గొట్టిన, అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించిన పలు కార్పొరేట్‌ సంస్థలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో రూ.3,330 కోట్లకు పైగా నల్లధనం హవాలా రూపంలో తరలించినట్లు గుర్తించారు.. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ముఖ్యనేతకు రూ.150 కోట్లు చేరినట్లు అప్పట్లో ఐటీ శాఖ ప్రకటించింది. అప్పుడు దొరికిన కీలక ఆధారంతో ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కేంద్రంగా పనిచేసే మూడు కాంట్రాక్టు సంస్థల్లో ఐటీ శాఖ సోదాలు జరిపింది. ఇందులో భాగంగానే.. 1999 నుంచి 2019 వరకూ రెండు దశాబ్దాలపాటు చంద్రబాబుకు పీఎస్‌గా పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వోద్యోగి పెండ్యాల శ్రీనివాస్‌ నివాసాల్లోనూ సోదాలు నిర్వహించింది. అక్కడ లభ్యమైన డైరీలు, కీలక పత్రాల ఆధారంగా చంద్రబాబు కమీషన్ల దందా వెలుగుచూసింది. 

ఖజానాను దోచేసి.. సింగపూర్‌కు తరలించి..
హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా రూ.200 కోట్లతో పూర్తయ్యే కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులకు ‘సింగిల్‌’ షెడ్యూలు దాఖలు చేసిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా సంస్థకు రూ.450.85 కోట్లకు చంద్రబాబు కట్టబెట్టారు. అంతేకాదు.. డిజైన్లు మారడంవల్ల పనుల పరిమాణం పెరిగిందని అదనంగా రూ.129 కోట్లను దోచిపెట్టారు. 
– ఇక హంద్రీ–నీవా రెండో దశలో చేయని సొరంగం పనులకు రూ.35 కోట్లు.. వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటర్‌ పనుల్లో చేయని పనులకు రూ.17 కోట్ల, ఇదే రీతిలో పలు ప్రాజెక్టుల్లో దోచిపెట్టారు. 
– అలాగే, లోకేష్‌ సన్నిహితుడు కిలారు రాజేష్‌.. చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌ పేరుతోనూ, లోకేశ్‌ బినామీ నరేన్‌ చౌదరికి చెందిన డీఎన్‌సీ ఇన్‌ఫ్రా తదితర సంస్థలు ఆర్కే ఇన్‌ఫ్రా వద్ద సబ్‌ కాంట్రాక్టు కింద పనులు చేసినట్లు చూపించారు. ఆ సంస్థకు ఖజానా నుంచి దోచిపెట్టిన రూ.వేల కోట్లను బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు సొంతం చేసుకున్న తీరును శ్రీనివాస్‌ డైరీల్లో పేర్కొనడాన్ని ఐటీ శాఖ గుర్తించింది. 
– సాగునీటి ప్రాజెక్టులతోపాటు తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు.. పట్టణ పేదల గృహ నిర్మాణ పనులు దక్కించుకున్న ఒక బడా కాంట్రాక్టు సంస్థ వద్ద మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా ఇన్‌ఫ్రా, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా, కిలారు రాజేష్‌ డైరెక్టర్‌గా ఉన్న చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్‌కు అనుబంధంగా ఉన్న నిర్వాణ హోల్డింగ్స్, నరేన్‌ చౌదరికి చెందిన డీఎన్‌సీ ఇన్‌ఫ్రా సంస్థలు సబ్‌ కాంట్రాక్టు కింద పనులు చేయకున్నా చేసినట్లు చూపి చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్న మొత్తం రూ.రెండు వేల కోట్లకుపైగా ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. 
– ఇలా దోచేసిన సొమ్మును ముంబైకి చెందిన గుర్రాల వ్యాపారి హసన్‌ అలీ ద్వారా హవాలా రూపంలో సింగపూర్‌కు తరలించి.. అక్కడి నుంచి విదేశీ పెట్టుబడుల రూపంలో తనకు సన్నిహితుడైన ఆర్వీఆర్‌ ఇన్‌ఫ్రాలోకి రప్పించి.. ఆ సంస్థ నుంచి తిరిగి బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థలకు మళ్లించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. (చదవండి: మచ్చుకు రూ.2,000 కోట్లు)

ముప్పేట దాడికి ఈడీ, జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ సిద్ధం
కాగా, ఇటీవల నిర్వహించిన దాడుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్రాంగా పనిచేసే భారీ నల్లధనం రాకెట్‌ బయటపడినట్లు.. దీని ద్వారా మనీల్యాండరింగ్‌ జరిగినట్లు ఐటీ శాఖ కమిషనర్‌ సురభి అహ్లూవాలియా గురువారం విడుదల చేసిన ప్రకటనను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. దాడుల్లో వెల్లడైన వివరాలను ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కు అందజేశారు. వాటి ఆధారంగా ఈడీ దర్యాప్తునకు సిద్ధమైంది. ఏ క్షణమైన ఆ సంస్థలపై ఈడీ దాడులు చేసే అవకాశం ఉందని ట్యాక్సేషన్‌ నిపుణులు చెబుతున్నారు. నిజానికి.. సబ్‌ కాంట్రాక్టు కింద బిల్లులు పొందినప్పుడు జీఎస్టీ చెల్లించాలి. కానీ, ఆర్కే ఇన్‌ఫ్రా, నిర్వాణ హోల్డింగ్స్, అవెక్సా ఇన్‌ఫ్రా, డీఎన్‌సీ ఇన్‌ఫ్రాలతోపాటు వందలాది షెల్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థలు జీఎస్టీ ఎగ్గొట్టినట్లు తేలడంతో వాటిపై ఇప్పటికే జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగం కేసులు నమోదు చేసి లోతైన విచారణకు సిద్ధమైంది.

సుజనా, సీఎం రమేష్‌ ఇళ్లలోనూ..
గతేడాది చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన కేంద్రమాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి, మరో ఎంపీ సీఎం రమేష్‌ నివాసాల్లోనూ..వారికి సంబంధించిన సంస్థలలోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా భారీఎత్తున నల్లధనాన్ని గుర్తించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు  పీఏ శ్రీనివాస్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, లోకేష్‌ బినామీలు కిలారు రాజేష్, నరేన్‌ చౌదరి, ప్రత్తిపాటి శరత్‌ కార్యాలయాలపై ఐటీ శాఖ తాజాగా దాడులు జరిపింది. రూ.రెండు వేల కోట్లకుపైగా అక్రమ లావాదేవీలను గుర్తించింది. కానీ, వీరితో చంద్రబాబుకు, టీడీపీకి ఏమాత్రం సంబంధం లేదని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 

లాయర్లు, ఆడిటర్లతో చంద్రబాబు మంతనాలు
ఇదిలా ఉంటే.. తన అవినీతి బాగోతాన్ని రట్టుచేస్తూ గురువారం సాయంత్రం ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌ సురభి అహ్లూవాలియా ప్రకటన విడుదల చేయడంతో చంద్రబాబు వెంటనే ఉన్నపళంగా హైదరాబాద్‌ వెళ్లిపోయారు.  అర్ధరాత్రి దాకా వ్యక్తిగత లాయర్లు, ఆడిటర్లతో మంతనాలు జరిపిన ఆయన శుక్రవారం రాత్రి వరకూ కూడా ఐటీ శాఖ మాజీ ఉద్యోగులు, ఆడిటర్లు, లాయర్లతో భేటీ అయ్యారు. కానీ, ఐటీ దాడులపై ఎలాంటి ప్రకటన విడుదల చేయని చంద్రబాబు.. మీడియాతో మాట్లాడాలంటూ టీడీపీ నేతలకు పురమాయించారు. ఇందులో భాగంగానే యనమల విలేకరులతో మాట్లాడుతూ.. పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్‌కు టీడీపీకి ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. కానీ, కమీషన్ల బాగోతాన్ని శ్రీనివాస్‌ తన డైరీల్లో పేర్కొనడంపై మాత్రం యనమల స్పందించకపోవడం గమనార్హం.

చంద్రబాబు కమీషన్‌ల దందా ఇలా..
– 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే కమీషన్లు ఇవ్వాలని కాంట్రాక్టర్లపై బెదిరింపులకు దిగారు. అలా కుదరని పక్షంలో కాంట్రాక్టు ఒప్పందాల నుంచి వైదొలగాలంటూ ఒత్తిడి తెచ్చారు. దాంతో చేసేది లేక ఒప్పందాలను ఫోర్స్‌ క్లోజర్‌ చేసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి, కుదిరితే నామినేషన్‌ పద్ధతిలో లేదంటే అధికంగా కమీషన్లు ఇచ్చే వారికి పనులు కట్టబెట్టేలా కథ నడిపించారు. ఉదా.. గాలేరు–నగరి తొలి దశలో 29వ ప్యాకేజీ పనులను రూ.171.63 కోట్లకు 2005లో దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 2014 నాటికే రూ.166.69 కోట్ల పనులు పూర్తి చేసింది. కేవలం రూ.4.94 కోట్ల పనులు మాత్రమే మిగిలాయి. ఆ సంస్థపై 60సీ నిబంధన కింద వేటువేసిన చంద్రబాబు.. మిగిలిన పనుల అంచనాను రూ.110.91 కోట్లకు పెంచేసి సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌కు అప్పగించి.. బిల్లులు చెల్లించేశారు. అంటే.. ఒక్క పనిలోనే రూ.106 కోట్ల మేర ప్రజాధనాన్ని దోచుకున్నట్లు స్పష్టమైంది. హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వంశధార తదితర ప్రాజెక్టుల పనుల్లో ఇలాగే చెలరేగిపోయారు.
– ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనపు నిధులు ఇచ్చేందుకు 2014 ఫిబ్రవరిలో అప్పటి సర్కారు జీఓ 13ను జారీచేసింది. ఈ జీఓను తప్పుబట్టిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు.. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ జీఓకు జీఓ–22 ముసుగేసి.. ధరల సర్దుబాటు కింద రూ.వేల కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లు పిండుకున్నారు. అంతటితో ఆగకుండా ఈపీసీ (ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో మౌలిక సూత్రాలకు విరుద్ధంగా పనుల పరిమాణం పెరిగితే ఆ మేరకు అదనపు బిల్లులు చెల్లించేలా జీఓ 63ను జారీచేసి.. కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టారు. జీఓ 22ను ఏప్రిల్, 2014 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులకు కూడా వర్తింపజేసి కమీషన్లు దండుకున్నారు.
– అలాగే, కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలు భుజానికెత్తుకున్న చంద్రబాబు.. ఆ వెంటనే పనుల అంచనా వ్యయాన్ని పెంచేశారు. టీడీపీ మాజీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ను అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత నవయుగకు రూ.3,216 కోట్ల విలువైన పోలవరం హెడ్‌వర్క్స్‌ పనుల అప్పగింతలోనూ ఇదే బాగోతం నడిచింది. 
– నీరు–చెట్టు కింద రూ.16 వేల కోట్లకుపైగా విలువైన పనులను కూడా నామినేషన్‌పై అప్పగించి బిల్లులు చెల్లించారు.  
– చంద్రబాబు అధికారంలోకి వస్తూనే జూలై 23, 2014న పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగతా సాగునీటి ప్రాజెక్టులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తిచేస్తామని ప్రకటించారు. కానీ.. రూ.65 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయారు. వీటిని పరిశీలిస్తే ఒక్క సాగునీటి ప్రాజెక్టుల పనుల్లోనే రూ.30 వేల నుంచి రూ.35 వేల కోట్లను చంద్రబాబు అండ్‌ కో దోచేసినట్లు స్పష్టమవుతోంది. ఇక తాత్కాలిక సచివాలయం, పట్టణ పేదల గృహ నిర్మాణ పనుల్లోనూ వేల కోట్లు కొల్లగొట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement