రాయలసీమకు పట్టిసీమ నీటిని రప్పించడంసులువైంది కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.
బి.కొత్తకోట (చిత్తూరు): రాయలసీమకు పట్టిసీమ నీటిని రప్పించడంసులువైంది కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వం పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు, అక్కడి నుంచి రాయలసీమకు నీటిని మళ్లించాలని అనుకుంటోందన్నారు. ఇది తేలికైన విషయం కాదని అయినప్పటికీ ముఖ్యమంత్రి ఈ పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. రాయలసీమలో దుర్భిక్ష పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ ప్రాంతానికి నీటిని అందించే విషయంలో రాజకీయాలు పక్కనపెట్టి అందరూ సహకరించాలని కోరారు.
ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించినా ప్యాకేజీ పేరుతో ఆందోళనలు చేయడం అర్థరహితమని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 700 వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేదన్నారు. ఒడిశా కంటే ఏపీలోనే అత్యధిక మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని, ఇది సిగ్గుపడాల్సిన విషయమన్నారు.