ఆశ వర్కర్లకు  షరతులు వర్తిస్తాయి! | It's Not Easy To Asha Workers | Sakshi
Sakshi News home page

ఆశ వర్కర్లకు  షరతులు వర్తిస్తాయి!

Published Sat, Dec 1 2018 3:13 PM | Last Updated on Sat, Dec 1 2018 3:16 PM

It's Not Easy To Asha Workers - Sakshi

ఎన్నో పోరాటాలు చేశారు. పోలీసు దెబ్బలు తిన్నారు. అవమానాలు చవిచూశారు. ఏమైతేనేం అనుకున్నది సాధించామని సంతోషించారు. ఇచ్చింది స్వల్పమైనా అనంతానందం పొందారు. కృతజ్ఞతతో సన్మానాలు చేశారు. చిత్రాలకు పాలాభిషేకం చేశారు. ఇంతలోనే వారి ‘ఆశ’లపై నీళ్లు చల్లుతూ కొత్త ఉత్తర్వులు వెలుడ్డాయి. ఇదీ ఆశ వర్కర్లపై సర్కారు అనుసరించిన వైఖరి. ముఖ్యమంత్రి తమ కోర్కెలు తీర్చేశారని సంబరపడితే... కొత్తగా పెట్టిన కండిషన్లతో వారంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు.

బొబ్బిలి: అరవ చాకిరీ చేయించుకుంటూ కూడా ఆశ వర్కర్లకు వేతనం పెంచామని సన్మానాలు, సత్కారాలు, పాలాభిషేకాలు చేయించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు స్వరూపం మరోసారి బహిర్గతమైంది. ఆశ వర్కర్ల వేతనం పెంపు వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని నిరూపించారు. పెంచిన వేతనం రూ.5,600 అందా లంటే ప్రతీ ఆశ వర్కర్‌ నెలకు నలుగురు గర్భిణులను నమోదు చేసి, నాలుగు డెలివరీలు చేయించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. వేతనాల కోసం ఏటా ఎదురు చూస్తున్న ఆశ వర్కర్లకు నెలకు రూ.3 వేలు, పారితోషకంగా మరో మూడు వేలుఇస్తామన్న రాష్ట్ర సర్కారు ఇప్పుడు రూ.5,600ను ప్రకటించింది. ఆ డబ్బులు కూడా లక్ష్యాన్ని సాధిస్తేనే ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు ఆశ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సేవలు వినియోగించుకుని ఇలా లక్ష్యాలను విధించడం అన్యాయమని వారు వాపోతున్నారు.
 
పోరాటంతో దిగొచ్చిన సర్కారు

జిల్లాలో 5,600 మంది ఆశ వర్కర్లున్నారు. వీరిని సబ్‌ సెంటర్ల వారీగా ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. వివిధ సర్వేలు, పల్స్‌పోలియో, చిన్నారులకు టీకాలు వంటి కార్యక్రమాలకు ఇంటింటికీ తిరుగుతూ ఒళ్లు హూనం చేసుకుంటున్నా... వారికి నెలకు ఇచ్చేది మూడు వేలే. ఈ సొమ్మును మరో మూడు వేలు పెంచి ఆరు వేలు చేస్తున్నామని కొద్ది నెలల క్రితం ప్రకటించారు. కానీ దానిని అమలు చేయలేదు. ఇక అందరి మాదిరి వారూ ఆందోళనలకు దిగారు. పోలీసులచేత ఈడ్చివేతలు... అధికారులతో ఛీత్కారాలు తిన్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కాదని, రూ.5,600 ఇస్తామని ప్రకటించారు.
 
తాజాగా పెట్టిన మెలికలు
వెయ్యి జనాభా నుంచి రెండు వేల జనాభా ఉన్న సబ్‌ సెంటర్ల వారీగా లక్ష్యాలు విధించారు. ఒక్కొక్కరూ నలుగురు గర్భిణులను నమోదు చేయాలి, నాలుగు డెలివరీలు చేయించాలి. వీటితో పాటు నలుగురు బిడ్డలకు మీజిల్స్‌ వేయించాలి. మరో నాలుగు బూస్టర్‌ డోసులు వేయించాలి. ఇలా రోజూ వారు గర్భిణుల కోసం,  బాలింతల కోసం వెతకాల్సిందే. ఒక వేళ ఆ ప్రాంతంలో గర్భిణులు లేకపోతే వీరికి వేతనం లేనట్టేనని చెబుతున్నారని ఆశా వర్కర్లు వాపోతున్నారు.

బర్త్‌సర్టిఫికెట్లు అంగన్‌వాడీలకు అప్పగించాలి 
ఆశ వర్కర్లు తాము పనిచేస్తున్నట్టు రుజువు చేసేందుకు సవాలక్ష నిబంధనలు విధించింది ప్రభుత్వం. బిడ్డలు పుట్టినట్టు ఆస్పత్రిలో ఇచ్చే సర్టిఫికెట్లను జత చేయాల్సి ఉంది. అలాగే పుట్టిన బిడ్డ అత్తవారు, కన్నవారింటికి మారినప్పుడు అక్కడి అంగన్‌వాడీ సెంటర్‌కు అప్పగించే బాధ్యత కూడా ఆశ వర్కర్లదే. దీంతో తాము చేసిన పనులు ఏమన్నా తక్కువ చేస్తున్నామా? పనికి తగిన వేతనం ఇస్తున్నారా? మాకెందుకీ లక్ష్యాలని వాపోతున్నారు.
 
వర్కర్లతో విరివిగా సమావేశాలు 

ఆశ వర్కర్లకు వేతనం పెంచినట్టే పెంచి లక్ష్యాలను బారెడు చేసిన ప్రభుత్వం వారి కోసం విడుదల చేసిన లక్ష్యాలు, నిబంధనలపై రిపోర్టులు తీసుకుంటోంది. ఇందుకోసం ఏఎన్‌ఎంల ఆధ్వర్యంలో ఆశ వర్కర్లకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో మీరు చేయాల్సిన పనులివీ అని వారికి వివరిస్తున్నారు. పెరిగిన వేతనం అందుకోవాలంటే ఈ మాత్రం చేయకతప్పదని వారికి సుద్దులు చెబుతున్నారు. దీంతో ఆశ వర్కర్లు మరింత ఆవేదన చెందుతున్నారు.

బర్త్‌ సర్టిఫికేట్లు అప్పగిస్తేనే వేతనమట
మాకు లక్ష్యాలు ఇచ్చి వాటి ప్రకారం గర్భిణులు, బాలింతలను నమోదు చేయాలంటున్నా రు. బిడ్డ పుట్టిన తరువాత వారిని అంగన్‌వాడీలకు అప్పగించాలని ఆదేశించారు. లేకుంటే వేతనం లేదని, కట్‌ అవుతుందని ముందుగానే మాకు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫారంలో అన్ని కాలమ్స్‌ను మాచేత నింపిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. జీతం పెంపు అంటే ఇదేనా?         – ఎల్‌ శాంతి, అధ్యక్షురాలు, ఆశ వర్కర్ల అసోసియేషన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement