నా మీద పెద్ద అభాండం వేశారు: ఐవైఆర్
హైదరాబాద్ : బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించడంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో తన ఫేస్‌బుక్‌లో పోస్టులపై వివరణ ఇచ్చారు. ‘నన్ను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించారని విన్నాను. అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని. తనను ఆ పదవి నుంచి తీసేశారని టీవీలో చూశాను. సీఎం కానీ, ఆయన కార్యాలయం నుంచి కానీ నాకు ఎలాంటి ఫోన్ రాలేదు. వివరణ అడగలేదు, అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని.
కానీ నన్ను రాజీనామా చేయమని అడిగేవారిని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. నాకు ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇంతవరకూ వివరణ అడగలేదు. ముఖ్యమంత్రిని కలవడానికి ఆరు నెలలు నుంచి ప్రయత్నిస్తున్నా. కానీ ఆయన అపాయింట్‌మెంట్ దొరకలేదు. నా ఇగో హర్ట్ అయిందని అధికారులకు చెప్పాను. నేను జవాబుదారీతనంతో పని చేయడంలేదన్న విమర్శలు అవాస్తవం. నా మీద పెద్ద అభాండం వేశారు. నాకు కేబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు. ఇచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా నాకు రెండు లక్షల జీతం అని కూడా ప్రచారం చేస్తున్నారు. నేను జీతం లేకుండా పనిచేస్తున్నా. అయితే కొన్ని సౌకర్యాలు మాత్రమే ఉపయోగించుకుంటున్నాను.
కావాలని నేను అడిగా..
బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి కావాలని నేనే అడిగి తీసుకున్నా. నా విజ్ఞప్తికి ఒప్పుకునే ఆ పదవి ఇచ్చారు. బ్రాహ్మణ కార్పోరేషన్‌లో చాలామంది టీడీపీ వారే సభ్యులుగా ఉన్నారు. ఏ సమాచారం ఉన్నా నేను వారికి చెప్పేవాడిని. బ్రాహ్మణ కార్పొరేషన్ సమావేశం సమాచారం ఇవ్వడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఆ మెసేజ్‌లు పంపించే వ్యక్తులు టీడీపీ కార్యకర్తలే. వాళ్ల నుంచి మెసేజ్‌లు వెళ్లలేదంటే పార్టీలో ఏదో సమస్య ఉన్నట్లే లెక్క. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి రుణాలు వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని చెబుతున్నారు. అలాంటి ఆరోపణలపై నాకు అభ్యంతరాలున్నాయి.
లబ్దిదారుల్లో టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీ ఉండరు. లబ్దిదారుడు...లబ్దిదారుడే. జన్మభూమి కమిటీల ప్రమేయం లేకండా లబ్దిదారులను ఎంపిక చేశాం. లబ్దిదారులకు, పార్టీకి ముడిపెట్టడం సరికాదు. బీజేపీ ప్రచారానికి విశాఖ వెళ్లిన మాట వాస్తవం. విశాఖలో రెండు సత్రాలను బ్రాహ్మణులకు ఇస్తూ దేవాదాయశాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ప్రచారానికి రమ్మని బీజేపీ మంత్రి అడిగారు. నేను వెళ్లాను. సత్రం క్రెడిట్ సీఎం చంద్రబాబుకే ఇచ్చా. ఇప్పటివరకూ ప్రచారం గురించి ప్రశ్నించని వ్యక్తలు...ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారో అర్థం కావడం లేదు.
నాకు ఆ ఉద్దేశ్యం లేదు...
ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఉద్దేశం నాకు లేదు. నాకు అంత అంగబలం, అర్థబలం లేదు. సీఎస్‌గా పని చేసి అన్ని అనుభవించిన వ్యక్తిని ఎమ్మెల్యే కావాలని కోరుకుంటానా?. ఎమ్మెల్యే పదవో... ఇంకేదో నేను ఆశించలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నేను జీతమేమీ తీసుకోవడం లేదు. ఏం తప్పు చేశానని నాపై అభాండాలు వేస్తున్నారో తెలీదు. జేసీ దివాకర్ రెడ్డి విషయంలో నేను స్పందించిన దాంట్లో తప్పేమీ లేదు. జాతీయ స్థాయి నాయకులు సర్పంచ్ స్థాయి దాటలేదని నేను స్పందించా. నాపై రియాక్ట్ అయిన వ్యక్తి ఒక టీడీపీ కార్యకర్త. ఇక పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అరెస్ట్ విషయంలో నేను చాలా ఫీలయ్యాను. ఫేస్‌బుక్ ఉన్నదే అభిప్రాయాలు చెప్పడానికి. డొనాల్డ్ ట్రంప్, మాల్యా నుంచి శ్రీకాకుళం అరటిపండు వరకూ నేను అన్నింటిపై స్పందించా.
చరిత్రను వక్రీకరించిన సినిమాకు రాయితీనా?
గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వడం సరికాదని పోస్ట్ పెట్టా. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నా. చరిత్రను వక్రీకరించిన సినిమాకు పన్ను రాయితీ ఎలా ఇస్తారు?. అలాగే టీటీడీ ఈవో దక్షిణాది వ్యక్తికి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్తరాది వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఏముందని నాకనిపించింది. పొలిటికల్ మైలేజ్ రావడం లేదని నాపై పెద్ద అభాండం వేశారు. పొలిటికల్ మైలేజ్ రావాలంటే భజన చేయాలా? నేను అలాంటి వ్యక్తిని కాను. భజన కావాలనుకంటే అలాంటి వ్యక్తిని పెట్టుకోవాల్సింది.
ఏపీ ప్రజలకు వాస్తవాలు చేరడం లేదు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజాలు వెళ్లడం లేదు. న్యూట్రల్ న్యూస్ పేపర్ లేకపోవడంతో చాలా విషయాలు వారికి తెలియడం లేదు. ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబును లగడపాటి రాజగోపాల్ కలిస్తే తప్పులేదు కానీ, నేను వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పా?. బాపట్లలో స్థానిక ఎమ్మెల్యేను కలవడంలో తప్పేముంది. ఏపీ రాజధాని భూములపై త్వరలో పుస్తకం రాస్తా. అన్ని విషయాలను అందులో వెల్లడిస్తా.
మరిన్ని కథనాలు...
వేటుకు ఐవైఆర్ ఫేస్‌బుక్ పోస్టులే కారణమా?
‘ఐవైఆర్ తొలగింపు మంచి నిర్ణయం’
ఐవైఆర్ కృష్ణారావుపై ఏపీ ప్రభుత్వం వేటు