సీఎం కోసం ఆరు నెలలు తిరిగినా దర్శనం దొరకలేదు | There are many things in the capital issue .. I write the book says IYR krishnarao | Sakshi
Sakshi News home page

సీఎం కోసం ఆరు నెలలు తిరిగినా దర్శనం దొరకలేదు

Published Wed, Jun 21 2017 1:33 AM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM

సీఎం కోసం ఆరు నెలలు తిరిగినా దర్శనం దొరకలేదు - Sakshi

సీఎం కోసం ఆరు నెలలు తిరిగినా దర్శనం దొరకలేదు

రాజధానిపై చాలా అంశాలున్నాయి.. పుస్తకంగా రాస్తా: ఐవైఆర్‌ కృష్ణారావు
బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా తప్పుకొమ్మంటే రాజీనామా చేసేవాడిని

సాక్షి, అమరావతి: ఆరు నెలలుగా శతవిధాలా ప్రయత్నించినా ముఖ్యమంత్రి చంద్రబాబు  అపాయింట్‌ మెంట్‌ దొరకలేదని, ఈ పరిణామం మనసుకు తీవ్ర బాధ కలిగించినా వెనుకబడిన బ్రాహ్మణ సమాజం ప్రయోజనాల కోసం భరిస్తూ.. పనిచేస్తూ వచ్చానని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్, అర్చక సంక్షేమ సంఘం మాజీ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. ఆయన మంగళవారం  సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లు, షేరింగ్‌లపై ప్రభుత్వం ఎలాంటి వివరణ అడగలేదన్నారు. అడిగి ఉంటే కచ్చితంగా సమాధానం చెప్పి ఉండేవాడినని వెల్లడించా రు. అయితే, విదేశాల నుంచి కొందరు ఫోన్‌ చేసి తనను పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడం ఆశ్చర్యం కలిగించింద న్నారు. నీవే తల్లివి.. నీవే తండ్రివి.. అంటూ భజన చేయడం తన వల్ల కాదని స్పష్టం చేశారు. కృష్ణారావు ఇంకా ఏం చెప్పారంటే...

‘‘నన్ను బ్రాహ్మణ కార్పొరేషన్‌ పదవి నుంచి తొలగించారని ఇంతకు ముందే టీవీలో చూశాను. తప్పుకొమ్మని అడిగితే వెంటనే రాజీనామా చేసేవాడిని. తొలగించాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వానికి నాకంటే మైలేజీ ఇచ్చేవారు ఉంటే వారికే పదవి ఇచ్చుకోవచ్చు. నేను కోరుకునేది ఒక్కటే. బ్రాహ్మణుల అభివృద్ధి లక్ష్యం దెబ్బతినకుండా పనిచేసే వారికే ఈ బాధ్యతలు అప్పగించాలి. సమర్థులు చాలామంది ఉండొచ్చు. ఇది చాలదు, ఇంకా చేయాలన్న తపన ముఖ్యం.

జీతం లేకుండా పనిచేస్తున్నా...
ముఖ్యమంత్రిని కలవడానికి గత ఆరు నెలల్లో నాలుగుసార్లు సీఎం పేషీకి వెళ్లాను. అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. ఈ పరిణామం బాధ కలిగించినా బ్రాహ్మణ సమాజం కోసం భరించాను. జవాబుదారీతనంతో పని చేయడం లేదంటూ నాపై చేసిన విమర్శలు అవాస్తవం. నాకు కేబినెట్‌ ర్యాంక్‌ ఇవ్వలేదు. ఇచ్చామని చెబుతున్నారు. రూ.2 లక్షల జీతం అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇలా నాపై పెద్ద అభాండాలు వేశారు. నేను జీతం లేకుండా పనిచేస్తున్నా. కొన్ని సౌకర్యాలు మాత్రమే ఉపయోగించుకుంటున్నాను.

పెద్ద పోస్టు వదులుకున్నా...
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా పదవీ విరమణ చేయగానే నాకు సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌ పోస్టు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అది పెద్ద పోస్టు అయినా నేను వద్దన్నాను. మా సమాజానికి(బ్రాహ్మణ) వేరే కార్యక్రమాలు చేయాల్సి ఉందని, అందువల్ల బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తే లక్ష్య సాధనకు పట్టుదలతో, ఇష్టంతో పనిచేస్తానని చెప్పా. నా విజ్ఞప్తికి ఒప్పుకునే ఆ పదవి ఇచ్చారు.

బ్రాహ్మణ కార్పొరేషన్‌లో చాలామంది తెలుగుదేశం పార్టీ వారే సభ్యులుగా ఉన్నారు. ఏ సమాచారం ఉన్నా నేను వారికి చెప్పేవాడిని. బ్రాహ్మణ కార్పొరేషన్‌ సమావేశం సమాచారం టీడీపీ ఎమ్మెల్యేలకు చేరడం లేదని, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు చేరుతోందనేది మరో విమర్శ. కార్పొరేషన్‌ సమావేశం వివరాలను నేను సమన్వయకర్తలకు పంపుతాను. వారు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వడం లేదంటే టీడీపీలోనే ఏదో పెద్ద లోపం ఉండి ఉండాలి. బ్రాహ్మణ కార్పొరేషన్‌ నుంచి రుణాలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని ఇంకో విమర్శ చేస్తున్నారు. అలాంటి ఆరోపణలపై నాకు అభ్యంతరాలున్నాయి.

టీడీపీ, వైఎస్సార్‌సీపీ అని ఉంటారా?
లబ్ధిదారుల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ అని ఉండరు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించి, జన్మభూమి కమిటీల ప్రమేయం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశాం. బీజేపీ ప్రచారానికి విశాఖకు వెళ్లారని కూడా ఆరోపించారు. గుంటూరులో యడవల్లివారి సత్రం, నెల్లూరులో అయ్యలూరివారి సత్రాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని నేను దేవాదాయ శాఖ మంత్రిని కోరాను. ముఖ్యమంత్రికి ఫైల్‌ పంపితే పనికాదని, మంత్రి స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలని చెప్పాను. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళితే ఆ ఫైల్‌ ఆగిపోతుంది. మంత్రి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే నన్ను విశాఖకు ప్రచారానికి రమ్మని కోరారు. టీడీపీకి బీజేపీ మిత్రపక్షం, పైగా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వారు పిలిచినందున నేను వెళ్లాను.

చరిత్రను వక్రీకరిస్తే రాయితీనా?
గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడం సరికాదని పోస్ట్‌ పెట్టా. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నా. చరిత్రను వక్రీకరించిన సినిమాకు పన్ను రాయితీ ఎలా ఇస్తారు? బాహుబలి చిత్రాన్ని ఎక్కువ షోలు ప్రదర్శించేందుకు అనుమతించడాన్ని కూడా  తప్పుబట్టా. టీటీడీ ఈవో పదవిని దక్షిణాది వ్యక్తికి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్తరాది వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఏముందని నాకనిపించింది. ఇవన్నీ కేవలం వారం రోజుల్లో పెట్టిన పోస్టింగ్‌లు, షేరింగ్‌లే. పొలిటికల్‌ మైలేజీ రావడం లేదని నాపై పెద్ద అభాండం వేశారు. అదేమిటో నాకు అర్థం కావడంలేదు. పొలిటికల్‌ మైలేజీ అంటే... నీవే తల్లివి.. నీవే తండ్రివి.. అంటూ భజన చేయాలా? అది నావల్ల అయ్యే పనికాదు. టీడీపీకి బ్రాహ్మణ సమాజాన్ని తాకట్టు పెట్టానని నాపై మా వారిలో విమర్శ ఉంది. ప్రతి లబ్ధిదారుడికి ముఖ్యమంత్రి సంతకంతో లెటర్‌ పంపుతున్నాం. ఇంతకంటే మైలేజీ ఇచ్చే వారుంటే మంచిదే.. పదవి ఇచ్చుకోవచ్చు.

పదవులు ఆశించలేదు
ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఉద్దేశం నాకు లేదు. నాకు అంత అంగబలం, అర్ధబలం లేవు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన నేను ఎమ్మెల్యే కావాలని కోరుకుం టానా? ఎమ్మెల్యే పదవో, ఇంకేదో నేను ఆశించలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. చైర్మన్‌ హోదా లో నేను జీతమేమీ తీసుకోవడం లేదు. ఏం తప్పు చేశానని నాపై అభాండాలు వేస్తున్నారో తెలియదు. జేసీ, కేశినేని నాని ఏం మాట్లాడినా చర్యలు తీసుకోరు. ఈ విషయంలో నేను స్పందించిన దాంట్లో తప్పేమీ లేదు. జాతీయ స్థాయి నాయకులు సర్పంచ్‌ స్థాయి దాటలేదని నేను స్పందించా. నాపై రియాక్ట్‌ అయిన వ్యక్తి ఒక టీడీపీ కార్యకర్త. ఇక ‘పొలిటికల్‌ పంచ్‌’ అడ్మిన్‌ రవికిరణ్‌ ఇంటూరి అరెస్ట్‌ విషయంలో నేను చాలా ఫీలయ్యాను.

ప్రజలకు వాస్తవాలు చేరడం లేదు
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నిజాలు చేరడం లేదు. ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబును లగడపాటి రాజగోపాల్‌ కలిస్తే తప్పులేదు కానీ, నేను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పా? ఇదేనా పాలసీ? బాపట్లలో శిక్షణ కార్యక్రమం పెట్టేటప్పుడు స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతిని ఆహ్వానించారు. అప్పుడే ఆయనను ఎందుకు పిలిచారని నన్ను ప్రశ్నించారు. ప్రొటోకాల్‌ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేను పిలవాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్పాం. వ్యక్తిగత హోదాలో పిలిస్తే నేను ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిశా. రాజధానిపై చాలా అంశాలు ఉన్నాయి. అవి ప్రజలకు తెలియాల్సి ఉంది. అన్ని అంశాలను పుస్తకంగా రాస్తా’’ అని ఐవైఆర్‌ కృష్ణారావు స్పష్టం చేశారు.

తప్పుడు తేదీలతో జీవో
బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి నుంచి ఐవైఆర్‌ కృష్ణారావును తొలగిస్తూ ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన జీవో తప్పుల తడకగా ఉంది. తేదీలను తప్పుగా పేర్కొన్నారు. 2017 జూన్‌ 29వ తేదీన కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరే షన్‌ ౖచైర్మన్‌గా నియమించినట్లు, ఆ పదవి నుంచి ఆయనను మంగళవారం (2017 జూన్‌ 20) తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా 2016 జనవరి 29న నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement