పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డితో కలసి నడుస్తున్న పారిశుధ్య కార్మికులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగానే హామీలను నెరవేర్చేందుకు కసరత్తు మొదలు పెట్టారు. తన పాలన జనరంజకంగా ఉండాలనే ఆలోచనతో మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రైతులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులను ఆకట్టుకునేలా తొలి కేబినెట్ సమావేశంలో సీఎం పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
సాక్షి, అమరావతి : తాము అధికారంలోకి వస్తే దశల వారీగా రూ. 3 వేలు పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాలో 4,38,500 మంది పింఛన్లు అందుకుంటున్నారు. నెలకు సుమారు రూ. 98.66 కోట్ల వరకు పింఛనుదారులకు అందిస్తున్నారు. గత ప్రభుత్వం పింఛనుదారుడికి నెలకు రూ. 2 వేలు అందచేసింది. జగన్ ఇచ్చిన హామీ మేరకు జూన్ 1 నుంచి ప్రతి పింఛనుదారుడికి రూ. 250 అదనంగా అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని వల్ల జిల్లాలో రూ. 3.63 కోట్ల అదనపు భారం పడుతోంది. జూన్‌లో పెంచిన ఈ మొత్తం జులై 1 నుంచి పంపిణీ చేసే పింఛన్లతో చేరుస్తారు.
ఆశ వర్కర్లకు రూ.10 వేలు
పాదయాత్ర సందర్భంగా ఆశ వర్కర్లు సీఎం జగన్‌ను కలసినప్పుడు నెలకు రూ.10 వేలు వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆశ వర్కర్లు నెలకు రూ. 3 వేల చొప్పున వేతనం అందుకొని పనిచేస్తూ వస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఆశ కార్యకర్తల వేతనాల పెంపుపై పెట్టారు. దీనివల్ల జిల్లాలో 3,347 మంది ఆశ వర్కర్లకు నెలకు రూ. 10 వేలు అందనుంది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 3 వేలు కాకుండా ఇక అదనంగా రూ. 7 వేలు అందించే విధంగా కేబినెట్‌లో ఆమోదించారు.
ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం..
నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఎన్నో రాయితీలను ఇస్తోంది. కానీ నష్టాల నుంచి బయటపడే పరిస్థితి లేకపోవడంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. జిల్లాలో 14 ఆర్టీసీ డీపోలుండగా కేవలం మూడు డిపోల నుంచి మాత్రమే ఆర్టీసీకి ఆదాయం వస్తోంది. మిగిలిన 11 డిపోలు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈ డిపోల ద్వారా 6,500 మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తే ఈ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా గుర్తింపు పొందుతారు. నష్టాలు ఉన్నా ఆర్టీసీని ప్రభుత్వమే ఆదుకుంటుంది. ఆర్టీసీ కార్మికులకు ఓ భరోసా లభిస్తుంది. దీనిపై కేబినెట్‌లో చర్చించి సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు.
మున్సిపల్ కార్మికులు వేతనాల పెంపు..
మున్సిపల్ కార్మికులు ప్రస్తుతం రూ.12 వేలు వేతనం అందుకుంటున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న డిమాండ్ ఈ కార్మిక సంఘాల నుంచి వ్యక్తమవుతూ వస్తోంది. అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంపు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. జిల్లాలో మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులు 7 వేల మంది వరకు ఉన్నారు. వీరందరికీ ఇక నెలకు రూ. 18 వేల చొప్పున వేతనం అందించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్మికులే కాకుండా పంచాయతీరాజ్, హాస్పిటల్స్ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కూడా రూ. 18 వేలు చొప్పున వేతనం పెంచారు.
జనవరి నుంచి ‘అమ్మఒడి’ పథకం..
‘పేదింటి పిల్లలు చదువుకు ఏ తల్లి భయపడొద్దు.. పిల్లలని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తాం’ అని నవరత్నాల పథకంలో భాగంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని జనవరి 26 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే పిల్లలుకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం అమలు కావడం ద్వారా జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే 3.43 లక్షలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 2.61 లక్షల మంది విద్యార్థుల తల్లులకు మేలు జరుగుతుంది. ఏటా ఇచ్చే రూ.15 వేలు నేరుగా విద్యార్థుల తల్లికే అందచేస్తారు.
ఇవే కాకుండా ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని జులై 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 38 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులకు మేలు జరుగుతోంది. అంగ్‌వాడీ టీచర్లకు రూ. 10,500 నుంచి రూ. 11,500లకు పెంచారు. అలాగే అంగన్‌వాడీ ఆయాలకు రూ. 6 వేల నుంచి రూ. 7 వేలు వేతనం పెంచారు. మెప్మా, సెర్ఫ్ కార్యాలయాల్లో పనిచేస్తున్న యానిమేట్లు, బుక్ కీపర్లకు గౌరవ వేతనం రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఇక ప్రతి మండలంలోనూ 104, 108 వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. ఆగస్టు 15లోగా గ్రామ వలెంటీర్లు, అక్టోబరు 2లోగా గ్రామ సచివాలయల్లో పనిచేసే ఉద్యోగుల నియామకాలను పూర్తి చేస్తారు. దీంతో జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 23,461 మంది వలంటీర్లకు ఉపాధి లభించనుంది. అలాగే 9,800 సచివాలయ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ గ్రామ వలెంటీర్ల ద్వారా రేషన్ సరుకులను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే చేర్చేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులందరికీ గత ప్రభుత్వం బకాయి పడ్డ ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించనుంది. అలాగే రైతులందరికీ వడ్డీలేని రుణాలను అందచేయాలని నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment