హైదరాబాద్ : తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించేందుకు అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయకు అనుమతించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పిటిషన్పై సోమవారంలోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సీబీఐకి న్యాయస్థానం ఆదేశించింది.
నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రైతుల సమావేశంలో, ట్రాక్టర్ల ర్యాలీని అక్టోబర్ 1న విజయమ్మ నేతృత్వంలో తలపెట్టడం, అనంతర పరిణామాల్లో జగన్ బెయిల్‌పై విడుదలవడం తెలిసిందే. ర్యాలీకి తాను స్వయంగా సారథ్యం వహించాలని ఆయన భావిస్తున్నారు.
అయితే 1, 2 తేదీల్లో ఇడుపులపాయ వెళ్లాలని జగన్ యోచిస్తుండటం, 3న విచారణ కోసం కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో ర్యాలీని 4న జరపాలని యోచిస్తున్నారు. అందులో పాల్గొనేందుకు అనుమతించాల్సిందిగా కోర్టును జగన్ కోరారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు అక్టోబర్ నాలుగో తేదీకి వాయిదా వేసింది.