జగన్ బెయిల్ ఆంక్షలు సడలించవద్దు: సీబీఐ
హైదరాబాద్ : ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతించాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ అభ్యంతరం తెలిపింది. నాంపల్లి సీబీఐ కోర్టులో సోమవారం సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జగన్ బెయిల్ ఆంక్షలు సడలించవద్దని కోరింది. సాక్షులంతా హైదరాబాద్ వెలుపలే ఉన్నారని, జగన్ పలుకుబడి ఉన్న వ్యక్తి అయినందున...వారిని ప్రభావితం చేయవచ్చని ని న్యాయస్థానంలో పేర్కొంది. ఈ కేసులో నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారని..... వారి బెయిల్ పిటిషన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపింది. బెయిల్ షరతులు సడలిస్తే తమ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని కౌంటర్ పిటిషన్లో వెల్లడించింది.
సీబీఐ కౌంటర్ పిటిషన్పై జగన్ తరపు న్యాయవాది సుశీల్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. జగన్పై ఉన్నది హైలీ టెక్నికల్ కేసు అని. సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం లేదని, ప్రతి సాక్ష్యం డాక్యుమెంట్గా రికార్డు అయ్యిందన్నారు. 70మంది నిందితుల్లో 2౦మందిని నిర్దోషులని సీబీఐ చెప్పిందన్నారు. 9 కంపెనీల్లో క్విడ్ ప్రో కోనే లేదని సీబీఐ చెప్పిందన్నారు. కోర్టు కల్పించిన స్వేచ్చను తాము కోల్పోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులు ఉల్లంఘించమని సుశీల్ కుమార్ న్యాయస్థానానికి విన్నవించారు. తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడానికే జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారని.... ఇడుపులపాయ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తారని ఆ తర్వాత 4వ తేదీన గుంటూరు వెళ్తారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సాయంత్రానికి వాయిదా వేసింది.