అనకాపల్లి: అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో ఏడాదికేడాది లావాదేవీలు తగ్గిపోతున్నాయి. 2014-15 సీజన్ చేదు గణాంకాలను నమోదు చేసుకోనుంది. మా ర్కెట్ వర్గాలే పరిస్థితి నిరాశజనకంగా ఉంటుందని పేర్కొంటున్నాయి. హుద్‌హుద్ ప్రభావంతో లావాదేవీలు 50శాతం తగ్గిపోనున్నాయని విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం పొలాల్లోని చెరకు తోటలు దయనీయ స్థితిలో ఉన్నాయి. ఈ కారణంగా బెల్లం దిగుబడులు బాగా తగ్గిపోయే ప్రమాదముందని అంటున్నారు.
దీనివల్ల టర్నోవర్‌తో పాటు మార్కెట్‌కు లభించే సెస్ కూడా తగ్గనుంది. గతేడాది అక్టోబర్‌లో 7981 క్వింటాళ్ల బెల్లం (రూ.2.27 కోట్లు) లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది అదే నెలలో కేవలం 4942 క్వింటాళ్ల బెల్లం (రూ.1.19 కోట్లు) లావాదేవీలు ఇందుకు నిదర్శనం అంటున్నారు. 2013-14 సీజన్‌లో 6,06,475.4 క్వింటాళ్ల బెల్లం లావాదేవీలతో రూ.144.65 కోట్ల వ్యాపారం జరిగింది. 2014-15 సీజన్‌లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 1,87,079 క్వింటాళ్ల బెల్లం లావాదేవీలతో రూ.41.03 కోట్ల వ్యాపారం జరిగింది. గత సీజన్ లావాదేవీలను చేరుకోవాలంటే రానున్న ఐదు నెలల్లో రూ.వంద కోట్లు పైబడి వ్యాపారం జరగాలన్నమాట.
సోమవారం 3888 బెల్లం దిమ్మలు మార్కెట్‌కు రాగా, మొదటిరకం గరిష్టంగా రూ. 3010లు, మూడో రకం రూ.2300లు పలికింది. దీంతో మార్కెట్ కళకళలాడగా, మంగళవారం నాటికి బెల్లం దిమ్మల సంఖ్య 1742కి పడిపోయింది. మొదటిరకం గరిష్టంగా క్వింటా రూ.3290లు, మూడో రకం రూ.2250లకు తగ్గింది. వాస్తవానికి మూడేళ్లుగా అక్టోబర్, నవంబర్‌లలో తుఫాన్‌లు, సమైక్యాంధ్ర ఉద్యమాల కారణంగా అనకాపల్లి మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కోగా.. ఈ ఏడాది హుద్‌హుద్‌తో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.
అనకాపల్లి మార్కెట్ నుంచి నవంబర్, డిసెంబర్ నెలల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌కు బెల్లం ఎగుమతి అవుతుంటుంది. జనవరి నాటికి చిత్తూరు నుంచి కూడా బెల్లం ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఇప్పుడవన్నీ ఉత్తరప్రదేశ్‌లో బెల్లం ఉత్పత్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వర్తకులు చెబుతున్నారు.
బెల్లం మార్కెట్‌కు చేదు ఫలితం
Published Wed, Nov 12 2014 1:39 AM | Last Updated on Mon, May 28 2018 4:20 PM
Advertisement
Advertisement