చేదు అనుభవం
అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు అన్‌సీజన్ దెబ్బ
భారీగా పడిపోయిన లావాదేవీలు
బెల్లం,మార్కెట్, నష్టాలు, అనకాపల్లి,jaggery,market,falls,anakapalli
అనకాపల్లి: జాతీయస్థాయిలో రెండోస్థానంలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్లో లావాదేవీలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో అటు వర్తకులు, ఇటు కార్మికులు సతమతమవుతున్నారు. ఉత్తరభారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అనకాపల్లి బెల్లానికి మంచి డిమాండ్. సహకార రంగంలోని చక్కెర మిల్లులు ఒక్కొక్కటిగా మూతపడుతున్న తరుణంలో బెల్లానికి ప్రాధాన్యం పెరుగుతుందని విశ్లేషకులు భావించారు. ఐతే దీని తయారీకి ముడి సరుకైన చెరకు సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోవడంతో దాని ప్రభావం బెల్లం లావాదేవీలపై పడుతోంది. సహజంగా అనకాపల్లి బెల్లం మార్కెట్లో సెప్టెంబర్, అక్టోబర్ నుంచి లావాదేవీలు ప్రారంభమవుతాయి. జనవరి, ఫిబ్రవరిలో అధికంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు సీజన్ కొనసాగుతుంది. మే, జూన్ నాటికి రైతులు బెల్ల తయారీ, అమ్మకాలు ఆపేస్తారు. ఆ సమయంలో కోల్డ్‌స్టోరేజీలో ఉన్న బెల్లాన్ని పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్ మేరకు కొంచెం కొంచెంగా విక్రయిస్తారు. ఈ కారణంగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో బెల్లం లావాదేవీలు లేక మార్కెట్ వెల వెలబోతుంది. కొలగార్లు, కలాసీలు, బెల్లాన్ని రైతుల నుంచి మార్కెట్‌కు తరలించే వాహనాల యజమానులు, డ్రైవర్లు, మార్కెట్లో పని చేసే గుమస్తాల ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయి.
184 క్వింటాళ్ల లావాదేవీలు...
జూలై నెలలో శుక్రవారం నాటికి కేవలం 184 క్వింటాళ్ల లావాదేవీలతో 5.29 లక్షల వ్యాపారం మాత్రమే జరిగింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 66,815 క్వింటాళ్ల లావాదేవీలతో 18.25 కోట్ల వ్యాపారం సాగింది. ఇందులో ఏప్రిల్ నెలలో అత్యధికంగా రూ.15 కోట్లు జరిగింది. మే, జూన్, జూలై మాసాల్లో కేవలం రూ. 3 కోట్లే వ్యాపారమన్నమాట. గత సీజన్‌లో జూలైలో 3వేల క్వింటాళ్ల బెల్లం లావాదేవీలు జరిగాయి. 2014–15సీజన్‌లో మొత్తంగా 5,67, 575 క్వింటాళ్ల లావాదేవీలతో 121.42 కోట్ల వ్యాపారం జరిగింది. 2015–16లో 4, 81, 694 క్వింటాళ్ల లావాదేవీలతో రూ. 108 కోట్లకు వ్యాపారం పడిపోయింది. అంటే జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం, ఉత్పాదక శక్తి తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. రానున్న సీజన్ మరీ గడ్డుగా ఉంటుందని వ్యవసాయ రంగ నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా జిల్లాలో ప్రధాన వాణిజ్యపంటైన చెరకు సాగు, దాని చుట్టూ ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడకపోతే చెరకుపై ఆధారపడిన నాలుగు చక్కెర కర్మాగారాలు, బెల్లం మార్కెట్‌కు గడ్డు పరిస్థితులు తప్పవన్న వాదన వ్యక్తమవుతోంది. ఈక్రమంలోనే తుమ్మపాల చక్కెర కర్మాగారం గానుగాట నిలిచిపోవడం ఒక చేదు ఫలితంగా చెప్పవచ్చని వారు పేర్కొంటున్నారు.
చేదు అనుభవం
Published Sat, Jul 23 2016 4:55 PM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM
Advertisement
Advertisement