శాసనమండలి రద్దును స్వాగతిస్తున్నాం! | Jakkampudi Raja Comments In Bike Rally At Vijayawada | Sakshi
Sakshi News home page

బినామీలను కాపాడుకునేందుకే బాబు తాపత్రయం

Published Mon, Jan 27 2020 2:22 PM | Last Updated on Mon, Jan 27 2020 2:35 PM

Jakkampudi Raja Comments In Bike Rally At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: పెద్దల సభలో పెద్ద మనసుతో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వారు చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. చంద్రబాబు పైశాచిక ఆనందం, వికృత చేష్టలతో రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శాసన సభ, శాసన మండలి సాక్షిగా టీడీపీ అనుసరిస్తున్న ‍ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ సిటీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. భవానీపురం స్వాతి థియేటర్‌ నుంచి సితార్‌ సెంటర్‌ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ విధానాన్ని, తన బినామీలను కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఆర్‌డీఏను చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీగా మార్చేశారని విమర్శించారు. బాబు విధానాలతో టీడీపీ తర్వాతి ఎన్నికల్లో 23 సీట్ల నుంచి సింగిల్‌ డిజిట్‌కు పరిమితం అవుతుందని జోస్యం పలికారు.

సామాన్యుడికి వాటితో పనిలేదు
సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమని, హైదరాబాద్‌ తరహాలో పొరపాటు జరగకూడదనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. సామాన్యుడికి ఐకానిక్‌ టవర్స్‌తో, రాజధానితో పనిలేదని, సంక్షేమ ఫలాలు అందాలని మాత్రమే కోరుకుంటారని పేర్కొన్నారు. అమరావతిలోనే లక్ష కోట్ల పెట్టుబడి పెడితే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇక సీఎం జగన్‌ శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

చదవండి: అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement