
మృతదేహానికి వైద్యం
ఠాగూర్ సినిమాలో మృతదేహానికి వైద్యం పేరిట చేసిన హడావుడికి ఏ వూత్రం తీసిపోకుండా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఓ ఆస్పత్రిలో బుధవారం హైడ్రావూ నడిచింది.
జమ్మికుంటలో వైద్యుడి నిర్వాకం
రెండు గంటల పాటు హైడ్రామా
ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
జమ్మికుంట, న్యూస్‌లైన్: ఠాగూర్ సినిమాలో మృతదేహానికి వైద్యం పేరిట చేసిన హడావుడికి ఏ వూత్రం తీసిపోకుండా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఓ ఆస్పత్రిలో బుధవారం హైడ్రావూ నడిచింది. మృతుడి బంధువుల కథనం ప్రకారం... జమ్మికుంట మండలం మల్యాల పరిధి వాగొడ్డు రామనపల్లికి చెందిన ఆగమ్మ-రాజేశ్వర్‌రావు కుమారుడు కారెట్లపల్లి శ్రీనివాస్(30) కు కొన్నేళ్ల క్రితం లక్ష్మితో పెళ్లయింది. వీరికి 3 నెలల బాబు ఉన్నాడు. ఏ పని చేయుకుండా తిరుగుతున్న శ్రీనివాస్‌ను తండ్రి సోవువారం వుందలించాడు. మనస్తాపానికి గురైన శ్రీనివాస్ క్రిమిసంహారక మందును తాగుతుండగా కుటుంబసభ్యులు అడ్డుకుని హుటాహుటిన జమ్మికుంటలోని మమత నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. రెండు రోజులుగా చికిత్స చేస్తున్నారు. బుధవారం శ్రీనివాస్ చనిపోయాడు.
చనిపోయిన విషయం వైద్యులకు తెలిసినప్పటికీ కుటుంబసభ్యులకు తెలపకుండా అతడు బతికే ఉన్నాడని, ఆక్సిజన్ ఎక్కిస్తున్నామంటూ హైడ్రామా సృష్టించారు. కుటుంబసభ్యులు వచ్చి చూసినప్పుడు ఆక్సిజన్ ప్రభావంతో శరీరం కదులుతున్నట్లు కనబడింది. సాయంత్రం ఏడు గంటల సమయంలో శ్రీనివాస్ చనిపోయినట్లు వైద్యుడు తెలిపారు. అతను చనిపోయి మూడు గంటలు గడిచినా కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తారనే నెపంతో ‘పరిస్థితి విషమంగా ఉంది... వరంగల్‌కు తరలించాలి’ అంటూ అంబులెన్స్‌ను సైతం ఏర్పాటు చేశారు.
శవానికి వైద్యం చేస్తున్న డాక్టర్ సుధాకర్ తీరుపై మృతుడి బంధువులు, నాయకులు ఆందోళనకు దిగారు. డాక్టర్‌ను నిలదీశారు. ఈ క్రమంలో వైద్యుడికి నాయకులు, విద్యార్థి సంఘాలకు మధ్య వాగ్వాదం జరిగింది. వైద్యుడి సూచన మేరకే శ్రీనివాస్‌కు ఆక్సిజన్ ఎక్కించామంటూ ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది చెప్పారు. శవానికి వైద్యం విషయమై డాక్టర్ సుధాకర్‌ను వివరణ కోరగా... శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని, ట్రీట్‌మెంట్ చేసే క్రమంలో గుండెపోటు వచ్చి 5 గంటల ప్రాంతంలో చనిపోయాడని తెలిపారు. ఆస్పత్రి సిబ్బందికి చనిపోయిన విషయం తెలియక ఆక్సిజన్ పెట్టినట్లున్నారని అన్నారు.