
భజన సేన తో జరభద్రం
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా సంపాదించేయాలన్న ఆశ.. కాస్తో కూస్తో నిజాయితీపరుడిగా ఉన్నపేరు పోయి అవినీతిపరుడిగా ముద్ర పడిపోతుందోమోనన్న అనుమా నం.. ఇలా రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక అధికారికి ఈ మధ్యకాలంలో ఓ మంచి అవకాశం వచ్చిపడింది. తన బిడ్డ పుట్టిన రోజును పురస్కరించుకుని భారీ వేడుక నిర్వహించారు. అంతే.. ఎన్నాళ్లగానో సదరు అధికారిని ప్రసన్నం చేసుకునేందుకు అవకాశం కోసం వేచిచూస్తున్న వారంతా కానుకలతో క్యూ కట్టారు. విలువైన వస్తువులు వెల్లువలా వచ్చిపడ్డాయి. భారీస్థాయిలో నగదూ గిట్టుబాటైంది. హమ్మయ్య ఈయన పంట పండింది. ‘మనల్ని కొన్నాళ్లు బాగానే చూసుకుంటాడు...’ అనుకుని ఎవరికి వారు ఊరట చెంది ఆ వేడుక నుంచి తృప్తిగా బయటపడ్డారట. సదరు అధికారి మాత్రం ఇన్నాళ్లకు ఓ ఫంక్షన్ చేస్తే వచ్చింది ఇంతేనా అన్న అనుమానంతో ఇంకో ఫంక్షన్ పెట్టేందుకు ఆశగా ఎదురు చూస్తున్నారట.
భజన సేన
రాష్ట్రంలో సరిగ్గా ఎన్నికల వేళ పుట్టుకొచ్చిన జనసేన పార్టీ గురించి తెలియని వారుండకపోవచ్చు. ఎన్నికల తర్వాత రాజకీయంగా ఎక్కడా సదరు పార్టీ అధినేత ఊసు లేదు కానీ.. పార్టీ అభిమానుల హడావుడి మాత్రం ఇక్కడ బాగానే కనిపిస్తోంది. అది కూడా కేవలం ఫ్లెక్సీలు, బ్యానర్ల రూపంలోనే. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు, పదవులు
చేపట్టిన మంత్రులు, ఇతర నాయకులను అభినందిస్తూనో, కృతజ్ఞతలు ప్రకటిస్తూనో ఊళ్లలో రోడ్ల వెంబడి ఎక్కడిక్కడ జనసేన పేరిట భారీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ప్రశ్నించడానికే తమ పార్టీ పుట్టుకొచ్చిందంటూ ఎన్నికల వేళ పార్టీ నేత ఆవేశపూరిత ప్రసంగాలు చేయగా.. ఇక్కడ మాత్రం కేవలం ప్రశంసించడానికే పార్టీ అభిమానులుగా చెప్పుకుంటున్న వారు పాకులాడుతున్నారు. జనం గురించి, జనం సమస్యల గురించి కనీసమాత్రంగానైనా స్పందించాలన్న సామాజిక స్పృహ లేని సేన క్యాడర్ ఫ్లెక్సీలపై మంచి కొటేషన్లు రాస్తూ నానా హడావుడి చేస్తోంది. ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రానే అంతా అయిపోతుందా?
మధ్యలో ఈ ‘గారి’లేంటో
హైదరాబాద్.. విజయవాడ.. విశాఖపట్నం.. ఇలా ఏ ఊళ్లోనైనా మహాత్మా గాంధీ రోడ్డు.. కార్ల్‌మార్క్స్ స్ట్రీట్.. బీసెంట్ రోడ్డు వంటి పేర్లతో వీధులు కనిపిస్తుంటాయి. కానీ ఫలానా సుబ్బారావు గారి రోడ్డు.. అప్పారావు గారి రోడ్డు అని ఎక్కడైనా కనిపిస్తాయా? ఇవి చూడాలంటే ఏలూరు రావాల్సిందే. ఇక్కడి రోడ్ల పేర్లకు చివరలో ‘గారి’ తోకలు కనిపిస్తాయి. సదరు మనుషులంటే ఒకింత గౌరవంతో కూడిన భయంతోనే నగరపాలక శాఖ అధికారులు బహుశా ఈ ‘గార్లు’ తగిలించి ఉంటారంటారా.. ఏమో వారే చెప్పాలి.
కుర్రోళ్లూ.. జరభద్రం
ఈ మధ్యన ఓ పోలీసు అధికారి వద్దకు ఒక యువతి తల్లిదండ్రులు వెళ్లారు. ‘సార్.. మా అమ్మాయిని ఎవరో యువకుడు ఫోన్లో వేధిస్తున్నాడు.. గట్టిగా వార్నింగ్ ఇప్పించండి..’ అని వేడుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన కానిస్టేబుళ్లను పిలిచి ‘ఎవడో వీళ్లమ్మాయిని వేధిస్తున్నాడట. వాడి నంబర్ ఇదిగో. ట్రేస్ చేసి పట్టుకోండి. దొరకంగానే గట్టిగా వాయించేసి ఆ తర్వాతే మాట్లాడండి’ అని అప్పటికప్పుడు వీరావేశంతో దేశాలిచ్చేశారు. ‘ఓకే సర్..’ అంటూ పోలీసులు ఆ పనిలో పడిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే. దొరకంగానే సదరు యువకుడు అతనా కాదా.. అలా వేధిస్తున్నది నిజమా కాదా అని ఒక్కసారి కన్‌ఫర్మ్ చేసుకుని పోలీసు కోటింగ్ ఇవ్వొచ్చు. కానీ.. నాలుగు ‘తగిలించిన’ తర్వాత అతను అతను కాదని అని తెలిస్తే ఏం చేస్తారు. పోలీస్ బాస్ చెప్పారు కాబట్టి అదే కరెక్టు అనుకోవాలా.. ఏమో.. యువకులూ జరభద్రం. ముల్లు వెళ్లి ఆకు మీదపడ్డా.. ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా.. విరిగేది యువకుల ఎముకలే.
- జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు