కోవిడ్-19 (కరోనా వైరస్) నివారణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ కొనసాగుతోంది. సామాజిక దూరం పాటిస్తేనే భారత్ కోవిడ్ పోరులో విజయవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ ఇళ్లలోనే గడపాలని ప్రధాని మోదీ కోరారు. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదిట్టమైన చర్యలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జనతా కర్ఫ్యూపై లైవ్ అప్‌డేట్స్..
జయహో జనతా : (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- ఏపీలో మూడు జిల్లాలను లాక్‌డౌన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లాక్‌డౌన్ జాబితాలో ప్రకాశం, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. కరోనా కట్టడిలో భాగంగా దేశంలో 75 జిల్లాలో కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది. మార్చి 31 వరకు ఈ లాక్‌డౌన్ కొనసాగనున్నట్టు తెలిపింది.
- విజయవాడ ప్రజలంతా జనతా కర్ఫ్యూ భాగమయ్యారు. అపార్ట్‌మెంట్లలోని జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ మార్నింగ్ వాక్ చేసేవారితో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం జనతా కర్ఫ్యూతో బోసిపోయింది.
- ప్రకాశం వాసులు జనతా కర్ఫ్యూకు జైకొట్టారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణలో భాగంగా ఏపీలో ‘జనతా కర్ఫ్యూ’
- ఏపీలో సమన్వయంతో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ విభాగాలు
- రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చందంగా సేవలు నిలిపివేసిన పెట్రోల్ బంకులు
- రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి బస్టాండ్‌లలో నిలిచిపోయిన బస్సు సర్వీసులు
- విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు నగరాలతో పాటు అన్ని ప్రధాన పట్టణాల్లో మాల్స్ మూతపడ్డాయి.
- ప్రభుత్వ కార్యాలయాలు, జన సంచారం అధికంగా వున్న ప్రాంతాల్లో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మున్సిపల్, పంచాయతీ కార్మికులు
- విజయవాడలోని ఆర్టీఏ అధికారులు తాత్కాలికంగా లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలను నిలిపివేశారు.
- అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. పిల్లలు, గర్భిణీలకు ఇళ్ళకే పోషకాహారం పంపిణీ చేస్తున్నారు.
- ‘జనతా కర్ఫ్యూ’ కారణంగా ఎక్సైజ్ శాఖ డ్రై డేగా ప్రకటించింది.
- ఎక్సైజ్ శాఖ.. ఎక్సైజ్ చట్టం 20(1) ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది.
- రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూత పడ్డాయి. పర్యాటక ప్రాంతాలను తాత్కలికంగా అధికారులు మూసివేశారు.
- బొర్రా గుహలు, శ్రీశైలం రోప్‌వే, విజయవాడ భవానీద్వీపం తదితర ప్రముఖ ప్రాంతాల్లో ఈ నెల 31వ తేదీ వరకు పర్యాటకులకు అనుమతిని అధికారులు నిరాకరించారు.
- అన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ భక్తులకు అనుమతి రద్దు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసులను స్వచ్చందంగా రద్దు చేశాయి.
- ‘జనతా కర్ఫ్యూ’ కు మద్దతుగా హోల్ సేల్ మార్కెట్లు మూతపడ్డాయి. విజయవాడలోని వస్త్రలత మార్కెట్‌ను 31వరకు మూసి వేయనున్నట్లు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైతు బజార్లు, మార్కెట్‌లలో స్వచ్చందంగా రైతులు, వ్యాపారులు ‘జనతా కర్ఫ్యూ’ పాటిస్తున్నారు.
- జనతా కర్ఫ్యూలో భాగంగా విజయవాడ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ నిర్మానుష్యంగా మారింది.
రాష్ట్రం వ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణలో భాగంగా ‘జనతా కర్ఫ్యూ’ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని నీలం సాహ్ని పేర్కొన్నారు. వైద్య శాఖ నిరంతరం పనిచేస్తోందని ఆమె తెలిపారు. జనవరి 17 నుంచి కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించామని నీలం సాహ్ని చెప్పారు. ప్రజలందరూ ‘జనతా కర్ఫ్యూ’లో పాల్గొన్నారని ఆమె తెలిపారు. ప్రభుత్వ చర్యలకు ప్రజలు కూడా సహకరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం అదేశాలిస్తున్నారని నీలం సాహ్ని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని సచివాలయాల, వాలంటీర్ల ద్వారా గుర్తించామని ఆమె పేర్కొన్నారు. ప్రతి విదేశి ప్రయనికుడిని ఐసోలాషన్‌లో ఉంచుతున్నామని చీఫ్ సెక్రటరీ తెలిపారు. ఆసుపత్రులలో ఐసోలాషన్ వార్డులను ఇంకా పెంచుతామని ఆమె చెప్పారు. ప్రజలు ఎలాంటి భయం అవసరం లేదన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని నీలం సాహ్ని తెలిపారు.
విజయవాడ నగరంలో కోవిడ్-19( కరోనా వైరస్) పాజిటివ్ కేసు నమోదుకావడంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ విజవాడలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ నగరంలో మొదటి కరోనా పాజిటీవ్ కేసు నమోదైదని తెలిపారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. కరోనా పాజిటీవ్ కేసు నమోదైన ప్రదేశంలో దాదాపు 500 ఇళ్లలో మెడికల్ చెకప్‌లు చేశామని ఆయన చెప్పారు. అనుమానం ఉన్నవారు కంట్రోల్ రూంకి కాల్ చేయాలని ఆయన సూచించారు. కంట్రోల్ రూం నంబర్ 7995244260ను విడుదల చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. కరోనా లక్షణాలుంటే స్వచ్చందంగా ముందుకు రావాలని కలెక్టర్ ఇంతియాజ్ కోరారు.
సీఎం వైఎస్ జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
కరోనా వైరస్ వ్యాప్తిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఆళ్లనాని, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నిలు పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పాజిటివ్ కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్‌పై ఈ సాయంత్రం 5 గంటలకు మీడియాతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. జనతా కర్ఫ్యూ పై ప్రజల అపూర్వ స్పందన, కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై మాట్లాడతారు.
Comments
Please login to add a commentAdd a comment