
ఫిరాయిస్తే పదవులు పోతాయని..
హైదరాబాద్: పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం దారుణమని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాన్ని విస్తరించిన తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. అధికారంలో ఉన్నవాళ్లు రాజ్యాంగాన్ని అమలు చేయడం పోయి, ఉల్లంఘించే స్థాయికి ఈరోజు పరిస్థితి వచ్చిందని వాపోయారు.
పార్టీ ఫిరాయిస్తే పదవులు పోతాయని రాజ్యాంగం చెబుతోందని, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది చాలా దారుణమైన రాజ్యాంగ ఉల్లంఘన అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు చంద్రబాబు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. పార్టీని కుటుంబ ఆస్తిగా, ప్రభుత్వాన్ని వ్యాపారంగా మార్చేశారని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణలో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా మంత్రులుగా ఎలా నియమిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.