సీఎం కిరణ్, బొత్స ఇద్దరు తోడు దొంగలు: జేసీ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిపై మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విభజన అంశాలను దాచటంలో కిరణ్, బొత్స సత్యనారాయణ తోడు దొంగలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర కేంద్రమంత్రులకు అన్ని విషయాలు ముందే తెలుసని జేసీ అన్నారు. అయినా వారు సమైక్యాంద్ర అంటూ ప్రజల్ని మభ్యపెట్టారని విమర్శించారు. ఈ విషయాన్ని ముందే ప్రజలకు చెప్పి ఉండాల్సిందని జేసీ అన్నారు.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే హక్కు బొత్సకు ఉందని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాయలసీమ వాసిగా సీమాంధ్రకు రాజధాని కర్నూలునే కోరతామని అన్నారు. గుంటూరు జిల్లా మాచర్లను రాజధానిగా ఎంపిక చేయటం ఉత్తమమని జేసీ పేర్కొన్నారు.