తాడిపత్రి, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీలో ఇక తమకు రాజకీయ భవిష్యత్ లేదని జేసీ సోదరులు టీడీపీలోకి రావాలని చూస్తున్నారని, అది సాధ్యం కాదని మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం తాడిపత్రిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి వారిని పార్టీలోకి రాకుండా అడ్డుకుంటామన్నారు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ జేసీ ప్రభాకర్‌రెడ్డి టీడీపీలోకి వస్తే తాము పార్టీని వీడటానికి సైతం వెనుకాడమన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరం నాగిరెడ్డి మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉండి ఇప్పుడు టీడీపీలోకి రావాలనుకోవడం సిగ్గుగా లేదా అని జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ దౌర్జన్యాలకు ఎదురు నిలిచి పోరాడిన నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని కోరారు. చాగల్లు, పెండేకల్లు ప్రాజెక్టులు, జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం వల్ల ప్రజలకు నీరు రాకపోయినా జేసీ దివాకర్‌రెడ్డికి మాత్రం క మీషన్లు అందాయని ఆరోపించారు. డబ్బు ఉన్న వారికి పార్టీలో అందలమెక్కిస్తే, తాము ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధమేనని అన్నారు. తాడిపత్రిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు.
టీడీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు మంచి నాయకుడని, టీడీపీ మాత్రమే రాష్ట్రాన్ని ఆదుకుంటుందని చెబుతున్న నీవు.. పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌పై హిందూపురంలో ఆనాడు ఎలా పోటీ చేశారని జేసీ ప్రభాకర్‌రెడ్డిని ప్రశ్నించారు. బాబుకు కుడి భుజంగా ఉన్న పరిటాల రవిని ఎలా హత్య చేయించారని దుయ్యబట్టారు. గతంలో బాబును, టీడీపీని తిట్టిపోసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం ఇలా ఎందుకు మాట మారుస్తున్నారో కార్యకర్తలకైనా సమాధానం చెప్పాలన్నారు.
సభలో హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి ఎమ్మెల్యేలు అబ్దుల్‌ఘని, పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీలు మెట్టు గోవిందరెడ్డి, శమంతకమణి, నాయకులు హనుమంతరాయ చౌదరి, ప్రభాకర్ చౌదరి, మహాలక్ష్మి శ్రీనివాస్, సరిపూటి సూర్యనారాయణ, ప్రకాష్‌నాయుడు, విగ్రహ ఏర్పాటు కమిటీ అధ్యక్షుడు వేలూరు శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. సభలో నాయకులు జిలాన్‌బాషా, రాంశేఖర్, డీవీ కుమార్, చింబిలి రమణ, సూర్యముని, అయాబ్‌బాషా, నియాజ్‌బాషా, రావి రమేష్, సింహం నారాయణరెడ్డి, జేసీ చిత్తరంజన్‌రెడ్డి, పేరం ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
టీడీపీలోకి జేసీని రానివ్వం
Published Thu, Nov 28 2013 3:19 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement